తెనాలిలో ఆర్యవైశ్య సంఘాలు, తెదేపా బంద్‌ ఉద్రిక్తం

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెదేపా కౌన్సిలర్‌పై వైకాపా కౌన్సిలర్లు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆర్య వైశ్య సంఘాలు, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా శనివారం నిర్వహించిన పట్టణ బంద్‌ ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 02 Apr 2023 04:13 IST

నాయకులను ఈడ్చి బస్సులో నెట్టేసిన పోలీసులు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెదేపా కౌన్సిలర్‌పై వైకాపా కౌన్సిలర్లు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆర్య వైశ్య సంఘాలు, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా శనివారం నిర్వహించిన పట్టణ బంద్‌ ఉద్రిక్తతకు దారి తీసింది.  తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందంటూ బంద్‌కు వ్యతిరేకంగా ఇదే రోజు వైకాపా కూడా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రెండు పక్షాలూ పట్టణంలో ప్రదర్శనలు చేశాయి. కూడలి ప్రాంతాల్లో వారు ఎదురు పడకుండా పోలీసులు మార్గాలను మళ్లించారు. నాలుగు వరుసల రోడ్డు నుంచి కొత్త వంతెన వైపునకు వైకాపా కార్యకర్తలు ప్రదర్శనగా రాగా వహాబ్‌రోడ్డు నుంచి ఆ దిశగా వెళుతున్న తెదేపా వారిని పోలీసులు నిలువరించారు. దీంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కొంత సమయం తరవాత పోలీసులు ఓ ప్రైవేటు పాఠశాల బస్సు తీసుకొచ్చి రోడ్డుపై బైఠాయించిన తెదేపా నాయకుల కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చి బస్సులోకి నెట్టారు. తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్‌ బస్సు నుంచి బయటకు దూకటంతో స్వల్పంగా గాయపడి, రోడ్డుపైనే పడుకున్నారు. ఆయనను వదిలేసిన పోలీసులు మిగిలిన వారిని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం డూండీ రాకేష్‌ ఇతర నాయకులు బోస్‌ రోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ ఆవరణకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తాను ఆమరణ దీక్ష చేస్తానంటూ రాకేష్‌, తదితరులు అక్కడ కూర్చున్నారు. కొంత సమయం తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేసి కొల్లిపర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసుల హడావుడి, అరెస్టులు, నినాదాలతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ కౌన్సిలర్‌పై దాడి చేసిన వారిని వదిలేసి, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను అరెస్టు చేయడం ఏమిటంటూ తెదేపా నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని