తొమ్మిదేళ్లలో అభివృద్ధి శూన్యం.. పాదయాత్రలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క

కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎట్టకేలకు గ్రూపు-1 నోటిఫికేషన్‌ వెలువరించిన ప్రభుత్వం.. ప్రశ్నపత్రం లీక్‌చేసి.. కావాల్సిన వారికి విక్రయించిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

Published : 22 Mar 2023 04:22 IST

ఈనాడు డిజిటల్‌- ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే- జైనూర్‌: కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎట్టకేలకు గ్రూపు-1 నోటిఫికేషన్‌ వెలువరించిన ప్రభుత్వం.. ప్రశ్నపత్రం లీక్‌చేసి.. కావాల్సిన వారికి విక్రయించిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ పాదయాత్ర మంగళవారం కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం జామిని నుంచి ప్రారంభమై కెరమెరి మండలం ఝరి వరకు 18 కిలోమీటర్ల మేర సాగింది. కెరమెరిలో విక్రమార్క మాట్లాడుతూ.. పోటీపరీక్షల ప్రశ్నపత్రాలు లీకవ్వడం సర్వసాధారణమన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితులు, ఆదివాసీలు, గిరిజనేతరులు మైనారిటీలు ఎవరి గుండె చప్పుడు విన్నా బాధలే వినిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం.. సాగుకు భూమి, తినడానికి తిండి, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని వాపోతున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే, తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. రూ.18 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని మోదీ.. అదానీకి రూ.లక్షల కోట్లు దోచి పెడుతున్నారని, దేశవనరులను ఇలా చేయడమేమిటని రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తే కేసులు పెట్టి, పార్లమెంటులోకి రాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో తామంతా ప్రచారం చేస్తేనే ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గెలిచారని, రాత్రికిరాత్రే భారాసలో చేరి అయిదేళ్లుగా గిరిజనులను పట్టించుకోవడం లేదన్నారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని భట్టి ధీమా వ్యక్తం చేశారు. గిరిజనులకు సంపూర్ణ అటవీహక్కులు కల్పించి, అర్హులైన గిరిజనేతరులకు పట్టాలివ్వడానికి ధరణిలో తగిన మార్పులు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు