DK Shivakumar - Siddaramaiah: ఎవరు ముఖ్యమంత్రి?

సార్‌.. కాంగ్రెస్‌ గెలిస్తే ముఖ్యమంత్రి మీరేనంట కదా? అని ఎవరైనా డీకే శివకుమార్‌ను అడిగితే ముందు పార్టీ గెలవనివ్వండి.. ఆపై తేల్చుకుందామనేవారు.

Updated : 14 May 2023 08:24 IST

సిద్ధు, శివల పోటాపోటీ
ఈనాడు - బెంగళూరు

సార్‌.. కాంగ్రెస్‌ గెలిస్తే ముఖ్యమంత్రి మీరేనంట కదా? అని ఎవరైనా డీకే శివకుమార్‌ను అడిగితే ముందు పార్టీ గెలవనివ్వండి.. ఆపై తేల్చుకుందామనేవారు. ఇదే ప్రశ్న సిద్ధరామయ్యకు వేస్తే.. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే శాసనసభా పక్ష సమావేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారనేవారు. సరిగ్గా ఆ సమయం రానే వచ్చింది. ఆదివారం సాయంత్రం బెంగళూరులో శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో చర్చించేది ఈ ఇద్దరి గురించే.

‘కనకపుర బండ’గా అభిమానులు పిలిచే 62 ఏళ్ల డీకే శివకుమార్‌ కర్ణాటక కాంగ్రెస్‌కు వేగాన్ని అందించిన నేత. కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు పొందిన డీకే 2017 వరకు ఓ సాధారణ నాయకుడే. ఆ ఏడాది ఆగస్టులో గుజరాత్‌కు చెందిన అహ్మద్‌ పటేల్‌ రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేలకు బెంగళూరులో విడిది ఏర్పాటు చేసి అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. అదే సందర్భంగా అక్రమ నగదును బదిలీ చేస్తున్నారని ఈడీ దృష్టిలో పడిన డీకేను ఇప్పటికీ ఆ కేసులు వెంబడిస్తున్నాయి. ఇదే కేసుల్లో తిహాడ్‌ జైలుకూ వెళ్లాల్సి వచ్చింది. సోనియా గాంధీ తనపై చూపిన అభిమానాన్ని శనివారం ఎన్నికల ఫలితాల తర్వాత తలచుకుని కన్నీటి పర్యంతమైన డీకేకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినట్లే ముఖ్యమంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యం లేదు. 1989లో 27 ఏళ్లకే ఎమ్మెల్యే అయిన డీకే.. ఇప్పటివరకు ఓటమి ఎరుగరు. తాజా ఎన్నికల్లో 1.20 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు.

బలం: యువ నాయకత్వానికి ప్రతినిధి. ఏఐసీసీ అధ్యక్షుడు, రాహుల్‌, సోనియా గాంధీల అండదండలున్నాయి. పార్టీకి అపారమైన ఆర్ధిక వనరులు సమకూర్చగలరు.

బలహీనత: బెంగళూరుకే పరిమితమైన నేత. కోపం ఎక్కువ. అందరితో కలిసిపోయే తత్వం తక్కువ. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే సీనియర్ల నుంచి సహకారం అంతంత మాత్రమే.

సిద్ధరామయ్య.. రాష్ట్ర రాజకీయాల్లో అపారమైన అభిమానులన్న నేతల్లో ప్రముఖుడు. దేవరాజ్‌ అరసు తర్వాత ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసింది సిద్ధరామయ్యే. అహింద (బలహీనవర్గాల) సముదాయానికి ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడే ఆయన జనతా పరివార్‌ నుంచి 2006లో కాంగ్రెస్‌లోకి వచ్చినా పార్టీ భావజాలాన్ని సులువుగా ఆకళింపు చేసుకున్నారు. జనతాదళ్‌లోనూ ఉప ముఖ్యమంత్రిగా, ఆర్ధిక మంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య ఇప్పటి వరకు అత్యధిక సార్లు (13సార్లు) బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సొంతం చేసుకున్నారు. మాట కఠినంగా ఉన్నా అభిమానుల మనసులు గెలిచిన ఆయనపై అవినీతి ఆరోపణలు తక్కువే. 2013లో కాంగ్రెస్‌కు 122 స్థానాల విజయాన్ని అందించడంలో సిద్ధరామయ్య పాత్రను విస్మరించని అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించింది. అధిష్ఠానం విశ్వాసాన్ని వమ్ము చేయని ఆయన ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వనన్ని పథకాలను అందించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పట్టున్న నేత.

బలం: అపార రాజకీయ అనుభవం, పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడపగలరు. అధిష్ఠానం సిద్ధరామయ్య నిర్ణయాన్ని కాదనలేదు.

బలహీనత: ఏఐసీసీ అధ్యక్షుడి సహకారం తక్కువే. కొత్త తరం నాయకులకు మింగుడు పడని నేత. ఆధునిక రాజకీయాలు, వ్యూహాలకు దూరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని