రాజధాని పేరుతో విశాఖ లూటీ

విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు విలువైన భూములను లూటీ చేశారని, మూడున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను నగరానికి తేలేకపోయారని, కనీసం అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

Published : 27 Sep 2022 04:34 IST

ఇకనైనా మభ్యపెట్టకుండా వాస్తవాలు చెప్పాలి
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన తెదేపా నేతలు

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు విలువైన భూములను లూటీ చేశారని, మూడున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను నగరానికి తేలేకపోయారని, కనీసం అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. వైకాపా నేతల బాగోతం విశాఖ జిల్లా ప్రజలకు తెలుసని, తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడారు.

రైతులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదు: పల్లా
ఏం సాధించారని రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెట్టారని పల్లా శ్రీనివాసరావు నిలదీశారు. భూములిచ్చిన రాజధాని రైతులు తమ ఆవేదన వివరించడానికి వస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ‘విశాఖకు ఇంత వరకు ఏం చేశారు? భవిష్యత్తులో ఏం చేయనున్నారో అనే విషయాలు చెప్పకుండా తెదేపా పాలనలో ఏమీ చేయలేదని వైకాపా నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది. సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ 5 నిమిషాల్లో రాజధాని రైతుల పాదయాత్రను నిలువరిస్తామని చెప్పడం రైతుల పట్ల ఆయనకు ఉన్న చెడు అభిప్రాయాన్ని తెలియజేస్తోంది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఒక వైపు లోక్‌సభలో రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని కోరుతూ రాజ్యాంగ సవరణకు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. మూడు రాజధానుల బిల్లులను అసెంబ్లీలో ఉపసంహరించుకున్నారు. ఈ పరిస్థితుల్లో విశాఖలో పరిపాలన రాజధాని ఎలా ఏర్పాటు చేస్తారు?  కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలను మభ్యపెట్టడానికే వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విశాఖలో దసపల్లా, ఎన్‌సీసీ, హయగ్రీయ, తదితర సంస్థ భూములను కబ్జా చేశారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అదానీ గ్రూపునకు చౌకగా అప్పగించారు. ఐటీ సంస్థలు రాకుండా అడ్డుపడ్డారు. బే పార్కు, కార్తీక వనం భూములు కాజేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కాకుండా పోరు సాగించలేకపోయారు. మూడేళ్లలో ఇష్టం వచ్చినట్లు దోచుకొని ఇప్పుడు పరిపాలన రాజధాని అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు....’ అని ఆయన పేర్కొన్నారు. విశాఖను గంజాయికి రాజధాని చేశారని ఎద్దేవా చేశారు.

భూములు తనఖా పెట్టి అప్పులు: వెలగపూడి
వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో విశాఖలో రూ.1100 కోట్ల విలువ చేసే భూములను అమ్మేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఆయన కుమారుడు జగన్‌ విశాఖలో ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చారు. సకాలంలో అప్పులు తీర్చకుంటే కలెక్టరేట్‌ సహా 11 ప్రభుత్వ ఆస్తులను వేలం వేసే అవకాశం ఉంది. మరో 11 ఆస్తులను తనఖా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకుంటూ విశాఖను ఏ రకంగా పాలనా రాజధాని చేస్తారో చెప్పాలి’ అని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్రలో ఎంపీ విజయసాయి బెదిరించి భూములు లాక్కున్నారని, ఆరోపించారు.

పోలవరం ఎత్తు తగ్గింపుతో ఉత్తరాంధ్రకు అన్యాయం: గండి బాబ్జీ
రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెట్టారని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ధ్వజమెత్తారు. ‘నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే పోలవరం కాలువ పూర్తి చేయాలి. ప్రాజెక్టు ఎత్తు తగ్గించేసి ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేస్తున్నారు. పోలవరం 45.5 మీటర్ల ఎత్తులో నిర్మించాలి...’ అని ఆయన డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.5కోట్లు మించి ఇచ్చే పరిస్థితి లేదని గండి బాబ్జీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెదేపా భీమిలి నియోజకవర్గ బాధ్యులు కోరాడ రాజబాబు, విశాఖ లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

మేం తల్చుకుంటే జగన్‌ ఇంట్లోంచి బయటకు రాలేరు: బండారు
మంత్రి బొత్స ఈ మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. మహా విశాఖ నగరపాలక సంస్థ పన్నులను సైతం ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకున్నారని విమర్శించారు. ‘చంద్రబాబు హయాంలో 9000 ఎకరాల్లో ఎస్‌ఈజెడ్‌ వచ్చింది. ఎన్టీపీసీ, ఫార్మాసిటీ, హెచ్‌ఎస్‌బీసీ, ఆనందపురం-అనకాపల్లి ఆరులైన్ల జాతీయ రహదారి, గంగవరం పోర్టు, పలు జాతీయ విద్యా సంస్థలు వచ్చాయి. జగన్‌ తన పాలనలో ఏం తెచ్చారు? మేం తల్చుకుంటే జగన్‌ ఇంట్లోంచి బయటకు రాలేరు. తెదేపా, వైకాపా పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలి...’ అని ఆయన సవాల్‌ విసిరారు. విశాఖకు ఇచ్చిన నిధులు, అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో విశాఖ అభివృద్ధికి తీసుకోవల్సిన అంశాలపై చర్చించకపోవడం దారుణమన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని