ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళి

ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఆయన విగ్రహానికి తెదేపా అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.

Published : 29 May 2023 05:09 IST

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, టి.నగర్‌: ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఆయన విగ్రహానికి తెదేపా అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. రెండు రోజులుగా రాజమహేంద్రవరం శివారు వేమగిరిలోని మహానాడు ప్రాంగణంలో బస చేసిన చంద్రబాబు.. శనివారం ఉదయం వాహన శ్రేణిగా కోటిపల్లి బస్టాండుకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితోపాటు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నాయకులు చిక్కాల రామచంద్రరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌, నిమ్మల రామానాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులు నివాళులర్పించారు. తెదేపా శ్రేణులు జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు చేరుకోగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. పలు నియోజకవర్గాలనుంచి కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై ప్రదర్శనగా మహానాడుకు చేరుకున్నారు. రెండు రోజుల ముందు నుంచే శ్రేణుల రాక మొదలవ్వగా.. శనివారం రాత్రినుంచి రద్దీ పెరిగింది.


ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏపీలో చంద్రబాబే సీఎం

- తెదేపా తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ 

‘ఈరోజు, రేపు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏపీలో చంద్రబాబు సీఎం కావడం తథ్యం. మీ కలలు నెరవేరనున్నాయి. నాడు చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలు.. ఐటీ, ఇతర రంగాలకు చేసిన సేవలు మరువలేనివి. ఆయన విజన్‌-2020 పేరిట చేపట్టిన కార్యక్రమాలు వల్లే.. ఒకప్పుడు హైదరాబాద్‌లో రూ.10-20 వేలు ఉండే భూముల ధరలు, ఇప్పుడు రూ.50-100 కోట్ల్లకు చేరాయి. ఎన్టీఆర్‌ బీద, బడుగువర్గాలకు రాజకీయం జీవితం ఇచ్చారు. పేదలకు అన్నదాతగా రూ.2కే కిలో బియ్యంతో ఆహారభద్రత ఇచ్చారు. ప్రతి పేదవాడికీ తినడానికి తిండి, కట్టుకోవడానికి దుస్తులు, ఉండటానికి ఇళ్లు అందేలా చేశారు. రోహిణి కార్తె ఎండ వేడిలో.. ఎన్టీఆర్‌ చిరుజల్లులు కురిపించి ఈ సభకు ఆశీస్సులు అందించారు. ఈ రెండు రోజులూ రాజమహేంద్రవరం పసుపుమయమైంది.’


రాజధాని రైతుల కన్నీరు ఏరులై పారుతోంది

- ఈదర చంద్రవాసు, రైతు

‘మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ రాజధాని రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. రాజధాని భూములను ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నారు. చెల్లని పట్టాలు ఇస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఆయన చేస్తున్న పనులకు అక్కడి రైతులు, మహిళల కన్నీరు ఏరులై పారుతోంది.  మా కుటుంబ సభ్యులు కృష్ణాయపాలెంలో మూడు ఎకరాల భూమి ఇచ్చారు. రైతు పాదయాత్రలు, నిరాహార దీక్షల్లో పోలీసులను ఉపయోగించి ఇబ్బందులు పెడుతున్నారు. అమరావతి ఆడపడుచుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది. ప్రజల్లో వైకాపా పాలనపై తిరుగుబాటు మొదలైంది.’


జగన్‌ దళితద్రోహి

- గడ్డం మార్టిన్‌లూథర్‌, అమరావతి దళిత ఐకాస కన్వీనర్‌

‘అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకించి నాలుగు వేలమంది దళితరైతులు భూములిచ్చారు. రాజధాని నిర్మించకుండా వారికి అన్యాయం చేసేలా జగన్‌ రాజకీయం చేస్తున్నారు. జగన్‌ దళిత ద్రోహి. దళితుల ఓట్లతో పీఠమెక్కిన ఆయనను దళితులే కిందకు దించేస్తారు’


ఆర్‌-5 జోన్‌లో పట్టాలు ఎలా ఇస్తారు..

- జొన్నలగడ్డ లక్ష్మి, దొండపాడు, గుంటూరు జిల్లా

‘ఆర్‌-5 జోన్‌ వ్యవహారం న్యాయస్థానంలో ఉంది. ఈ భూమిని పేదలకు కేటాయించడం మోసపూరిత చర్య. ఈ భూమిపై ఎవరికీ హక్కు ఉండదని న్యాయస్థానం చెబుతున్నా ఆ జోన్‌లో పట్టాలు ఎలా ఇస్తారు? అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడంతోపాటు ప్రజలను మోసం చేస్తున్నారు.’


దోచుకోవడమే పనిగా..

- నార్ని సుధారాణి, మల్కాపురం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా

‘వైకాపా నాయకులు ఇసుక, మట్టి, భూమిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వీరిని ప్రజలు గమనిస్తున్నారు. వైకాపాకు మంగళం పాడే సమయం ఆసన్నమైంది. మహానాడుకు వచ్చిన జనసంద్రాన్ని చూసి వైకాపా నాయకుల్లో గుబులు పుడుతుంది. అమరావతి రైతుల విషయంలో ప్రభుత్వ తప్పిదాన్ని సరిచేసుకోవాలి.’


అలరించిన రాజ్‌కుమార్‌

చెన్నై, న్యూస్‌టుడే: మహానాడు వేదికపై ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు రాజ్‌కుమార్‌ సందడి చేశారు. పసుపు చొక్కా ధరించి వేదికపై కూర్చున్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో వచ్చినట్లు చెప్పారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు.


స్క్రాప్‌ సీఎం అని కాక ఏమనాలి? 

‘చెత్తపై పన్ను వేసే సీఎంను స్క్రాప్‌ ముఖ్యమంత్రి అనికాక ఏమనాలి. గుట్కా నములుతూ ప్రెస్‌మీట్లు పెట్టే వ్యక్తికి తెదేపా గురించి మాట్లాడే అర్హత లేదు. సీఎం హోదాలో చంద్రబాబును శాసనసభకు పంపేందుకు కార్యకర్తలు కృషి చేయాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏకైక కుమారుడు లోకేష్‌ను పాదయాత్రకు పంపించిన తల్లి భువనమ్మకు వందనాలు.’

 వంగలపూడి అనిత, తెలుగు మహిళా అధ్యక్షురాలు


సీమ ప్రజలే జగన్‌కు షాక్‌ ఇచ్చారు

‘మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలే జగన్‌కు షాక్‌ ఇచ్చారు. అదే స్ఫూర్తితో వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ జగన్‌ను గద్దె దించాలి. వంచన, అవినీతికి ధర్మంతో జరిగే ఈ యుద్ధంలో ప్రజలు ధర్మం వైపు ఉండాలి. రాయలసీమకు మంచి చేసింది చంద్రబాబు? జగనా అనేదానిపైనా చర్చిద్దాం’

 భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ


దుర్మార్గపు పాలన పోవాలి

‘జగన్‌ దుర్మార్గపు పాలన పోవాలని అందరూ కోరుకుంటున్నారు. సొంత బాబాయ్‌నే పొట్టన పెట్టుకున్న వ్యక్తి జగన్‌. మైనింగ్‌ మాఫియా, కబ్జాలతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. రాష్ట్రంలోని ఉపాధి మెరుగుపడాలన్న ఈ ప్రభుత్వం పోవాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపాదే విజయం.’ 

 గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని