ప్రజల్లోకి విస్తృతంగా పథకాలు

ఎన్నికలకు పది నెలల ముందే సమరశంఖం పూరిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీశ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.

Published : 31 May 2023 05:18 IST

మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోపై ముమ్మర ప్రచారానికి తెదేపా శ్రేణుల సన్నద్ధం

ఈనాడు, అమరావతి: ఎన్నికలకు పది నెలల ముందే సమరశంఖం పూరిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీశ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో మేనిఫెస్టో ప్రకటించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో పార్టీ ముమ్మరంగా ప్రచారం ప్రారంభించింది. చంద్రబాబు ప్రకటించిన పథకాలపై రాష్ట్రంలోని వివిధవర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలవగా.. దాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, ప్రతి కుటుంబానికీ చేరవేసేందుకు పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

బీసీలకు అది రక్షణ కవచమే

బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతకు బాటలు వేసింది తెదేపా ప్రభుత్వమే. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని నెలకొల్పిన తర్వాతే బీసీల్లో పెద్ద ఎత్తున నాయకత్వం అభివృద్ధి చెందింది. బీసీ వర్గాల నుంచి పెద్దసంఖ్యలో యువతరం రాజకీయాల్లోకి వచ్చింది. వారికి కీలకమైన పదవులూ దక్కాయి. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిందీ ఎన్టీఆర్‌ హయాంలోనే. అందుకే పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నెముకగా నిలిచారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీ వర్గాలపై దాడులు పెరిగాయి. బీసీలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడంతో పాటు, వారిని మళ్లీ పార్టీకి చేరువ చేయడమే లక్ష్యంగా... తెదేపా అధికారంలోకి వచ్చాక ‘బీసీలకు రక్షణ చట్టం’ అన్న కార్యక్రమాన్ని అమలుచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. బీసీల జోలికి వెళ్లాలంటే భయపడేలా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ తరహాలో వారి కోసం ప్రత్యేక చట్టం చేయాలని తలపెట్టారు.

మహిళా సాధికారత దిశగా ముందడుగు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు చేయూత ఇచ్చేందుకు చంద్రబాబు ప్రకటించిన వరాలు వారిని ఆకట్టుకునేలా ఉన్నాయని తెదేపా శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారికి నెల నెలా ఆర్థికసాయం వంటి పథకాలు దిల్లీ, కర్ణాటకలో అమల్లో ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం... వారి సాధికారతకు, ఆత్మగౌరవాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందని తెదేపా నాయకులు చెబుతున్నారు. జిల్లా పరిధిలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం... ఉపాధి, పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదం చేస్తుందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. నిత్యావసర సరుకుల ధరలన్నీ కొండెక్కి కూర్చోవడంతో, సంసారం నడిపేందుకు అష్టకష్టాలు పడుతున్న పేద మహిళలకు... ఏటా మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తామనడం పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా చెబుతున్నారు.

20 లక్షల ఉద్యోగాలు తెస్తే పండుగే

రాష్ట్రానికి ఒక భారీ పరిశ్రమ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు ఎంత మెరుగుపడతాయో చెప్పడానికి తాజా ఉదాహరణ... తెదేపా హయాంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా పరిశ్రమ. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ స్థాయిలో ప్రభావం చూపించే భారీ పరిశ్రమలేవీ రాలేదు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. వారికి అండగా ఉండేందుకు ప్రతి నెలా రూ.3వేల చొప్పున నిరుద్యోగభృతి ప్రకటించిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమల్ని తెస్తామని చెప్పడం వారిలో కొత్త ఆశలు నింపుతోంది. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో పాటు, మహానాడులోనూ  యువతకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించడంలో చంద్రబాబుకు ఉన్న అనుభవం, ఆయన దార్శనికతపై యువతరానికి నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో మెజారిటీ యువత తెదేపా వైపే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రైతుల మనసు చూరగొనేలా

కొన్నేళ్లుగా రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. సాగుఖర్చులు భారీగా పెరిగిపోయి, పంటలకు గిట్టుబాటు ధరలు రాక... రైతన్నలు తీవ్ర నిస్పృహతో ఉన్నారు. రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్థికసాయం ప్రకటించడం వారికి పెద్ద ఊరట అని, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఇది ఎంతో ఉపయుక్తమని తెదేపా శ్రేణులు చెబుతున్నాయి.


తల్లిదండ్రులపై ఆధారపడకుండా యువతకు ఊరట

- కంచర్ల శ్రీకాంత్‌, తెదేపా ఎమ్మెల్సీ

‘‘చంద్రబాబు ప్రకటించిన పథకాలను డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే పని మొదలుపెట్టాం. వాటికి మంచి స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తేవడానికి అవి ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని జగన్‌ తుంగలో తొక్కారు. కనీసం పరిశ్రమల్ని తీసుకొచ్చి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించినా యువతకు కొంత అండ దొరికేది. వైకాపా అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలే తరలిపోయాయి. విశాఖ నుంచే 18 కంపెనీలు వెళ్లిపోయాయి. తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌లో పరిశ్రమ ఏర్పాటుచేసి, 50వేల మందికి ఉపాధి కల్పిస్తామని తెదేపా ప్రభుత్వ హయాంలో ఎంఓయూ చేసుకున్న రిలయన్స్‌ సంస్థ... వైకాపా అధికారంలోకి వచ్చాక వాళ్ల విధానాలు నచ్చక ఆ ప్రతిపాదన విరమించుకుంది. కియా అనుబంధ పరిశ్రమలు బెంగళూరుకు వెళ్లిపోయాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. రాష్ట్రం బెట్టింగ్‌లు, మాదకద్రవ్యాలకు చిరునామాగా మారింది. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం వారికి పెద్ద ఊరట. కనీస అవసరాలకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా అది తోడ్పాటునిస్తుంది.’’


ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే పథకాలవి

- రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎంపీ

‘‘మేం ప్రకటించినవి ప్రజాకర్షక పథకాలు అనే కంటే... ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి పుట్టుకొచ్చినవని చెప్పడం సబబు. పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, లోకేశ్‌ యువగళం పాదయాత్ర వంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్ని కలిసినప్పుడు వారి ఇబ్బందుల్ని చూసి, వారికి ఎలా అండగా నిలవాలి, మహిళా సాధికారతకు ఏం చేయాలన్న ఆలోచన నుంచి పుట్టినవే ఆ పథకాలు. గ్యాస్‌ ధరలు పెరగడంతో రోజూ వంట కూడా చేసుకోలేని పరిస్థితుల్లో పేద బడుగు బలహీనవర్గాల వారున్నారు. వైకాపా ప్రభుత్వం పథకాల్ని కొందరికే పరిమితం చేసింది. పేద మహిళల్లో అధికశాతం ఏ పథకాలూ రానివారున్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకుని, ఒక ప్రభుత్వం ఏం చేస్తే తమ జీవితాలు బాగుపడతాయని వారు ఆశిస్తున్నారో గమనంలోకి తీసుకుని ఈ పథకాల్ని రూపొందించాం. వాటిని ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్ర సంపదను పెంచి, దాన్ని తిరిగి ప్రజలకు అందిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది’’


పేద కుటుంబాలకు కొండంత భరోసా

- భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ

‘‘పేదలను ధనవంతులను చేస్తానని మా పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్న కాన్సెప్ట్‌కి తొలి విడత మేనిఫెస్టో దగ్గరగా ఉంది. తెదేపా అధికారంలోకి వచ్చాక రైతులకు ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని చెప్పడం వారిలో సంతోషం నింపుతోంది. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించడం... పేద కుటుంబాల్లో పిల్లల్ని చదివించుకోవాలన్న ఆలోచనకు దోహదం చేస్తుంది. మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామనడం లక్షల మంది మహిళల్లో సంతోషం నింపుతోంది. పార్టీ ప్రకటించిన పథకాల్ని ప్రతి ఇంటికీ తీసుకెళతాం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం. వారు ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటుంటే ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళతాం.’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని