Nara Lokesh: టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?

అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు అందిస్తామని హామీనిచ్చిన జగన్‌ గెలిచాక మాట తప్పారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 22 Mar 2023 06:05 IST

తెదేపాకు పేరొస్తుందనే ఆపేశారు..
రాష్ట్ర ప్రభుత్వంపై నారా లోకేశ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు అందిస్తామని హామీనిచ్చిన జగన్‌ గెలిచాక మాట తప్పారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తెదేపా హయాంలో ఎంపిక చేసిన అర్హులను లబ్ధిదారుల జాబితానుంచి తొలగించి వైకాపా నాయకులకు కట్టబెట్టారని ఆరోపించారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే తెదేపాకు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర 49వ రోజు సందర్భంగా మంగళవారం కదిరి సమీపంలోని టిడ్కో ఇళ్లను ఆయన సందర్శించారు. అక్కడ సెల్ఫీ తీసుకున్నాక లబ్ధిదారులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. పట్టణ పేదల సొంతింటి కల సాకారం చేయాలనే సంకల్పంతో తెదేపా హయాంలో జీప్లస్‌ త్రీ తరహాలో మూడు రకాల ఇళ్లు నిర్మించామన్నారు. పూర్తిగా షేర్‌వాల్‌ సాంకేతికతతో (365, 300, 430 చ.అ.) ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో 90శాతం పనులు పూర్తిచేశాక ప్రభుత్వం మారిపోయిందని వివరించారు. అధికార వైకాపా మిగిలిన పది శాతం పనులనూ పూర్తి చేయకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.

అంగన్‌వాడీలకు సంఘీభావం: ఎన్నికలప్పుడు జీతాల పెంపుపై హామీలిచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయాలని కోరుతున్న అంగన్‌వాడీలను అమానవీయంగా అరెస్టు చేయడం దారుణమని లోకేశ్‌ ధ్వజమెత్తారు. కార్యకర్తల ఉద్యమానికి సంఘీభావంగా లోకేశ్‌ నల్లబ్యాడ్జీ ధరించి పాదయాత్ర చేశారు. నాయకులు, కార్యకర్తలూ నల్లబ్యాడ్జీలు ధరించారు.

ఎమ్మెల్సీలకు సన్మానం

ఇటీవలి పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా ఎమ్మెల్సీలు నారా లోకేశ్‌ను కదిరిలో కలిశారు. ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, వేపాడ చిరంజీవిని లోకేశ్‌ సన్మానించారు. వైకాపా అరాచకాలను ఎదిరించి గెలిచిన నిజమైన హీరోలుగా అభివర్ణించారు. ప్రజా సమస్యలపై శాసనమండలిలో గళం వినిపించాలన్నారు. 2024 ఎన్నికల్లో లోకేశ్‌ మార్గదర్శకత్వంలో పనిచేస్తామని ఎమ్మెల్సీలు తెలిపారు. లోకేశ్‌ పాదయాత్ర కదిరి నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలోని పులగంచెరువు వరకు 12.5 కి.మీ.మేర సాగింది. విశాఖ తెదేపా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు