Nara Lokesh: ఆర్‌ఆర్‌ఆర్‌లో జగన్‌ను పెట్టుంటే ఆస్కార్‌ వచ్చేది

‘సొంత బాబాయ్‌ను వారే హత్యచేసి చంద్రబాబు చంపారంటూ నిందలు వేశారు. వాళ్ల కుటుంబ ప్రమేయమే ఉందని సీబీఐ విచారణలో తేలడంతో ఒక కంటిని ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుందని అసెంబ్లీలో నటించారు.

Updated : 21 Mar 2023 09:13 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘సొంత బాబాయ్‌ను వారే హత్యచేసి చంద్రబాబు చంపారంటూ నిందలు వేశారు. వాళ్ల కుటుంబ ప్రమేయమే ఉందని సీబీఐ విచారణలో తేలడంతో ఒక కంటిని ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుందని అసెంబ్లీలో నటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రాజమౌళి జగన్‌మోహన్‌రెడ్డిని పెట్టుంటే ఆ నటనకు కచ్చితంగా ఆస్కార్‌ అవార్డు వచ్చేది’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా 48వ రోజు శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ ఒక్కసారి దిల్లీ వెళ్తే రూ.కోటి ఖర్చవుతోందని, కానీ అక్కడ ఏం మాట్లాడతారో ఎవరికీ తెలీయదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని ఒక్కసారి కూడా అడిగింది లేదని ఆరోపించారు.

బీసీలకు ప్రత్యేక చట్టం: వైకాపా ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందులను బీసీలు లోకేశ్‌కు విన్నవించారు. వాటిపై ఆయన స్పందిస్తూ.. తెదేపా హయాంలో బీసీల కోసం 130 పథకాలు అమలు చేయగా జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత వంద పథకాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే బీసీల అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు చేస్తామని వివరించారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ముస్లింలకు ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాదయాత్రలో నారా లోకేశ్‌ను స్వర్ణకారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలిసి తమ ఇబ్బందులు చెప్పుకొన్నారు. తరువాత విజయలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేయడం దారుణమని నారా లోకేశ్‌్ పేర్కొన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను ఫోన్‌లో పరామర్శించారు. ఉగాది సందర్భంగా యువగళం పాదయాత్రకు ఈనెల 22 నుంచి 24 వరకు విరామం ప్రకటించారు. ఈ మూడ్రోజులూ లోకేశ్‌ శ్రీసత్యసాయి జిల్లాలోనే ఉండనున్నారు. స్థానిక నాయకులతో కలిసి ఉగాది జరుపుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని