Yuvagalam: యువగళమే జనగళమై..!

‘యువగళం’.. జనగళమై నినదించింది. తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రజల హృదయస్పందనకు అద్దం పట్టింది. రాబోయే మార్పునకు సంకేతమా అన్నట్టుగా... అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాల ప్రజలూ విశేషంగా స్పందించారు.

Updated : 18 Dec 2023 07:46 IST

విజయవంతంగా లోకేశ్‌ పాదయాత్ర
నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగింపు
226 రోజులు... 3,132 కి.మీ. సాగిన పాదయాత్ర

ఈనాడు, అమరావతి: ‘యువగళం’.. జనగళమై నినదించింది. తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రజల హృదయస్పందనకు అద్దం పట్టింది. రాబోయే మార్పునకు సంకేతమా అన్నట్టుగా... అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాల ప్రజలూ విశేషంగా స్పందించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేశ్‌ ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రనూ అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంటుతో ఇప్పుడు లోకేశ్‌ అక్కడే ముగిస్తున్నారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను తెదేపా భారీ ఎత్తున నిర్వహిస్తోంది.

ఈ పాదయాత్ర పార్టీకి మేలు చేయడంతో పాటు, సంపూర్ణ నాయకుడిగా ఎదిగేందుకు లోకేశ్‌కు దోహదం చేసిందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. యువతను పార్టీవైపు ఆకర్షించేందుకు, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు పాదయాత్ర తోడ్పడింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు పాదయాత్ర సాగింది. సోమవారం ముగించే సమయానికి లోకేశ్‌ 3,132 కి.మీ. నడిచినట్టవుతుంది. విజయోత్సవ సభనూ దృష్టిలో పెట్టుకుంటే ఒక్క శ్రీకాకుళం తప్ప 12 ఉమ్మడి జిల్లాలను కవర్‌ చేసినట్టయింది. కుప్పంలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి దాన్ని అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు వైకాపా ప్రభుత్వం చేయని కుట్ర లేదు. పోలీసుల్ని ప్రయోగించి అక్రమ కేసులు పెట్టింది. చాలాచోట్ల వైకాపా నాయకులూ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారందరికీ దీటుగా సమాధానం చెబుతూ... లోకేశ్‌ పాదయాత్ర కొనసాగించారు.

పాదయాత్రతో రాటుదేలిన లోకేశ్‌

రాజకీయాల్లో మరింత రాటుదేలేందుకు, ప్రజానాయకుడిగా ఎదిగేందుకు యువగళం పాదయాత్ర లోకేశ్‌కు ఎంతో తోడ్పడింది. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించిన లోకేశ్‌... తొలిరోజుల్లో పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమంపై ఎక్కువ సమయం వెచ్చించారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పాదయాత్రలో మండుటెండలు, జోరువానలు, వణికించే చలిలో... కొన్ని వేల కిలోమీటర్లు నడవడంతో... నాయకుడిగా తననుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునే అవకాశం కలిగింది. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, రోజూ వందలసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడం, వారు చెప్పింది వినడం వంటివి లోకేశ్‌ను నాయకుడిగా మరింత రాటుదేల్చాయి. తారకరత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లాంటి సందర్భాల్లో తప్ప విరామం లేకుండా పాదయాత్ర కొనసాగించారు. సెప్టెంబరు 9న చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంతో... పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద విరామం ఇచ్చి, 79 రోజుల తర్వాత నవంబరు 27న మళ్లీ అక్కడినుంచే పునఃప్రారంభించారు.

దాష్టీకాలకు వెరవకుండా.. పట్టు విడవకుండా..

యువగళం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం తొలిరోజు నుంచీ ప్రయత్నించింది. జీవో నం.1ని చూపించి అవరోధాలు సృష్టించింది. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం చేరేలోపు పోలీసులు 25 కేసులు నమోదుచేయగా, వాటిలో మూడు లోకేశ్‌పైనే ఉన్నాయి. ప్రచారరథం, సౌండ్‌సిస్టమ్‌, స్టూల్‌ సహా అన్నింటినీ సీజ్‌ చేశారు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు లాంటిచోట్ల వైకాపా నాయకులు, పోలీసులు కుమ్మక్కై తెదేపా శ్రేణుల్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. 40మంది యువగళం వాలంటీర్లపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారు సహా 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. యువగళం ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం లాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. వాటికి దీటుగా సమాధానం చెబుతూ యువగళం పాదయాత్రను విజయవంతంగా కొనసాగించారు.

సొంత నిధులతో ఆర్థికసాయం

పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో లోకేశ్‌ను లక్షల మంది కలసి సమస్యలు తెలిపారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు వారిని ఊరడించి... కొందరికి వ్యక్తిగతంగా సాయమందించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత వర్గానికి చెందిన రాములమ్మ భర్త ఆత్మహత్య చేసుకున్నారని కన్నీరు పెట్టుకోగా.. వారి పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దళిత రైతు రంగమ్మకు తక్షణసాయంగా రూ.లక్ష అందజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మునిరాజమ్మ అనే మహిళకు రూ.5లక్షలు ఇచ్చారు.

ప్రతి వంద కిలోమీటర్లకో వరం

ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఆ ప్రాంతానికి ఒక వరం ప్రకటిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెదేపా అధికారంలోకి రాగానే వాటిని పూర్తిచేస్తామని ప్రకటించారు. పాదయాత్ర 100 కి.మీ. మైలురాయిని చేరుకున్న సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో కిడ్నీవ్యాధి బాధితుల కోసం డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.  

వర్గాలవారీగా ప్రత్యేక హామీలు

లోకేశ్‌ పాదయాత్రలో భాగంగా క్షత్రియులు, రజకులు, యాదవులు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, చేనేత, శెట్టిబలిజ, కురుబ.. ఇలా వివిధ సామాజికవర్గాలకు ప్రత్యేకహామీలు ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, రజకుల ధోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌, వైకాపా నాయకులు లాక్కున్న క్వారీల్ని స్వాధీనం చేసుకుని తిరిగి వడ్డెర్లకు అప్పగించడం, మత్స్యకారుల పొట్టకొడుతూ జగన్‌ తెచ్చిన జీవో 217 రద్దు, మత్స్యకారుల పిల్లలకు రెసిడెన్షియల్‌ కాలేజీలు, ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా గ్రామాల్లో అర్చకులకు వేతనాలు, బీసీల రక్షణకు ప్రత్యేకచట్టం, జిల్లా, నియోజకవర్గ స్థాయుల్లో బీసీ భవనాల నిర్మాణం, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి హామీలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని