ప్రజల దృష్టి మళ్లించడానికే జాతీయపార్టీ

‘‘తెరాసలో అసమ్మతిని తగ్గించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి జాతీయ పార్టీ అనే చర్చను తెరపైకి కేసీఆర్‌ తెచ్చారు. ఫాంహౌస్‌లో కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోంది. జాతీయస్థాయిలో విపక్షాలను ఏకం చేసి భాజపాను ఓడిస్తామని కేసీఆర్‌ చెబుతున్న మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు’’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 04 Oct 2022 03:38 IST

కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘తెరాసలో అసమ్మతిని తగ్గించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి జాతీయ పార్టీ అనే చర్చను తెరపైకి కేసీఆర్‌ తెచ్చారు. ఫాంహౌస్‌లో కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోంది. జాతీయస్థాయిలో విపక్షాలను ఏకం చేసి భాజపాను ఓడిస్తామని కేసీఆర్‌ చెబుతున్న మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు’’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ జాతీయ పార్టీని ఎందుకు పెడుతున్నారో, దాని వెనుక సారాంశమేంటో అర్థంకాక తెరాస నాయకులు ప్రగతి భవన్‌ ముందు తల పట్టుకుని కూర్చుంటున్నారు. కేసీఆర్‌ పోకడ ఏంటో అర్థంకాక ఆయన పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారు. మజ్లిస్‌ పార్టీని పెంచి పోషించడానికే జాతీయ పార్టీ పెడుతున్నారని వారంటున్నారు. మజ్లిస్‌ నాయకుడు ఒవైసీ బుల్లెట్‌పై ప్రగతిభవన్‌కు వచ్చి చర్చలు జరిపారట. ఒవైసీతో సమావేశమైన తరవాత జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్‌ చెప్పారు. ఈ రెండు పార్టీలు కలసి విమానం కొని దేశమంతా తిరిగి ప్రచారం చేస్తామని చెబుతున్నారు. వ్యతిరేక ధోరణితో పెట్టిన ఏ పార్టీ దేశంలో బతికి బట్టలేదు.’’ అన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో రోజురోజుకు తెరాసపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజల దృష్టిని మళ్లించడానికే జాతీయ పార్టీని పెడుతున్నానని చర్చలు మొదలుపెట్టారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ సీఎం కుర్చీ కదులుతుంటే ఆయన ప్రధాని కుర్చీ కావాలని ఆశపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు నిద్రలో కూడా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలే కనిపిస్తున్నాయని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని