ఏకతాటిపైకి విపక్షాలు.. రాహుల్‌ అనర్హతపై ఉమ్మడిగా నిరసన

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై విధించిన సస్పెన్షన్‌ వేటు వ్యవహారం.. విపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. కేంద్రంపై ఉమ్మడిగా దాడికి అవి సన్నద్ధమవుతున్నాయి.

Updated : 28 Mar 2023 06:49 IST

నల్ల దుస్తులతో పార్లమెంటుకు ప్రతిపక్ష ఎంపీలు
అదానీపై ప్రశ్నలకు ప్రధాని జవాబివ్వాలని డిమాండ్‌

దిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై విధించిన సస్పెన్షన్‌ వేటు వ్యవహారం.. విపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకువస్తోంది. కేంద్రంపై ఉమ్మడిగా దాడికి అవి సన్నద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం ఇటు పార్లమెంటులో, అటు కొన్ని రాష్ట్రాల శాసనసభల్లో సభ్యులు నిరసన గళం వినిపించారు. ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’ పేరుతో ఇతరత్రా కార్యక్రమాల ద్వారానూ కేంద్రం తీరును తప్పుపట్టారు. విపక్ష కూటమి ప్రయత్నాలకు దూరంగా ఉంటూ వస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తొలిసారిగా ‘ఉమ్మడి వ్యూహరచన’ సమావేశంలో పాల్గొని రాహుల్‌కు సంఘీభావం తెలిపింది. ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) మాత్రం ఒక సమావేశానికి హాజరై, రెండోదానికి రాలేదు.  

రోజంతా హడావుడి

రాహుల్‌ సస్పెన్షన్‌ వ్యవహారంలో సోమవారం రోజంతా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ సహా పలు విపక్షాల సభ్యులు నల్లని దుస్తులు, లేదా నల్ల కండువాలతో పార్లమెంటుకు హాజరయ్యారు. అక్కడి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిలో రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. విపక్ష ఎంపీలు పార్లమెంటు నుంచి విజయ్‌చౌక్‌ వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా నిర్వహించారు.

ప్రజాస్వామ్యాన్ని మోదీ అంతం చేస్తున్నారు: ఖర్గే

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ అంతం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచినవారిని బెదిరించి ఆ స్థానంలో సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయ్‌చౌక్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గత కొన్నేళ్లలో అదానీ సంపద అన్ని రెట్లు ఎలా పెరిగిపోయింది? ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అదానీని ఎన్నిసార్లు వెంట తీసుకువెళ్లారు? దీనిపై జేపీసీ విచారణకు భయపడుతున్నారంటే ఏదో తప్పు జరిగిందనే కదా అర్థం..’’ అని ఆయనన్నారు.  

భేటీలో వ్యూహరచన

కాంగ్రెస్‌ ఎంపీలంతా మొదటగా పార్లమెంటులోని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలన్నీ ప్రత్యేకంగానూ సమావేశమయ్యాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, భారాస, సమాజ్‌వాదీ, డీఎంకే, జేడీయూ, సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్పీ, ఆప్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, శివసేన (యూబీటీ) తదితర పార్టీలు ఈ భేటీకి హాజరయ్యాయి. రాహుల్‌ గాంధీపై అనర్హత, అదానీ వివాదంపై ఉభయ సభల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై సమాలోచనలు జరిపాయి. బడ్జెట్‌ సమావేశాల్లో విపక్ష పార్టీల మధ్య ఏర్పడ్డ సయోధ్య.. పార్లమెంటు వెలుపలా కొనసాగాలని కాంగ్రెస్‌ ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఖర్గే నివాసంలో రాత్రి నిర్వహించిన విందు భేటీకి కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, ఎన్సీపీ, జేడీయూ, భారాస, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, ఆప్‌, కేరళ కాంగ్రెస్‌, తృణమూల్‌, ఆర్‌ఎస్పీ, ఆర్జేడీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, విధుతలై చిరుతైగల్‌ కచ్చి (వీసీకే), ఐయూఎంల్‌, సమాజ్‌వాదీ, జేఎంఎం పార్టీలు హాజరయ్యాయి. దీనిలో సోనియా, రాహుల్‌ పాల్గొన్నారు. మంగళ, బుధవారాల్లో దేశవ్యాప్తంగా 35 నగరాల్లో మీడియా సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

నిరసనలతో సభల వాయిదా

రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులోనూ విపక్ష ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు. అదానీ గ్రూపు షేర్ల పతనంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో స్పీకర్‌ స్థానం వద్దకు వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు కొన్ని పత్రాలను చింపి, తమ నల్ల కండువాలతో పాటు సభాపతి వైపు విసిరారు. దాంతో సభ తొలుత కొంతసేపు, తర్వాత మంగళవారానికి వాయిదాపడింది. రాజ్యసభ కూడా నిమిషాల్లోనే వాయిదా పడింది. విపక్షాల సమావేశాలకు తృణమూల్‌ తరఫున ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని రక్షించే విషయంలో విపక్షంతో తాము ఏకీభవిస్తున్నామనీ, కాంగ్రెస్‌తో ఇతర విభేదాల విషయంలో మార్పేమీ లేదని పార్టీ నేతలు తెలిపారు. రాహుల్‌కు మద్దతుగా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఒడిశాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నల్ల వస్త్రాలు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. బిహార్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నల్ల వస్త్రాలు ధరించి ర్యాలీలు చేశారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించండి: మమత

రాజ్యాంగానికి ఆపద వాటిల్లకుండా పరిరక్షించాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కోరారు. కోల్‌కతాలో రాష్ట్రపతికి జరిగిన పౌర సన్మానంలో ఆమె మాట్లాడారు. దేశ రాజ్యాంగ అధిపతిగా ప్రజల రాజ్యాంగబద్ధ హక్కుల్ని పరిరక్షించాలని ముర్మును కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని