రూ.2 వేల కోట్ల ప్రజాధనం వృథా

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్థతతోనే పోలవరం డయాఫ్రంవాల్‌ మరమ్మతులకు రూ.2 వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతోందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Published : 25 Mar 2023 05:06 IST

తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్థతతోనే పోలవరం డయాఫ్రంవాల్‌ మరమ్మతులకు రూ.2 వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతోందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైకాపా అధికారం చేపట్టాక పోలవరం ప్రాజెక్టు పనుల్ని 15 నెలలు జాప్యం చేయడం కారణంగానే వరదల వల్ల డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదని నీతి ఆయోగ్‌ నియమించిన హైదరాబాద్‌ నిపుణుల కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. ‘రివర్స్‌ టెండరింగ్‌ పేరు చెప్పి జగన్‌రెడ్డి పోలవరం నిర్మాణ పనుల్ని జాప్యం చేశారు. గత కాంట్రాక్టర్‌నే కొనసాగించి ఉంటే 2020లోపే పోలవరం పూర్తి అయ్యేది. పనులు ముమ్మరంగా చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా వినలేదు. 5 ఏళ్లలో తెదేపా ప్రభుత్వం 71% పనుల్ని పూర్తి చేస్తే నాలుగేళ్లలో జగన్‌ ప్రభుత్వం 7% పూర్తి చేసింది. సమయం ఉన్నా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టులో తీవ్ర సమస్య ఏర్పడింది. ఇప్పుడు వారి తప్పులను గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  పోలవరం పూర్తయి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు సస్యశ్యామలం కావడం జగన్‌కు ఇష్టం లేదు. అందుకే ప్రాజెక్టు పూర్తికి అడుగు ముందుకు వేయడం లేదు. డీపీఆర్‌-2ను ఆమోదించమని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఎత్తిపోతల పథకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని