nara lokesh: రూ.10 ఇచ్చి.. 100 లాగుతున్నారు

రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరుతో డబ్బులు పంచి.. మరోవైపు అన్ని వస్తువుల ధరలూ పెంచి, ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తోందని తెదేపా  ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 26 Mar 2023 09:02 IST

యువగళం పాదయాత్రకు 50 రోజులు
7 సార్లు విద్యుత్తు.. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు
4 ఏళ్లలో నిత్యావసర ధరలు రెట్టింపు
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నారా లోకేశ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరుతో డబ్బులు పంచి.. మరోవైపు అన్ని వస్తువుల ధరలూ పెంచి, ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తోందని తెదేపా  ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఏడుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారని.. ఇప్పుడు మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నారన్నారు. ఆర్టీసీ ఛార్జీల్ని మూడుసార్లు పెంచారని.. గతంతో పోలిస్తే నిత్యావసరాల ధరలు రెట్టింపు అయ్యాయని ధ్వజమెత్తారు. గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మన రాష్ట్రంలోనే అధికమన్నారు. ఓ చేతితో రూ.10 ఇస్తూనే మరో చేతితో రూ.వంద లాగుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. యువగళం పాదయాత్ర 50వ రోజు సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా  ఓబుళదేవరచెరువు  మండలం ఒనుకువారిపల్లి నుంచి రామయ్యపేట వరకు 11.1 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా ఓబుళదేవరచెరువు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్‌ మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వద్ద రెండు బటన్లు ఉంటాయని, ఒక బటన్‌ నొక్కగానే ఖాతాలో రూ.10 జమవుతాయని.. మరో బటన్‌ నొక్కగానే అదే ఖాతా నుంచి జగన్‌ ఖాతాలోకి రూ.100 వెళ్లిపోతాయన్నారు. ఇంటి పన్ను రెట్టింపు చేసి.. చెత్త పన్ను తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.

గంజాయి రాజధానిగా మార్చారు

తెదేపా పాలనలో జాబ్‌ రాజధానిగా ఏపీ పేరు పొందిందని.. జగన్‌రెడ్డి దాన్ని గంజాయి రాజధానిగా మార్చారని లోకేశ్‌ ఆరోపించారు. వైకాపా పాలనలో హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు పెరిగాయన్నారు. పవిత్ర తిరుమల క్షేత్రంలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వంలో ఖైదీలకు ఉన్న విలువ విద్యార్థులు, యువతకు లేకుండా పోయిందన్నారు. విద్యార్థుల వసతికి జగన్‌ ప్రభుత్వం రూ.1,000 ఇస్తోందని.. ఖైదీలకు మాత్రం రూ.2 వేలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు యువతకు హామీలు ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ఒక్కటీ అమలు చేయలేదన్నారు.

ఉద్యోగాల భర్తీ ఏదీ?

‘ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను... జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి భర్తీ చేస్తామన్నారు. ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించకుండా నిరుద్యోగుల్ని దారుణంగా మోసంచేశారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లను మూసేశారు’ అని లోకేశ్‌ విమర్శించారు.

ఫిష్‌ ఆంధ్రా ఫినిష్‌ అయినట్లేనా...

ఓబుళదేవరచెరువు వద్ద మూతపడిన ఫిష్‌ ఆంధ్రా దుకాణం వద్ద లోకేశ్‌ సెల్ఫీ దిగారు. చేపల దుకాణం తెరవక పోవడానికి సవాలక్ష కారణాలున్నాయన్నారు. షాపులకు నీలిరంగు వేయడంలో ఉన్న శ్రద్ధ... నిర్వహణలో లేదన్నారు. మూతపడిన షాపు జగన్‌రెడ్డి పనితనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాలోనూ సెల్ఫీ దిగి ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని,  ఫిష్‌ఆంధ్రా ఫినిష్‌ అయినట్లేనా అని ప్రశ్నించారు.

సత్యసాయి తాగునీటి పథకాన్ని దత్తత తీసుకుంటా..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు వెయ్యి గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు 1995లో ఏర్పాటు చేసిన సత్యసాయి తాగునీటి పథకాన్ని జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని లోకేశ్‌ విమర్శించారు. తెదేపా అధికారంలోకి రాగానే తాగునీటి పథకాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతపురంలోని ప్రతి గ్రామానికీ సురక్షిత తాగునీరు అందించే బాధ్యత తనదేనన్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తామని, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. జగన్‌లా మాట ఇచ్చి తప్పే వ్యక్తిని కాదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు.

వైకాపా 175 స్థానాల్లో గెలుస్తాననడం హాస్యాస్పదం: నారా రోహిత్‌

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధిస్తామని వైకాపా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సినీ నటుడు నారా రోహిత్‌ అన్నారు. లోకేశ్‌ యువగళం 50వ రోజు సందర్భంగా పాదయాత్రలో రోహిత్‌ పాల్గొన్నారు. పాదయాత్రకు యువత, మహిళల నుంచి అనూహ్య స్పందన ఉందని, వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల్లో రోహిత్‌ ఉత్సాహం నింపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు