కాంట్రాక్టులు ఇస్తే తెరాసలోకి వస్తానన్న దొంగ రాజగోపాల్‌ రెడ్డి: జగదీశ్‌ రెడ్డి

ప్రజలను మోసం చేస్తూ కోమటిరెడ్డి సోదరులు ఆడుతున్న నాటకాలు సాగవని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాసలోకి వస్తా.. కాంట్రాక్టులు

Updated : 14 Aug 2022 08:30 IST

మునుగోడు, న్యూస్‌టుడే: ప్రజలను మోసం చేస్తూ కోమటిరెడ్డి సోదరులు ఆడుతున్న నాటకాలు సాగవని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెరాసలోకి వస్తా.. కాంట్రాక్టులు ఇవ్వాలని ఆఫర్‌ అడిగిన దొంగ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని విమర్శించారు. ఇదే విషయమై సీఎం కేసీఆర్‌ చుట్టూ 300 సార్లు తిరిగారని విమర్శించారు. నడిబజారులో అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డికి కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. రూ.21 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం ఆయన అమ్ముడుపోయినట్లు సాక్ష్యాలు ఉన్నాయని ప్రసార మధ్యమాల ద్వారా ప్రజలందరికీ తెలిసిందన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతూ బుకాయించడం దేనికని ప్రశ్నించారు. నాడు తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్క రూపాయికి, కాంట్రాక్టులకు అమ్ముడుపోలేదని గుర్తు చేశారు. 5 దశాబ్దాలుగా ఫ్లోరైడ్‌తో బాధ పడుతున్న ప్రజలకు సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగా మిషన్‌ భగీరథ జలాలతో విముక్తి లభించిందన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో ఏ అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్‌ను వీడి భాజపాలోకి వెళ్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ప్రశ్నించారు. నిత్యావసరాలు, గ్యాస్‌, ఇంధన ధరలు పెంచిన పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మునుగోడు ఉప ఎన్నిక దొంగలు, ద్రోహులు, పైరవీకారులకు- ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతోందని తెలిపారు. విలేకరుల సమావేశానికి ముందు జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ పాల్గొనే ప్రజాదీవెన సభా స్థలాన్ని పరిశీలించారు. తుంగతుర్తి, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మంత్రి వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని