ఇక కాంగ్రెస్‌ ప్రచార హోరు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. పార్టీ ముఖ్య నేతలంతా అన్ని నియోజకవర్గాల్లో తిరగాలని అధిష్ఠానం ఆదేశించింది. తమ జిల్లాలకే పరిమితంకాకుండా ఇతర ప్రాంతాలకూ వెళ్లాలని సూచించింది.

Published : 17 Apr 2024 04:12 IST

ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా సీఎం పర్యటనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. పార్టీ ముఖ్య నేతలంతా అన్ని నియోజకవర్గాల్లో తిరగాలని అధిష్ఠానం ఆదేశించింది. తమ జిల్లాలకే పరిమితంకాకుండా ఇతర ప్రాంతాలకూ వెళ్లాలని సూచించింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం మందకొడిగా ఉందని, అక్కడ నేతలు చురుగ్గా పనిచేయాలని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) స్పష్టం చేసింది. భాజపా ఆరేడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారంలో ముందుందని, అక్కడ దీటుగా సభలు, ర్యాలీలు నిర్వహించాలని తెలిపింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. క్షేత్రస్థాయిలో ఏ నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుందనే నివేదికలను ఏరోజుకారోజు పార్టీ తెప్పించుకుంటోంది. లోపాలున్నచోట సరి చేయాలని రాష్ట్ర నేతలకు సూచిస్తోంది. మొక్కుబడిగా పనిచేస్తున్నారని కొందర్ని ఏఐసీసీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం స్థానిక నేతలు, కార్యకర్తలతో అభ్యర్థులు అంతర్గత సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇక నుంచి సీఎం, ఇతర ముఖ్యనేతలతో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై దృష్టి పెట్టాలని అభ్యర్థులకు పార్టీ నుంచి సూచనలు అందాయి. గ్యారంటీ హామీల అమలు, జాతీయ మ్యానిఫెస్టో వివరాలను ఇంటింటికి తిరిగి చెప్పేలా అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం 40 నుంచి 50 మండలాలున్నందున అభ్యర్థి అన్నిచోట్లా తిరగలేరని, ఇతర నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రచార కార్యక్రమాలు జరిగేలా చూడాలని సమన్వయకర్తలకు పార్టీ సూచించింది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌, ప్రియాంకాగాంధీ సహా ఇతర ముఖ్యనేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ప్రియాంక సభలు తొలుత నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని నేతలు ప్రయత్నిస్తున్నారు.

చేరికల దిశగా ప్రణాళికలు

క్షేత్ర స్థాయిలో బలమున్న నేతలు ఎవరైనా ఇతర పార్టీల్లో ఉంటే వారిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని పార్టీ... నేతలకు సూచించింది. వారు ఈ ప్రణాళికపై పనిచేస్తున్నారు. పోలింగ్‌లోగా ఎమ్మెల్యేల చేరికలు కూడా ఉండవచ్చనేది నాయకుల అంచనా. ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వారిని కూడా ప్రచారంలో భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లాలని పార్టీ సూచించింది. కొన్నిచోట్ల పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కుదరకపోతే అందరికీ నచ్చజెప్పి ఎన్నికల ప్రచారంలో కలసి పనిచేసేలా చూడాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గాం కదా అని ఏమాత్రం అలసత్వం చూపవద్దని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు మెజార్టీ వచ్చేలా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మంత్రులు తదితరులు బాధ్యత తీసుకోవాలని అధిష్ఠానం సూచించింది. 

రేపటి నుంచి నామినేషన్ల దాఖలు

గురువారం రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం ఆరంభం కానుంది. అన్ని పార్టీల ర్యాలీలు, రోడ్‌షోలతో ప్రచారం హోరెత్తనుంది. గురు, శుక్రవారాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.


ఒక్కో నియోజకవర్గంలో మూడు చోట్ల సీఎం సభలు

బుధ, గురు వారాల్లో కేరళలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి వచ్చిన తరవాత మెదక్‌, వరంగల్‌, భువనగిరి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, సభల్లో సీఎం పాల్గొంటారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రమంతా ఆయన సుడిగాలి పర్యటనలు చేసేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం మూడు చోట్ల సీఎం సభలు పెట్టాలని పార్టీ యోచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని