వ్యవసాయం మా సంకల్పం

కర్షకుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

Updated : 02 Apr 2023 06:14 IST

ఫలితంగానే తెలంగాణలో పుష్కలంగా నీళ్లు
ఇక్కడ సాధ్యమైనపుడు మీ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు
మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్‌ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్‌
భారాసలో చేరిన సంఘటన్‌ ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: కర్షకుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కారమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావని ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్‌ కన్నా మహారాష్ట్ర బడ్జెట్‌ పెద్దదని, మరి ఆ రాష్ట్ర సర్కార్‌ ఎందుకు రైతు సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం లేదంటే ఎక్కడో తేడా ఉంది (దాల్‌ మే కుచ్‌ కాలా హై) అని అర్థమవుతోందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ప్రముఖ రైతు సంఘమైన షెట్కారీ సంఘటన్‌కు చెందిన ముఖ్య నేతలు, పలు జిల్లాల అధ్యక్షులు, ఆఫీస్‌ బేరర్లు, యువజన నాయకులు సీఎం కేసీఆర్‌ సమక్షంలో శనివారం భారాసలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘ఒకటి రెండు రోజులుండి తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండి’ అని వారికి సూచించారు. ‘ఏప్రిల్‌ నడి ఎండల్లో కూడా తెలంగాణలో రిజర్వాయర్లు, చెరువులు, కాలువలలో నీళ్లు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? తెలంగాణలో హిమాలయాలున్నాయా? లేవు... కానీ, వాటికన్నా ఎత్తయిన సంకల్పం ఉంది. దాని ఫలితంగానే తెలంగాణలో నీళ్లున్నాయి’ అని వివరించారు. పార్టీలో చేరిన వారిలో.. మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్‌ యువజన అధ్యక్షుడు సుధీర్‌ బిందు, ప్రతినిధులు కైలాష్‌ తవార్‌, శరద్‌ మర్కాడ్‌, సువర్ణ కాఠే, రాంజీవన్‌ బోండార్‌, నారాయణ్‌ విభూధే, బిజి కాకా, అనిల్‌ రజంకార్‌, పవన్‌ కర్వార్‌, భగవత్‌ పాటిల్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

‘గిట్టుబాటు’ కోసం ఇంకెంత కాలం పోరాడాలి?

‘‘దేశ రైతాంగానికి సాగునీళ్లు లేవు.. కరెంటు లేదు.. పెట్టుబడి సాయం లేదు. అందుకే మనం అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదాన్ని తీసుకుని ముందుకు పోతున్నాం. సమస్యల పరిష్కారానికి రైతుల్లో ఐక్యత రావాలి. పోరాటంలో మనదైన ముద్ర కావాలి. గతంలో షెట్కారీ కామ్‌ గారీ పార్టీ పోటీ చేసి మహారాష్ట్రలో 76 అసెంబ్లీ సీట్లు గెలిచింది. మనం ఇప్పుడు 200 సీట్లు గెలుస్తాం. అందుకు గట్టి సంకల్పం కావాలి. రైతు సమస్యలపై 1935 నుంచి పోరాటాలు సాగుతూనే వున్నాయి. గిట్టుబాటు ధరల కోసం రైతులు ఇంకెంత కాలం పోరాడాలి?

కేంద్రం రైతుల కోసం స్పందించదే?

ఒకప్పుడు సింగపూర్‌ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? ఏ వనరులూ లేని సింగపూర్‌ అంత గొప్పగా అభివృద్ధి చెందినప్పుడు.. అన్ని వనరులూ ఉన్న భారతదేశం ఎందుకు వెనకబడింది? 14 మంది ప్రధానులు మారినా మన దేశ తలరాత ఎందుకు మారలేదు? ఈ దేశంలో మామిడి పండుతుంది.. అదే సమయంలో యాపిల్‌ పండుతుంది. ఇక్కడి వాతావరణం చాలా గొప్పది. నీరు కూడా అవసరానికన్నా ఎక్కువగా ఉంది. ఇన్ని ఉండగా మన పిల్లలు పిజ్జాలు, బర్గర్లు ఎందుకు తింటున్నారు? మెక్‌ డోనాల్డ్‌ను మించిన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఈ దేశంలో ఎందుకు నెలకొల్పలేకపోతున్నారో ఆలోచించాలి. మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో కర్షకులే లక్ష్యంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, సాగునీరు తదితర కార్యక్రమాల కోసం ఖర్చుచేస్తున్న మొత్తం రూ.4.5 లక్షల కోట్లు అనేది వాస్తవం. ఈ విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనిచేయదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు రైతుల కోసం స్పందించదు’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

రైతు సంఘం నేతలతో ఇష్టాగోష్ఠి

సమావేశం అనంతరం రైతు సంఘం నేతలతో సీఎం కేసీఆర్‌ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. రైతుల కోసం ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేస్తారని ప్రజలు అడిగితే మేం ఏం చెప్పాలని ఓ రైతు నేత అడిగారు. కేసీఆర్‌ బదులిస్తూ... ‘దేశంలో రైతు సంక్షేమానికి మించి ప్రభుత్వ ప్రాధాన్యం ఏముంటుంది? ఇన్నాళ్లూ రాజకీయ నాయకులకు, అధికారులకు ప్రాధాన్యాంశాలు వేరుగా వున్నాయి. కానీ తెలంగాణలో వ్యవసాయమే మన భారాస ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశం. బడ్జెట్‌లో మొదట వీటికే కేటాయింపులు చేస్తాం’ అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో మరో రెండు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ బీబీ పాటిల్‌, నేతలు బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గుర్నామ్‌ సింగ్‌ చడోని, రవి కోహెర్‌, హిమాన్షు తివారీ, మాణిక్‌రావు కదమ్‌ తదితరులు పాల్గొన్నారు.


* రైతులు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. నా 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, సమస్యలు, ఆటుపోట్లను చూశాను. ఇప్పుడు నేను మరో నూతన ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నా. దేశంలోని రైతుల కష్టం చూసి అన్నదాతల పోరాటం న్యాయమైనదనే భావనతో వారి సమస్యలను తలకెత్తుకున్నా.

* మన చేతిలో ఉన్న ఓటును వినియోగించుకొని రైతు రాజ్యాన్ని తెచ్చుకోవాలి. ఓటు అస్త్రం ఉండగా, రోడ్ల మీద ఆందోళనలు, పోరాటాలు అక్కరలేదు. లాఠీ దెబ్బలు, తూటా గాయాలు అవసరం లేదు. మన ఓటు మనం వేసుకుంటే రైతు రాజ్యం వస్తుంది. మనల్ని మనం బాగుచేసుకుంటాం.

 ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని