హిందూమతం అంతమే వారి లక్ష్యం

దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.

Published : 19 Mar 2024 04:56 IST

ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజం

ఈనాడు, బెంగళూరు, చెన్నై- న్యూస్‌టుడే-కోయంబత్తూరు: దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కర్ణాటకలోని శివమొగ్గలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. శక్తి ముసుగులో అధికారం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారని ముంబయిలో ఆదివారం భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు మోదీ బదులిచ్చారు. దేశం నుంచి ఆంగ్లేయులు వెళ్లిపోయినా వారి భావజాలం ఇంకా కాంగ్రెస్‌లో ఉందని ప్రధాని విమర్శించారు.

  ప్రధాని మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం రోడ్‌షోలో పాల్గొన్నారు. కేంద్ర సహాయమంత్రి ఎల్‌.మురుగన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి ఓపెన్‌టాప్‌ జీపు నుంచి కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు.

తెలంగాణను దోచుకున్న వాళ్లను వదిలిపెట్టం!

ఈనాడు, కరీంనగర్‌: తెలంగాణను దోచుకున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ ఇచ్చే గ్యారంటీ అని తెలిపారు. సోమవారం జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించారు. పదేళ్ల పాలనలో భారాస రాష్ట్రాన్ని దోచుకుందని.. ఇప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము దిల్లీ చేరుతోందని ధ్వజమెత్తారు. దోపిడీదారులు.. ఇతర దోపిడీదారుల అవినీతిని ప్రశ్నించలేరని.. ఎన్నికల సమయంలో భారాస కుంభకోణాలపై మాట్లాడిన కాంగ్రెస్‌ ఇప్పుడు వాటిపై నోరుమెదపడం లేదన్నారు. కాంగ్రెస్‌, భారాసలు ఒకర్ని ఒకరు కాపాడుకుంటూ.. ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ తప్పుల్ని వెనకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు. భాజపాకు 400కుపైనే సీట్లు వస్తాయని.. తెలంగాణలోనూ మెజారిటీ సీట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి తాను గ్యారంటీ అని ప్రకటించారు. జూన్‌ 2 నాటికి తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుందని.. జూన్‌ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని, వచ్చే దశాబ్దంలో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని