సంక్షిప్త వార్తలు(5)

గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా భాజపా పాలన సాగుతోందని, ఇది దేశానికి ప్రమాదకరమని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆయన ఆదివారం అసెంబ్లీ మీడియాహాలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Updated : 03 Oct 2022 05:57 IST

భాజపా పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు: భట్టి విక్రమార్క

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా భాజపా పాలన సాగుతోందని, ఇది దేశానికి ప్రమాదకరమని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆయన ఆదివారం అసెంబ్లీ మీడియాహాలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భాజపా పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని, ఇద్దరు వ్యాపారులు మాత్రమే కుబేరులుగా ఎదిగారని విమర్శించారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ జాతీయ పార్టీపై విలేకరులు ప్రశ్నించగా.. ఆయన ప్రకటన చేసిన తర్వాత స్పందిస్తానని  భట్టి పేర్కొన్నారు.


గాంధీ చూపిన బాటలో నడిస్తే ప్రపంచశాంతి: తెదేపా

ఈనాడు, హైదరాబాద్‌: గాంధీ చూపిన సత్యం, అహింస బాటలో ప్రతిఒక్కరూ నడిస్తే ప్రపంచశాంతి వర్ధిల్లుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవిందకుమార్‌గౌడ్‌లు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా వారు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే తెలుగుదేశం పార్టీకి ఆరాధ్యులని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు చెప్పేవారని గుర్తుచేశారు.


ప్రజలపై కాపు రామచంద్రారెడ్డి దౌర్జన్యం
తెదేపా సీనియర్‌ నేత కాలవ శ్రీనివాసులు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ప్రజలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్న కాపు రామచంద్రారెడ్డి ఆ కోపాన్ని తెదేపా కార్యకర్తలపై ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై సామూహిక తిరుగుబాటు తప్పదన్నారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘గుమ్మగట్టు మండలం బీటీపీలో తెదేపా కార్యకర్త బెస్త మూర్తి ఇంటికెళ్లిన రామచంద్రారెడ్డి అతన్ని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నారు. గతంలో నిర్మించుకున్న ఇంటికి బిల్లు రాలేదని అడిగినందుకు నీ అంతు చూస్తానంటూ బెదిరించారు. కేపీ కుంట గ్రామంలోని రాముడు అనే తెదేపా కార్యకర్త ఇంటికి వెళ్లి నానా రభస సృష్టించారు’ అని ఆరోపించారు.


అంగన్‌వాడీలకు తెదేపా అండగా ఉంటుంది: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంగన్‌వాడీలకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ  ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల నియామకంలో అవకతవకలపై పోరాడిన తెలుగునాడు అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సంఘానికి ఆదివారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. ‘‘అధికార పార్టీ అక్రమాలను గుర్తించిన తెలుగునాడు అంగన్‌వాడీ విభాగం బాధితుల పక్షాన నిలిచింది. వారి పోరాటంతోనే అక్రమ నియామకాలు నిలిచిపోయాయి’’ అని  లోకేశ్‌ పేర్కొన్నారు. మద్యపానం నిషేధిస్తామని హామీఇచ్చిన జగన్‌రెడ్డి జే బ్రాండ్లు తెచ్చారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. అప్పట్లో ఉన్న బ్రాండ్లన్నీ రద్దు చేసి జే బ్రాండ్లు తెచ్చిన జగన్‌.. దాన్నే మద్యపాన నిషేధంగా చెబుతున్నారని మండిపడ్డారు.


చింతకాయల విజయ్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఐటీడీపీలో క్రియాశీలంగా ఉన్నందుకే చింతకాయల విజయ్‌పై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఐడీ పోలీసులు విజయ్‌ ఇంటికెళ్లి చిన్న పిల్లల్ని సైతం బెదిరించడం చూస్తుంటే వ్యవస్థలు ఎటుపోతున్నాయో అర్థంకావడం లేదన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘బడుగుబలహీన వర్గాల నాయకులను వైకాపా ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోంది. చింతకాయల విజయ్‌ చేసిన తప్పేంటి? అచ్చెన్నాయుడిపై అక్రమ కేసులు పెట్టారు. శాసనమండలిలో బీద రవిచంద్రయాదవ్‌పై వైకాపా సభ్యులు దాడికి యత్నించారు. వంగలపూడి అనిత, గౌతు శిరీషలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. తనపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ తెదేపా నాయకురాలు ఉండవల్లి అనూష ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందుకు రాలేదు. 73 ఏళ్ల వృద్ధుడని కూడా చూడకుండా సీనియర్‌ పాత్రికేయుడు అంకబాబును అరెస్టు చేశారు’’ అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

తులసీతంతీ మృతికి చంద్రబాబు నివాళి
సుజ్లాన్‌ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకుడు తులసీతంతీ మృతి బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. దేశంలో పవన విద్యుత్తు రంగానికి ఆయన ఎనలేని సేవ చేశారని.. ఈ విషయంలో ఏపీకి కూడా ఎంతో సహకరించారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని