Rajagopal Reddy: 21న భాజపా గూటికి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ నెల 21న భాజపాలో చేరడం ఖాయమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రాజగోపాల్‌రెడ్డి, భాజపా నేత వివేక్‌ వెంకటస్వామి శుక్రవారం కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ

Published : 06 Aug 2022 06:13 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీలో నిర్ణయం

ఈనాడు, దిల్లీ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ నెల 21న భాజపాలో చేరడం ఖాయమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను రాజగోపాల్‌రెడ్డి, భాజపా నేత వివేక్‌ వెంకటస్వామి శుక్రవారం కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఆ సమయంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరికకు ఈ నెల 21వ తేదీని ఖరారు చేశారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించి అమిత్‌షా సమక్షంలో చేర్చుకోవాలని నిర్ణయించారు. అమిత్‌షాను కలిసిన అనంతరం రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తన చేరిక సభను ఎక్కడ పెట్టాలనే దానిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలకు పరిమితమైన అభివృద్ధి మునుగోడుకు వస్తుందనే భావంతోనే రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తెరాస ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మునుగోడు ఫలితం ఉంటుందన్నారు. హైదరాబాద్‌ వెళ్లగానే వ్యక్తిగతంగా స్పీకర్‌ను కలిసి రాజీనామా పత్రం ఇస్తానని, ఆయన లేకుంటే శాసనసభ కార్యదర్శికి సమర్పిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌లో కొనసాగే విషయంపై తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాజగోపాల్‌రెడ్డి సూచించారు. ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రజల్లో తమకు ఉన్న పేరు ప్రతిష్ఠలను జీర్ణించుకోలేక రేవంత్‌రెడ్డి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను పదవుల కోసం అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకపోతే రేవంత్‌రెడ్డి రాజకీయాలు వదిలేస్తారా? అని సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని