సంక్షిప్త వార్తలు(9)

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ పాలనపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలను రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఖండించారు.

Updated : 01 Oct 2022 06:47 IST

హరీశ్‌రావు వ్యాఖ్యలు సరికాదు

ఏపీ మంత్రి అమర్‌నాథ్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ పాలనపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలను రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఖండించారు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు, కేసీఆర్‌ మధ్య గొడవలు ఉంటే వాళ్లు చూసుకోవాలని, మధ్యలో ఆంధ్ర రాష్ట్రంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 8 ఏళ్లుగా కేసీఆర్‌ తెలంగాణాకు ఏం చేశారో చెప్పాలని డిమాండు చేశారు. కేసీఆర్‌, హరీశ్‌రావులను చూసి తాము నేర్చుకోవాల్సిందేమీ లేదని, ఆ అవసరమూ లేదన్నారు. ఏపీలో మూడేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ఇటీవల తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఉదయం విమర్శ చేసి రాత్రికి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు.


తెరాస హయాంలో ఆరోగ్య వ్యవస్థ బలహీనం: బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస పాలనలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, 2014 ఎన్నికల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ విస్మరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న వీరి పట్ల తెరాస ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన దుయ్యబట్టారు. ‘‘ఇంజక్షన్‌ వేయకూడదు.. సెలైన్‌ ఎక్కించొద్దు అంటూ ఆ వ్యవస్థే లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ సరిగా చేయలేక ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనలో కిందిస్థాయి సిబ్బందిపైనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై వైద్య శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేసి వైద్యశాఖ డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలి’’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.


‘భగీరథ’ పేరిట నిధుల దోపిడీ
వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపణ

జోగిపేట, న్యూస్‌టుడే: బంగారు తెలంగాణ చేస్తానంటూ అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌ రాష్ట్రాన్ని అధోగతిలోకి నెట్టారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటకు వచ్చిన ఆమె.. హనుమాన్‌ చౌరస్తాలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఉద్యోగులకు జీతాలు, వృద్ధులు, వితంతులకు పింఛన్లు సకాలంలో ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరిందని విమర్శించారు. మిషన్‌ భగీరథ పేరుతో నిధులు కాజేశారని ఆరోపించారు. పాతపైపులే వాడుతూ, పాత ట్యాంకులకు రంగులు పూసి రూ.కోట్లలో నిధులు కాజేశారన్నారు. ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. పల్లెలు, పట్టణాల్లో ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ చేపట్టిన పనులకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవడానికే పాదయాత్ర చేపట్టినట్టు షర్మిల వివరించారు.


పేదల సొమ్ముతో కేసీఆర్‌ విలాసాలు
బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌

నాంపల్లి(మర్రిగూడ), న్యూస్‌టుడే: అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నిరుపేదల సంక్షేమానికి వెచ్చించాల్సిన సొమ్మును సీఎం కేసీఆర్‌ సొంత విమానం కొనుగోలు వంటి విలాసాలకు ఖర్చు చేస్తున్నారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా శుక్రవారం మర్రిగూడ మండలంలో పర్యటించారు. రాష్ట్రంలో పేదపిల్లల చదువులను విస్మరించి రూ.100కోట్లతో కేసీఆర్‌ విమానం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఫామ్‌హౌస్‌కు వెళ్లడానికి చక్కని రహదారి నిర్మించుకున్న సీఎం కేసీఆర్‌ మునుగోడు నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లను విస్మరించారని దుయ్యబట్టారు. తెలంగాణ సంపదను కొందరికే దోచిపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో పరిహారం ఇవ్వకుండా నియోజకవర్గంలోని పేదల భూములు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు బీఎస్పీ వైపే ఉన్నారని, బహుజన రాజ్యాధికారం సాధిస్తామని ప్రవీణ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో యువకులు, మహిళలు పార్టీలో చేరారు.


ఏఐసీసీ కోశాధికారి బన్సల్‌తో తెలంగాణ నేతల భేటీ
ఈడీ నోటీసుల నేపథ్యంలో సూచనలు

ఈనాడు, దిల్లీ: తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం ఏఐసీసీ కోశాధికారి పవన్‌ కుమార్‌ బన్సల్‌తో దిల్లీలో భేటీ అయ్యారు. మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మెదక్‌ జిల్లా నేత గాలి అనిల్‌కుమార్‌లు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నిర్వహించే యంగ్‌ ఇండియన్‌ ట్రస్టుకు విరాళాల ఇవ్వడంతో వారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీలను ఈడీ విచారించిన విషయం విదితమే. ఈడీ విచారణ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బన్సల్‌తో పాటు ఆర్థిక నిపుణులు కాంగ్రెస్‌ నేతలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.


త్వరలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు: విష్ణువర్ధన్‌రెడ్డి

కరప, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రెండు మూడు నెలల్లో రాజకీయ సమీకరణాల మార్పులతో ఎన్నో విచిత్రాలు జరుగుతాయని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెహ్రూ యువక కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కరపలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో జనసేన పార్టీతో కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అధినేతల పేర్లు పెట్టడం దారుణం. కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ప్రధానమంత్రి కిసాన్‌ యోజన, గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన.. ఇలా ఎవరికీ సంబంధం లేని పేర్లు పెట్టి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేస్తోంది...’ అని పేర్కొన్నారు.


అధికార పార్టీ వాళ్లకే సుబాబుల్‌ కర్రను అమ్మాలని బెదిరింపులు

వైకాపా వారికి వంతపాడుతున్న పోలీసులు

సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి : సుబాబుల్‌ కర్రను అధికార పార్టీ వారికే విక్రయించాలని రైతులను బెదిరించడం దారుణమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. సుబాబుల్‌ కొనుగోళ్లలో కులం, ప్రాంతం, పార్టీలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ర కొనుగోళ్లలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని కోరుతూ సీఎం జగన్‌కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘మూడున్నరేళ్లుగా గిట్టుబాటు ధరలేక సుబాబుల్‌ రైతులు నష్టాల్లో ఉన్నారు. పేపర్‌ తయారీ పరిశ్రమలు కర్రను నామమాత్రంగానే కొన్నాయి. గత కొన్ని రోజులుగా పరిశ్రమలు కర్ర కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు, వారు సూచించిన దళారులకే సుబాబుల్‌ను అమ్మాలనే బెదిరింపులతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయని వారి పంటను కొనబోమని చెప్పడం ఎంత వరకు సమంజసం? ఒకవేళ వైకాపా వాళ్లు సూచించిన వారికే విక్రయించినా ధరలో కోత పెడుతున్నారు. బయటవాళ్లకు అమ్మడానికి కర్రను తరలిస్తున్న లారీలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకు వంతపాడటం దుర్మార్గం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో రైతులు పడిగాపులు కాయడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి’’ అని  లోకేశ్‌ లేఖలో పేర్కొన్నారు.


మండల్‌ విగ్రహ ఏర్పాటుకు అభ్యంతరమెందుకు?
తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : రహదారులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వైఎస్సార్‌ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు లేని అభ్యంతరాలు, ఇబ్బందులు బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మండల్‌ విగ్రహ ఏర్పాటుకు ఎందుకని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండిపడ్డారు. మండల్‌ విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది కూల్చడం దారుణమని శుక్రవారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘‘ప్రజావేదికతో మొదలైన కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడున్నరేళ్లుగా బీసీలను అణగదొక్కడమే ధ్యేయంగా జగన్‌రెడ్డి పాలన సాగుతోంది. బీసీ సబ్‌ప్లాన్‌, కార్పొరేషన్ల నిధులను దారిమళ్లించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కూల్చివేసిన దిమ్మెను తక్షణం నిర్మించాలి. రాష్ట్రవ్యాప్తంగా మండల్‌ విగ్రహాలు ఏర్పాటు చేయాలి’’ అని బీటీ నాయుడు డిమాండ్‌ చేశారు.


ఆ సీఐడీ పోలీసులపై చర్యలు తీసుకోరా?
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రేషన్‌ బియ్యం వాహనాన్ని ఏఎస్సై సీజ్‌ చేసిన విషయంలో స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించేసరికి సంబంధిత ఎస్సై, ఏఎస్సైలను సస్పెండ్‌ చేస్తారా? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డీజీపీని ప్రశ్నించారు. మరి పాత్రికేయుడు అంకబాబు కేసులో కోర్టు షోకాజ్‌ నోటీసులు అందుకున్న సీఐడీ అధికారులపై చర్యలు ఉండవా? సీఐడీ విభాగం మీ శాఖ పరిధిలో లేదా? అని శుక్రవారం ట్వీట్‌ చేశారు. దీనిపై ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని