ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. ఆదివారం నెల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 05 Jun 2023 06:06 IST

అడ్డుకోవడంతో పారిపోయిన దుండగులు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు/నేరవార్తలు, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించారు. ఆదివారం నెల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 1.10 గంటల సమయంలో బీవీనగర్‌లో ఉన్న కిలారి వెంకటస్వామినాయుడు అపార్ట్‌మెంట్లోని తన కార్యాలయం నుంచి కిందికి దిగుతున్న ఆయనపై కొందరు యువకులు కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. అప్రమత్తమైన తెదేపా నాయకులు, ఆనం అనుచరులు వారిని ప్రతిఘటించారు. స్థానికుల కేకలతో అక్కడి నుంచి పరారయ్యారు. వారు తీసుకొచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు, కర్రలు అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆనం పక్కనే ఉన్న ఎంపీటీసీ మాజీ సభ్యుడు సికిందర్‌రెడ్డి కింద పడిపోవడంతో ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు.

ఉదయం నుంచి రెక్కీ

సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా.. ఆరుగురు యువకులు ఉదయం 10.30 నుంచి అక్కడే రెక్కీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారిలో ఒకరు కారులో ఉండగా మాస్కులు వేసుకున్న అయిదుగురు అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లారు. ముగ్గురు లోనికెళ్లిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో వైకాపా ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్‌తో పాటు ఇతర నాయకుల అవినీతిపై వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడికి యత్నించినట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆనం వెంకటరమణారెడ్డి స్పందిస్తూ.. నాపై దాడి చేసేందుకు పదిమందిని పంపి.. నా గొంతు నొక్కొచ్చని భావిస్తే అది కుదరదన్నారు. ఇలాంటి వాటికి బెదిరిపోయేది లేదని స్పష్టం చేశారు.


భయపెట్టాలని చూస్తున్నారు: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా నేతలు తీవ్రంగా ఖండించారు. ‘వైకాపా నేతల అవినీతి, అక్రమాలను ప్రశ్నించే గొంతుకలను తన రౌడీ మూకలతో సీఎం జగన్‌ భయపెట్టాలని చూస్తున్నారు. ఇది సిగ్గుచేటు. త్వరలోనే జగన్‌ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు స్వస్తి పలుకుతారు’ అని చంద్రబాబు ఆదివారం ట్వీట్‌ చేశారు. ఆనంకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా జగన్‌ పాలన సాగుతోంది.. ఈ దమనకాండకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నేతలపై దాడులకు ప్రయత్నించడం జగన్‌ రౌడీ పాలనకు నిదర్శనమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు, ముఖ్యమంత్రి చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా.. దాడులు చేయడం తగదని తెదేపా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర డిమాండ్‌ చేశారు. పార్టీ ఆలోచనలు ప్రజల ముందు పెట్టడమే పార్టీ అధికార ప్రతినిధుల పని. అలాంటి వ్యక్తిపై దాడి తగదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రశ్నిస్తే ఎందుకంత ఉలికిపాటు?

- లోకేశ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి

ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం వైకాపా మూకల పనే. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు? తెదేపా వాణిని బలంగా వినిపిస్తున్న వెంకటరమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైకాపా ఫ్యాక్షన్‌ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని