చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు
ప్రజలు సొమ్ముని కొల్లగొట్టి విదేశాలకు తరలించి తిరిగి తన కంపెనీల్లోకి వచ్చేలా చేయడంలో ముఖ్యమంత్రి జగన్ దిట్టని మాజీ మంత్రి, తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు.
నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై సీఎం మాట్లాడటం ఈడీని ప్రభావితం చేయడం కాదా?
ప్రజల సొమ్ముని కొల్లగొట్టడంలో సీఎం జగన్ ఘనుడు
తెదేపా నేత నక్కా అనంద్‌బాబు
ఈనాడు, అమరావతి: ప్రజలు సొమ్ముని కొల్లగొట్టి విదేశాలకు తరలించి తిరిగి తన కంపెనీల్లోకి వచ్చేలా చేయడంలో ముఖ్యమంత్రి జగన్ దిట్టని మాజీ మంత్రి, తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. చంద్రబాబు తప్పుచేశారని నిరూపించడానికి రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించి భంగపడితే...ఇప్పుడు జగన్ అదే పనిగా తవ్విన కొండనే తవ్వుతూ చంద్రబాబుకి అవినీతి మకిలి అంటించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టుపై.. చంద్రబాబుపై.. సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చౌకబారు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆనంద్‌బాబు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం సోమవారం చేసిన ఆరోపణలపై అంశాల వారీగా మాజీ మంత్రి సమగ్రంగా వివరణ ఇచ్చారు.
ఆరోపణ: నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో రూ.371 కోట్ల అవినీతి
వాస్తవం: రూ.371 కోట్ల అవినీతి జరిగితే 2.94 లక్షల మంది యువత ఎలా శిక్షణ పొందారు? వారిలో 70 వేల మందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయి? 40 కళాశాలల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఎలా ఏర్పాటు చేశారు? నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల్లో సీమెన్స్ సంస్థ అవసరమైన సాఫ్ట్‌వేర్, పరికరాలు, యంత్రాలు ఏర్పాటు చేసిందో, లేదో చూడాలని జగన్ ప్రభుత్వం శరత్ అండ్ అసోసియేట్స్ అనే సంస్థతో తనిఖీలు చేయించింది నిజం కాదా? అదే సంస్థను భౌతిక తనిఖీలు చేయొద్దని ఆదేశించలేదా? కేంద్రాల్లో అన్ని రకాల పరికరాలు, సాఫ్ట్‌వేర్ ఉన్నాయని నివేదిక ఇస్తే ..ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతోనే జగన్, అతని ప్రభుత్వం భౌతిక తనిఖీలకు అనుమతి ఇవ్వలేదా? ప్రాజెక్ట్‌లో అవినీతి జరగలేదని ముఖ్యమంత్రికి తెలుసు. అందుకే వాస్తవాలు బయటపెట్టకుండా ఆరోపణలు చేస్తున్నారు.
ఆరోపణ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు ఓరల్ ఆర్డర్ (స్పీకింగ్ ఆర్డర్స్) ఇచ్చారు
వాస్తవం: చంద్రబాబు చెప్పారని సీఎస్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నోట్‌ఫైల్‌లో రాశారు. స్పీకింగ్ ఆర్డర్స్ తప్పని వారు ఎక్కడా రాయలేదు. చంద్రబాబు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే సీఎస్ ఎందుకు అభ్యంతరం తెలుపుతూ నోట్ పెట్టలేదు? సీఎం తన రోజువారీ పరిపాలన కార్యకలాపాలలో స్పీకింగ్ ఆర్డర్లు ఇవ్వడం సాధారణం. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు వాన్‌పిక్ స్కాంలో స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదా?
ఆరోపణ: టెండర్ పిలవకుండా ఒప్పందం
వాస్తవం: సీమెన్స్‌తో ఒప్పందం చేసుకున్న గుజరాత్, కర్ణాటక, ఝార్ఖండ్, తమిళనాడులు టెండర్ లేకుండానే ఒప్పందాలు చేసుకున్నాయని జగన్‌రెడ్డికి తెలియదేమో? ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం వాటా కేవలం 10 శాతమే. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు 20 శాతం ప్రభుత్వ వాటాతో సీమెన్స్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. బైజూస్‌కు రూ.688 కోట్లు నామినేషన్ పద్దతిలో ఇచ్చి కమీషన్ల కక్కుర్తికి పాల్పడింది మీరు కాదా?
ఆరోపణ: కేబినెట్ ఆమోదం తరువాత ఇచ్చిన జీవోలోని అంశాలను అగ్రిమెంట్‌లో మార్చేశారు
వాస్తవం: క్యాబినెట్ నిర్ణయం తరువాత ఇచ్చిన జీవోలో సీమెన్స్ వాటా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రస్తావించి ..ఒప్పందంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని రాశారని సీఎం మాట్లాడుతున్నారు. జీవోను తయారుచేసి ఒప్పందం కుదుర్చుకున్న ఆరుగురు ఐఏఎస్ అధికారులకు కనిపించని తప్పు జగన్‌రెడ్డికే కనిపించింది. ఒప్పందంపై సంతకం చేసిన ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రారెడ్డిని జగన్ ఇప్పుడు తన పక్కనే పెట్టుకున్నారు. ఆయనతోపాటు ఎస్‌ఎస్ రావత్, అజయ్‌జైన్, రవిచంద్రారెడ్డి, ఉదయలక్ష్మి, లక్ష్మీనారాయణను ప్రభుత్వం ఎందుకు విచారించడం లేదు? సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనే కేంద్ర సంస్థ ప్రాజెక్టు అంచనాలను క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సరిగానే ఉన్నాయని చెప్పిన తరవాత కూడా ఆరోపణలు చేయడం జగన్‌రెడ్డి సైకో మనస్తత్వానికి నిదర్శనం. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేల్చే పనిలో ఈడీ ఉంది. మరో వైపున సీఐడీతో రాష్ట్ర ప్రభుత్వం సమాంతర విచారణ జరిపిస్తోంది. అంతటితో ఆగక అసెంబ్లీలో ఇదే అంశంపై సీఎం సోమవారం మాట్లాడటం ఈడీ విచారణను ప్రభావితం చేయడం కాదా?
ఆరోపణ: షెల్ కంపెనీల నుంచి హైదరాబాద్‌లోని తెదేపా ఖాతాల్లోకి డబ్బులు చేరాయి
వాస్తవం: ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే ఎందుకు బయటపెట్టడంలేదు? లేని అవినీతిని చంద్రబాబుకి అంటించడానికి సీఎం మూడేళ్లుగా విశ్వప్రయత్నం చేస్తున్నారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా తన కంపెనీల్లోకి అవినీతి సొమ్మును మళ్లించుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన సొమ్ము హవాలా ద్వారా చెన్నైలోని జగన్ షెల్ కంపెనీలకు తరలిస్తుండగా పట్టుబడింది నిజం కాదా? ఆ వెంటనే వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న సీఎం భార్య భారతిరెడ్డి రాత్రికి రాత్రి ఆ పదవికి రాజీనామా చేసింది నిజం కాదా? ఆ సొమ్ము ఎక్కడికి పోతోందని ఆరాతీస్తే చెన్నైలో ఒకే చిరునామాతో నాలుగు షెల్ కంపెనీలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది వాస్తవం కాదా? కంపెనీలు అన్నింటికీ వైఎస్ భారతి (జగన్ భార్య), వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, వైఎస్ మాలినీరెడ్డి, వైఎస్ కులశ్రీరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నది నిజం కాదా? తెలుగు రాష్ట్రాలకు క్విడ్ ప్రోకో, మనీలాండరింగ్‌ను పరిచయం చేసింది జగన్‌మోహన్‌రెడ్డి’ అని మాజీ మంత్రి ఆనంద్‌బాబు ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Bed Rotting: ఏమిటీ ‘బెడ్ రాటింగ్’.. ఎందుకంత ట్రెండ్ అవుతోంది..?
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్
-
India News
Manipur: మణిపుర్లో అమిత్ షా సమీక్ష.. శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవ్!
-
Viral-videos News
Beauty Pageant: అందాల పోటీల్లో భార్యకు అన్యాయం జరిగిందని.. కిరీటాన్ని ముక్కలు చేశాడు!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
India News
Shashi Tharoor: ‘వందే భారత్’ సరే.. కానీ సుదీర్ఘ ‘వెయిటింగ్’కు తెరపడేదెప్పుడు?