icon icon icon
icon icon icon

ఎన్నికల వేళ.. వైకాపా మెడకు రైల్వేజోన్‌ ఉచ్చు!

ఎన్నికల వేళ వైకాపాకు రైల్వే జోన్‌ ఉచ్చు బిగుసుకుంది. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌  రైల్వే జోన్‌కు స్థలం కేటాయించలేదన్న మాట అనగానే, వైకాపా మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు.

Updated : 08 May 2024 09:39 IST

రైల్వే ముఖ్య కార్యాలయానికి విశాఖలో భూమి ఇవ్వలేదన్న మోదీ
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తేల్చి చెప్పిన ప్రధాని

ఈనాడు-విశాఖపట్నం: ఎన్నికల వేళ వైకాపాకు రైల్వే జోన్‌ ఉచ్చు బిగుసుకుంది. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌  రైల్వే జోన్‌కు స్థలం కేటాయించలేదన్న మాట అనగానే, వైకాపా మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే జోన్‌ విషయంలో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాట్లాడారు. విశాఖలో రైల్వే ముఖ్య కార్యాలయానికి భూమి అడిగితే ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ‘రైల్వే జోన్‌ స్థలంపై కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారు’ అంటూ మంత్రి బొత్స దిద్దుబాటు చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ అబద్ధపు ప్రచారాలపై మోదీ కుండబద్ధలు కొట్టారు. సీఎంవో కార్యాలయం పేరుతో ప్యాలెస్‌ కట్టడానికి ఏకంగా రుషికొండను తొలిచిన జగన్‌కు.. రైల్వే కార్యాలయానికి ఇవ్వడానికి స్థలం చూపించలేక పోయారా? అనే చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది.

నిర్మాణాలకు అనువుగాని చోట:

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేసిన ఓ ప్రకటన వైకాపా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. విశాఖ రైల్వే జోన్‌కు జగన్‌ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే ఆలస్యమైందని ఆయన ప్రకటించారు. దీంతో జగన్‌ సర్కార్‌ రైల్వే జోన్‌ స్థలం పై దిద్దుబాటు చర్యల్లో భాగంగా సీడీఎంఏ (కమిషనర్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) నుంచి జీవీఎంసీకి ఓ లేఖ పంపారు. అందులో ప్రత్యామ్నాయంగా గతంలో ఇచ్చిన స్థలంతో పాటు మరో 40 ఎకరాలు కలిపి ఇవ్వాలని పేర్కొన్నారు. బీఆర్టీఎస్‌ రహదారి విస్తరణలో భాగంగా రైల్వే స్థలాలు తీసుకున్న జీవీఎంసీకి ప్రత్యామ్నాయంగా ముడసర్లోవ వద్ద 52 ఎకరాలు గతంలోనే కేటాయించగా.. రైల్వే జోన్‌కు స్థలం ఇవ్వలేదన్న వివాదం తెరపైకి రాగానే పాత కేటాయింపు పక్కనే మరో 40 ఎకరాలు చదును చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్‌ సమీపంలో క్యాచ్‌మెంట్‌ ఏరియా (పరివాహక ప్రాంతం)లో ఈ స్థలం కేటాయించారు. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా  అనువుగాని చోట రైల్వే ముఖ్య కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించి చేతులు దులిపేసుకోవడం గమనార్హం.

భూ సంతర్పణ ఎందుకోసం?:

ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉన్న విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించేందుకు నిర్లక్ష్యం చూపిన జగన్‌... అనుకున్న కంపెనీల భూ సంతర్పణకు మాత్రం ముందున్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపుపాలెం మండలం రాచపల్లి వద్ద అన్‌రాక్‌ పరిశ్రమకు 2008 వై.ఎస్‌ హయాంలో 2వేల ఎకరాలు కేటాయించారు. ఎకరా రూ.2.83 లక్షల చొప్పున ఇచ్చారు.  స్థానిక 5వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించాలన్న నిబంధన పెట్టారు. ఆ కంపెనీకి చింతపల్లిలో బాక్సైట్‌ గనుల కేటాయింపుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, తీవ్ర వ్యతిరేకత రావడంతో కేటాయింపులు నిలిపివేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బాక్సైట్‌ జీవో రద్దు చేసింది. దీనిపై అన్‌రాక్‌ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కంపెనీతో మధ్యవర్తిత్వం నడిపి బాక్సైట్‌ బయట నుంచి తెచ్చుకునేలా అనుమతులిచ్చారు. కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించినా పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించలేక పోయారు. ఇది ఇలా ఉండగానే కంపెనీ పేరు మార్చి పైనీర్‌ పేరిట మరో 479 ఎకరాలు జగన్‌ భూ సంతర్పణ చేశారు. ప్రభుత్వ ధర ప్రకారమే ఎకరా రూ.35లక్షలపైగా ఉండగా, కేవలం ఎకరా రూ.3.56లక్షలకే ఈ ఏడాది ఫిబ్రవరిలో జగన్‌ సర్కార్‌ కట్టబెట్టడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img