Botsa Satyanarayana: బొత్స కోటకు బీటలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైకాపా కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ కోటకు బీటలు వారుతున్నాయి.

Updated : 19 Jan 2024 08:36 IST

తెదేపాలోకి భారీగా వలసలు
తిరిగి సైకిల్‌ ఎక్కిన గద్దే బాబూరావు
అదే బాటలో పలువురు నేతలు

ఈనాడు- విజయనగరం, న్యూస్‌టుడే, గరివిడి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైకాపా కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ కోటకు బీటలు వారుతున్నాయి. తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. బలమైన నేతలు వరుస కడుతుండడం వైకాపావర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. మంత్రి బొత్సకు పెట్టనికోటగా.. ఆయన గెలుపునకు బాసటగా నిలుస్తున్న మెరకముడిదాం మండలంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తాజాగా ఇద్దరు ప్రముఖులు తెదేపాలో చేరడంతో ఆ కోట బలహీనపడుతున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, విజయనగరం జిల్లా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకుడిగా పనిచేసి ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన కోట్ల సుగుణాకరరావు మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆ పార్టీ అగ్రనాయకుల సమక్షంలో పసుపు కండువా కప్పుకొన్నారు. చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా బాబూరావు రెండుసార్లు గెలుపొందారు. సుగుణాకరరావు తండ్రి కోట్ల సన్యాసప్పలనాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇదే స్థానం నుంచి గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

ఆ తర్వాత జరిగిన మార్పుల్లో రాజకీయంగా ఎదిగిన బొత్స కుటుంబంతో కోట్ల కుటుంబానికి రాజకీయ అనుబంధం పెరిగింది. ఈ కుటుంబానికి చెందిన నాయకులు మెరకముడిదాం మండల జడ్పీటీసీ సభ్యులుగా, మండలాధ్యక్షులుగా పనిచేశారు. ఇదే మండల నేత, డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ ఎస్‌వీ రమణరాజు స్వగ్రామం సోమలింగాపురంలో ఇటీవల వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి శిరువూరి కృష్ణమూర్తిరాజు, శిరువూరి వెంకటపతిరాజు వంటి కీలక నేతలు వైకాపాను వీడారు. పెద్ద ఎత్తున తమ అనుచరగణంతో తెదేపాలో చేరారు. వైకాపా పెద్దలు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ వారు సైకిల్‌ ఎక్కకుండా అడ్డుకోలేకపోయారు. నియోజకవర్గంలో మంత్రి బొత్సకు కంచుకోటగా ఉన్న ఇదే మండలం పెదపూతికవలసలో వైకాపాలో ఒక వర్గం ఇటీవల తెదేపాలో చేరింది. ఇంత వరకు అక్కడ తెదేపా జెండా పట్టుకునే కార్యకర్త లేని పరిస్థితి. ఇప్పుడు అధికార పక్షంతో నువ్వా.. నేనా.. అనే రీతిలో ఢీకొనే స్థాయికి చేరింది. గుర్ల మండలం గూడేంలో వైకాపా నుంచి ఒక వర్గం ఆ పార్టీని వీడి తెదేపా తీర్థం పుచ్చుకుంది.

వరుస చేరికలతో ఉత్సాహం..

మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు చేరికతో తెదేపాకు మరింత ఊపు వచ్చినట్లయింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నేత కావడంతో చీపురుపల్లిలో పార్టీ మరింత బలపడుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉత్తరాంధ్ర తెదేపాలో గద్దే చక్రం తిప్పారు. తెదేపా ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 1994, 1999లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మెరకముడిదాం మండలం చినబంటుపల్లికి చెందిన కోట్ల సుగుణాకరరావు తెదేపా జెండా పట్టడం ఆ మండలంలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. ఈయనకు జిల్లా వ్యాప్తంగా బంధుత్వాలు, విస్తృత పరిచయాలు ఉన్నాయి. సుగుణాకరరావు బాటలోనే మెరకముడిదాం మండలం నుంచి మరికొందరు కీలక నేతలు తెదేపా వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని