నీచ రాజకీయాల కోసం విభజన యత్నం

కులం, మతం, నీచమైన రాజకీయాల కోసం దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఏరకంగానూ మంచిది కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. దుర్మార్గులు, విచ్ఛిన్నశక్తులు, రాజకీయాల కోసం ఎంతకైనా తెగించేవారు ఉంటారని.. అబద్ధమేదో, నిజమేదో

Updated : 18 Aug 2022 06:59 IST

భారతీయత, ఐక్యతతోనే వాటిని అడ్డుకోగలం
మేడ్చల్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్‌
ఒక్కసారి విద్వేషం పెచ్చరిల్లితే..మళ్లీ ఏకం కాలేమని వ్యాఖ్య
46 లక్షల మంది పింఛనుదారులకు కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్టు వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

కులం, మతం, నీచమైన రాజకీయాల కోసం దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని, ఇది ఏరకంగానూ మంచిది కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. దుర్మార్గులు, విచ్ఛిన్నశక్తులు, రాజకీయాల కోసం ఎంతకైనా తెగించేవారు ఉంటారని.. అబద్ధమేదో, నిజమేదో తెలుసుకుని జాగ్రత్తగా ఉంటేనే సమాజం, రాష్ట్రం, దేశాన్ని కాపాడుకోగలమన్నారు. దశాబ్దాలుగా ఎంతో గోసపడ్డామని, ఇప్పుడైనా అప్రమత్తంగా ఉంటూ లభించిన శాంతి, సుఖం, ఆస్తులు కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంతో మంది త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, స్వాతంత్య్ర ఫలాన్ని పూర్తిస్థాయిలో అనుభవించాలంటే సమాజంలో కులం, మతం, వర్గం అనే భేదాలు ఉండకూడదన్నారు. ఇలాంటి విభేదాలు పోవాలంటే భారతీయత, ఐక్యత ప్రజలందరిలో రావాలని ఆకాంక్షించారు. ఒక్కసారి సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే..మళ్లీ ఏకం కావడం అంత సులభం కాదనే నిజాన్ని గుర్తించాలన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని బుధవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పాత, కొత్త ఆసరా పింఛనుదారులు కలిపి సుమారు 46 లక్షల మందికి వారం, పది రోజుల్లో ఎలక్ట్రానిక్‌ బార్‌కోడ్‌తో కూడిన కొత్త స్మార్ట్‌ కార్డులు ఇవ్వనున్నామని ప్రకటించారు. వార్డుస్థాయి మొదలుకొని ప్రజాప్రతినిధులందరూ వాటి పంపిణీకి చొరవ తీసుకోవాలని కోరారు. ఆదిలాబాద్‌ గోండుగూడెంలో...హైదరాబాద్‌ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో..ఇలా యావత్‌ రాష్ట్రానికి 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంకితభావం, ప్రజలకు మేలు జరగాలని ఆలోచించి పనిచేయడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని’’ సీఎం తెలిపారు.

అవగాహన లేక కారుకూతలు

కొంతమంది మూర్ఖులు తెలివిలేక, అవగాహన లేక కారుకూతలు కూస్తుంటారని, తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారుతుందని ఉద్యమం సమయంలోనే చెప్పానని, అదే నిజమైందని సీఎం అన్నారు. ‘‘నేను చెప్పింది అప్పట్లో ఎవరూ నమ్మలేదు. తెలంగాణ ఏర్పడ్డ 2014లో తలసరి ఆదాయం కేవలం లక్ష రూపాయలు ఉండేది. ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో రూ.2,78,500గా ఉంది. మనకన్నా ముందే 50-60 ఏళ్లుగా రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటకను దాటిపోయాం. చాలా క్రమశిక్షణతో, అవినీతి రహితంగా, వనరుల్ని వినియోగించుకుంటేనే ఇదంతా సాధ్యమైంది.

దేశమంతా నివ్వెరపోయేలా

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి దేశమంతా నివ్వెరపోతోంది. దేశంలోనే అత్యధికంగా జీతాలు పొందుతున్నది రాష్ట్రంలోని ఉద్యోగులే. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2014లో రూ.5 లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు చేరింది. అధికారుల అంకితభావం, ప్రభుత్వం ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి కలగలిపి దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. చాలా రాష్ట్రాల్లో తెలంగాణలో నిర్మిస్తున్న కలెక్టరేట్ల తరహాలో కూడా సెక్రటేరియట్లు లేవు. పేదల ఇంట్లో పెళ్లి జరిగితే లక్ష రూపాయలు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఉందా? ఇప్పటికే ఆ పథకం కింద దాదాపు 11 లక్షల కుటుంబాలకు రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టాం. డయాలసిస్‌ బాధితులకు ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అందిస్తాం. గతంలో ముసలివాళ్లను ఇంట్లోంచి వెళ్లగొట్టేవారు. ఆసరా పింఛన్ల కారణంగా ఇప్పుడు అత్తలు, అమ్మలు గౌరవంగా బతుకుతున్నారు. ఎవరి వద్ద డబ్బులు లేకున్నా వృద్ధుల వద్ద రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంటున్నాయి. ఒకప్పుడు లక్షల మంది ఇక్కణ్నుంచి వలసలు పోయారు. నేను గర్వంగా చెబుతున్నా. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లోని కూలీలు సరిపోక 12 రాష్ట్రాల నుంచి 25-30 లక్షల మంది వలస వచ్చి పేదలు బతుకుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే కరెంటు వచ్చేదా?

60 ఏళ్ల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండేది. ఆ సమయంలో మనకు ఇష్టం లేకపోయినా తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఎన్నో బాధలు పడ్డాం. 58 ఏళ్లు మడమతిప్పని పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండి ఉంటే మనకు 24 గంటల కరెంటు వచ్చేదా? సంక్షేమ పథకాలు, పింఛన్లు అందేవా? మంచినీళ్లు దొరికేవా. తెలంగాణలో 24 గంటలు ఇస్తున్న కరెంటును పక్కనున్న ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నిత్యం దిల్లీలో మంచినీళ్లు కొనుక్కుంటారు. ఇక్కడా పరిస్థితి ఉందా? అందుకే దేశంలో జరిగే రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చ జరగాలి. పేపర్‌లో వార్త చదివి ఊరికే వదిలేయొద్దు. చైతన్యవంతమైన సమాజమే ఎప్పుడైనా పురోగమిస్తుంది’’ అని సీఎం అన్నారు. దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలున్న రాష్ట్రమూ తెలంగాణేనని, కరోనా రాకపోయి ఉంటే ఈ సమయానికి మరో 500 గురుకులాలు ఏర్పడేవన్నారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి వెళ్తూ అల్వాల్‌-బొల్లారం ముత్యాలమ్మ ఆలయంలో సీఎం పూజలు చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో సీఎంకు స్వాగతం పలికారు.


75 ఏళ్లుగా చేతగాని పాలన
- సీఎం కేసీఆర్‌

దేశంలో గత 75 ఏళ్ల నుంచి జరుగుతున్న పరిపాలన, చేతగానితనం, అసమర్థ, అవివేకమైన పనులతో ఎంతో నష్టపోయాం. గతంలో కరెంటు ఉండేది కాదు. ఎన్ని బావుల వద్ద మోటార్లు కాలిపోయేవో లెక్కలేదు. పరిశ్రమలకు కూడా హాలిడేలు ఇస్తే.. ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. ఈ రోజు తెలంగాణలో 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతోంది. గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టర్లు, జనరేటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ దుకాణాలన్నీ దివాలా తీశాయి. అంకిత భావంతో పనిచేయడం వల్లే ఇదంతా సాధ్యమైంది.  


మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలకు అదనంగా రూ.పది కోట్లు

  - సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల ఎమ్మెల్యేలు నన్ను ఎప్పుడు కలిసినా కొత్త కాలనీల్లో చిన్నచిన్న పనులు చేయాల్సి ఉందని చెబుతుంటారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.5 కోట్లు సరిపోవడం లేదని చెబుతారు. అందుకే మేడ్చల్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఇస్తున్న రూ.5 కోట్లకు అదనంగా మరో రూ.10 కోట్లు ఇస్తాం. రేపే జీవో ఇచ్చి నిధులు విడుదల చేస్తాం. కొత్తగా ఏర్పాటయ్యే ఆవాసాలు, బస్తీలలో చిన్నపాటి మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకోవాలి.      

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts