Mynampally Hanumanth Rao: మైనంపల్లిని మార్చేద్దాం!

మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని భారాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనే విషయంలో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం.

Updated : 23 Aug 2023 07:27 IST

నిర్ణయానికి వచ్చిన భారాస అధిష్ఠానం
మల్కాజిగిరి నుంచి మూడు పేర్లు పరిశీలనలో..
హరీశ్‌పై వ్యాఖ్యల పర్యవసానం
ఈనాడు - హైదరాబాద్‌

మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని భారాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనే విషయంలో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్‌ నుంచి తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి హరీశ్‌రావుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొద్ది సమయానికి ముందు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీరా అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరి అభ్యర్థిగా ఆయన పేరు ఉండటంతో ఇదే విషయాన్ని విలేకరులు సీఎం వద్ద ప్రస్తావించారు. ‘టికెట్‌ కేటాయించాం. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలా? లేదా అనేది ఆయన ఇష్టం’ అని సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత తదితరులు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.

స్పష్టత ఇచ్చినా పట్టుపట్టడంతో...

గత కొంతకాలంగా మెదక్‌ అసెంబ్లీ స్థానంలో మైనంపల్లి కుమారుడు రోహిత్‌ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. రోహిత్‌కే మెదక్‌ టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మెదక్‌ నుంచి పద్మా దేవేందర్‌రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని పార్టీ స్పష్టత ఇచ్చింది. స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా మైనంపల్లి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తామని పేర్కొనడం, హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్‌గా పరిగణించిన పార్టీ అధిష్ఠానం మల్కాజిగిరి నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మర్రి రాజశేఖర్‌రెడ్డితో పాటు మరో రెండు పేర్లు వినిపిస్తున్నా, అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం వెల్లడించనున్నట్టు తెలిసింది.

కాంగ్రెస్‌ నేతల మంతనాలు

మరోవైపు మైనంపల్లితో కాంగ్రెస్‌ నాయకులు మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్నవారికి, సీనియర్‌ నాయకులకు కూడా కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల్లో అనివార్య పరిస్థితుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి పయనం ఎటువైపో అనేది చర్చనీయాంశంగా మారింది.

కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా: మైనంపల్లి

తిరుమల, న్యూస్‌టుడే: తనను నమ్ముకుని ఎంతో మంది కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు ఉన్నారని, హైదరాబాద్‌ వెళ్లాక వారితో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మరోమారు శ్రీవారిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘సోమవారం శ్రీవారి సన్నిధిలో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పా. హైదరాబాద్‌ వెళ్లాక మెదక్‌, మల్కాజిగిరి ప్రజలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. మాకు ప్రజల మద్దతు ఉంది. నాకు, నా కుమారుడికి టికెట్లు ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాం’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని