సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ

ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్‌ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Published : 19 Mar 2024 05:36 IST

‘రచ్చబండ’కు శ్రీకారం చుట్టిన నారా లోకేశ్‌

దుగ్గిరాల, న్యూస్‌టుడే: ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్‌ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరులలో ఆయన పర్యటించారు. ఆయా గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే మంగళగిరి రూపురేఖలు మారుస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం సహకరించలేదంటూ వైకాపాకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. రోజుల వ్యవధిలోనే మళ్లీ వెనక్కి వచ్చారని విమర్శించారు. జగన్‌ రూ.10 ఇచ్చి, రూ.100 లాక్కుంటున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. మంచికలపూడిలో యార్లగడ్డ జ్యోతి అనే యువతి మాట్లాడుతూ.. తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదన్నారు. చింతలపూడిలో కమ్యూనిటీహాలు, శ్మశానవాటికకు ప్రహరీ నిర్మించాలని గ్రామస్థులు కోరారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంగళగిరికి చెందిన బీసీ నాయకుడు ఆకురాతి నాగేంద్రంతోపాటు 200 కుటుంబాలు ఉండవల్లిలోని లోకేశ్‌ నివాసంలో తెదేపాలో చేరాయి. ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని