ప్రజాకోర్టులో భాజపాకు శిక్ష తప్పదు: నారాయణ

వైఫల్యాలను, నియంతృత్వ పాలనను నిలదీస్తున్న ప్రతిపక్ష పార్టీలను అణచివేసే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.

Published : 28 Mar 2023 04:34 IST

మహబూబాబాద్‌, మానుకోట, న్యూస్‌టుడే: వైఫల్యాలను, నియంతృత్వ పాలనను నిలదీస్తున్న ప్రతిపక్ష పార్టీలను అణచివేసే దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని వీరభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నారాయణ ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీకి చిన్న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెబితే.. వెంటనే లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు ఆయన పోటీ చేసిన స్థానాన్ని ఖాళీగా చూపడం సరికాదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకుని.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న భాజపాకు ప్రజాకోర్టులో తగిన శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. వల్లభ్‌భాయ పటేల్‌ వల్లే నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అనడం చరిత్రను వక్రీకరించడమేనన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ సాయుధ పోరాటంతో సంఘ్‌ పరివార్‌ సంస్థలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సీపీఐ నిర్వహించిన ప్రజాపోరు యాత్రలో పాల్గొన్న నారాయణ రాత్రి మహబూబాబాద్‌లోనే బస చేశారు. సోమవారం ఉదయం స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో వాకింగ్‌, ఓపెన్‌ జిమ్‌లో వ్యాయామం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని