గులాబీకి కొత్త గుబాళింపు

తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర కొత్త మలుపు తిరగనుంది. ఆవిర్భవించిన 21 సంవత్సరాల తర్వాత జాతీయ పార్టీగా  రూపాంతరం చెందనుంది.

Updated : 05 Oct 2022 06:03 IST

తెరాస చరిత్రలో కొత్త అధ్యాయం.. ఇక జాతీయ పార్టీ
దేశవ్యాప్త గుర్తింపు, తెలంగాణ అభివృద్ధి నమూనా వ్యాప్తి.. ఇవే లక్ష్యాలు
భాజపాపై పోరుకు రైతులు, ఇతర వర్గాల సమీకరణ వ్యూహం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్ర కొత్త మలుపు తిరగనుంది. ఆవిర్భవించిన 21 సంవత్సరాల తర్వాత జాతీయ పార్టీగా  రూపాంతరం చెందనుంది. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం తెలంగాణ భవన్‌లో తెరాస స్థానంలో ఏర్పాటయ్యే కొత్త పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీకి ఇది అత్యంత కీలక ఘట్టం. కేసీఆర్‌ నిర్ణయం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెరాస 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించింది. ఆరు నెలలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఉనికి చాటుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకూడి పోటీ చేసింది. ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది. ఆ తర్వాత అందులో నుంచి బయటికి వచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు నేతలు రాజీనామా చేశారు. 2009లో మహాకూటమితో జతకట్టింది. ఆ తర్వాత దానికీ దూరమైంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి అధికారంలో ఉంది. మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాల్లో ఎన్డీయే ప్రభుత్వానికి కేసీఆర్‌ మద్దతునిచ్చారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో క్రమేపీ ఎన్డీయేకు దూరమయ్యారు. 2018 శాసనసభ ఎన్నికలకు ముందునుంచే జాతీయస్థాయి కూటమిపై సన్నాహాలు ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. 2019లో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం పట్ల భాజపా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ వస్తున్నారు. విభజన హామీలను అమలు చేయకపోవడం, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం, రుణాలపై ఆంక్షలు తదితర పరిణామాల నేపథ్యంలో భాజపాపై పోరు కోసం జాతీయ కూటమి వైపు మొగ్గు చూపారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి వివిధ పార్టీల నేతలతో చర్చించారు. కూటమి ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు రావడంతో జాతీయ పార్టీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇప్పటికే పార్టీ వర్గాలకు సంకేతాలిచ్చారు. వివిధ సందర్భాల్లో జాతీయ ప్రత్యామ్నాయ శక్తి గురించి ప్రస్తావించారు. జాతీయ స్థాయికి పార్టీ విస్తరణపై కేసీఆర్‌ విస్తృతంగా చర్చించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తోనూ మంతనాలు జరిపారు. రైతు సంఘాల నేతలు, రాజకీయ ప్రముఖులు, సామాజిక, ఆర్థికవేత్తలు, మాజీ సైనికాధికారులతో విస్తృతంగా చర్చించారు. వాస్తవానికి గత జూన్‌లోనే జాతీయ పార్టీ ఏర్పాటుకు ఆయన ముహూర్తం నిర్ణయించారు. అప్పటికి పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా లేకపోవడంతో వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఆగినట్లు తెలుస్తోంది.

విస్తరణకు కార్యాచరణ

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత వచ్చే నెలలో జాతీయస్థాయి విస్తరణకు కార్యాచరణ మొదలవుతుంది. తొలుత అన్ని రాష్ట్రాలకు పార్టీ సమన్వయకర్తలను కేసీఆర్‌ నియమిస్తారు. తెలంగాణలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను ప్రస్తుత తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు అప్పగించనున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌ జాతీయస్థాయిలో పర్యటనలు చేస్తారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు. ఆ రోజు జాతీయస్థాయి ఎజెండాను ప్రకటిస్తారు.

భాజపాను దెబ్బతీయడమే తొలి లక్ష్యం..

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను దెబ్బతీయడమే తన తొలి లక్ష్యమని కేసీఆర్‌ చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా భాజపాపై, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న ఆయన.. రైతులు, యువత, మహిళలు, సైనికులు, ఇతర వర్గాలను కూడగట్టి భాజపా  ముక్త్‌ భారత్‌ వైపు అడుగులు వేస్తామని ప్రకటించారు. కమలదళం వైఖరిని సభలు, సమావేశాల్లో ఎండగట్టడంతో పాటు ఎన్నికల్లోనూ ఢీకొట్టాలనే భావనతో ఉన్నారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో, వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ ప్రజలు నివసించే సూరత్‌, బళ్లారి, కలబురగి తదితర ప్రాంతాల్లో జాతీయ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భారాసవిస్తరణలో భాగంగా ఇతర పార్టీల విలీనంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇతర పార్టీలనేతలను చేర్చుకుంటారని పేర్కొంటున్నాయి.

రాష్ట్రానికే ప్రాధాన్యం

జాతీయ పార్టీగా రూపుమారిన తర్వాత కూడా రాష్ట్రానికే కేసీఆర్‌ ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాలు చేస్తానని ఇప్పటికే ఆయన స్పష్టతనిచ్చారు. వచ్చే ఏడాది డిసెంబరులో రాష్ట్ర శాసనసభ ఎన్నికలున్నాయి. వాటిలో విజయం సాధించి.. అధికారంలో కొనసాగాలని ఆయన భావిస్తున్నారు.

సవాళ్లకు సై..

జాతీయ పార్టీ నిర్వహణ సవాళ్లతో కూడిన అంశం. రాష్ట్రంలో పార్టీ ఆధిపత్యాన్ని నిలుపుకొంటూ.. ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి. దక్షిణాదిన కొంత గుర్తింపు ఉన్నా.. ఉత్తరాదిలో పార్టీ పాగా వేయడం కష్టసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాల్లోనూ శ్రేణులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

తెలంగాణ పథకాలపై ఆశలు

తెలంగాణలో చేపట్టిన రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌, మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్లు తదితర పథకాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ పథకాలపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు తెలంగాణ అభివృద్ధి నమూనాను పార్టీ ఎజెండాగా ప్రజలను ఆకర్షించడం ఆయన ప్రధాన ఉద్దేశంగా ఉంది. జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా దేశం దృష్టిని ఆకర్షించి తెలంగాణకు విస్తృత ప్రాచుర్యం కల్పించడంతో పాటు భాజపా వైఖరిని దేశమంతటికీ తెలియజేయడం ద్వారా రాష్ట్రంపై వివక్షను అడ్డుకోవచ్చని భావిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని