అడ్డంకులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ ఆదేశించారు.

Published : 18 Apr 2024 03:11 IST

జిల్లా కలెక్టర్లకు సీఈవో ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సీఈవో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. ఎన్నికల ప్రక్రియను సమీక్షించారు. ‘‘ఎన్నికల నోటిఫికేషన్‌ ఉదయం 11 గంటలకు వెలువడుతుంది. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించాలి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగినంత భద్రత ఏర్పాట్లు చేయాలి. ఏప్రిల్‌ 25 వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలి. ఆ సమయంలో అనుమతించిన వ్యక్తులను మాత్రమే ఛాంబర్‌లోకి రానివ్వాలి. రిటర్నింగ్‌ అధికారులు, కలెక్టర్లు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడూ మీడియాకు తెలియజేయాలి. తప్పుడు సమాచారం వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఏదైనా పొరపాటు జరిగితే.. ఆ డేటాను ఎన్నికల కమిషన్‌ పోర్టల్‌లో మార్పులతో తిరిగి పొందుపర్చాలి. ఎవరైనా అభ్యర్థి తనకు నిర్దిష్ట గుర్తును కేటాయించినట్లుగా చెబితే.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘంతో నిర్ధారణ చేసుకోవాలి. స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరవడం, మూయడం వంటి ముఖ్యమైన పనులను ఆర్‌వోలు తమ కింది స్థాయి అధికారులు, సిబ్బందికి అప్పగించొద్దు. వాటిని తెరవడం, మూయడం వంటివి అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే చేయాలి. పోలింగ్‌ రోజున పొడవైన వరుసలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి. పోలింగ్‌ కేంద్రాల వద్ద వరుసల్లో ఉన్నవారికి ఫ్యాన్లు, నీడ ఉండేలా చర్యలు చేపట్టాలి’’ అని వికాస్‌రాజ్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు లోకేశ్‌కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని