స్తంభించిన పార్లమెంటు

హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదిక, అదానీ కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలు వరుసగా రెండో రోజూ పార్లమెంటును కుదిపేశాయి. వీటిపైనే చర్చించాలంటూ విపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి.

Published : 04 Feb 2023 03:55 IST

అదానీ షేర్ల పతనంపై చర్చకు రెండో రోజూ విపక్షాల పట్టు
జేపీసీతో దర్యాప్తు జరిపించాలన్న  డిమాండ్‌ పునరుద్ఘాటన
ఉభయ సభలు   సోమవారానికి వాయిదా

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదిక, అదానీ కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలు వరుసగా రెండో రోజూ పార్లమెంటును కుదిపేశాయి. వీటిపైనే చర్చించాలంటూ విపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. అందుకోసం ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభల సభాధ్యక్షులు తిరస్కరించడంతో ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం ఆందోళనకు దిగారు. సభా మధ్యంలోకి పదే పదే దూసుకెళ్లడంతో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్‌సభ, రాజ్యసభ సోమవారానికి వాయిదాపడ్డాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ తదితర సంస్థల నుంచి భారీ మొత్తాల్లో నిధులను అదానీ కంపెనీలకు మళ్లించడంతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని విపక్ష నేతలు విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్న డిమాండును పునరుద్ఘాటించారు. గురువారం కూడా ఇదే విషయమై ఉభయ సభలు దద్దరిల్లాయి.

రాజ్యసభ శుక్రవారం సమావేశం అయిన వెంటనే... అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు కోరగా ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ నిరాకరించారు. వారిచ్చిన 15 వాయిదా తీర్మానాలు నిర్ణీత రూపంలో లేవంటూ తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైనప్పుడు కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టేందుకు సభాధ్యక్షుడు అనుమతించిన వెంటనే నిరసనలు హోరెత్తాయి. సభా మధ్యం నుంచి వెనక్కు వెళ్లాలని ఛైర్మన్‌ హెచ్చరించినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్‌ ప్రకటించారు. లోక్‌సభలోనూ విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. సభ రెండు సార్లు సమావేశమైనప్పటికీ ముందుగా నిర్ణయించిన కార్యకలాపాలను చేపట్టలేకపోయింది. దీంతో సభను స్పీకర్‌ సోమవారానికి వాయిదా వేశారు.


16 ప్రతిపక్ష పార్టీల భేటీ

పార్లమెంటులో ఉమ్మడిగా అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్ణయించుకునేందుకు 16 విపక్ష పార్టీల నేతలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో జరిగిన భేటీలో కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ, ఆప్‌, భారాస, శివసేన, ఆర్జేడీ, జేడీయూ, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, వామపక్షాలు తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రోద్బలంతో అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ తదితర ప్రభుత్వ రంగ సంస్థల నిధులను నిష్పాక్షిక దర్యాప్తుతో మాత్రమే రక్షించుకోగలమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. అదానీ కంపెనీల అక్రమాలపై జేపీసీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 13న ఆందోళనలకు సీపీఐ పిలుపునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని