సంక్షిప్త వార్తలు(7)

జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఆ పార్టీ జాతీయ నాయకుడు మల్లికార్జున ఖర్గే శనివారం రాష్ట్రానికి రానున్నారు.

Updated : 08 Oct 2022 06:17 IST

నేడు రాష్ట్రానికి ఖర్గే రాక

ఈనాడు, అమరావతి: జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఆ పార్టీ జాతీయ నాయకుడు మల్లికార్జున ఖర్గే శనివారం రాష్ట్రానికి రానున్నారు. ఏపీసీసీ ప్రతినిధులను ఆయన కలిసి ఎన్నికల్లో మద్దతు కోరనున్నారు. మధ్యాహ్నం 4గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌కు చేరుకొని పీసీసీ ప్రతినిధులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.


దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు రాహుల్‌ జోడో యాత్ర
ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ రాష్ట్ర ఇన్‌ఛార్జి రమణి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న భారత్‌ జోడోయాత్రలో ప్రజలంతా పాల్గొని ఆయన కృషికి మద్దతు తెలపాలని ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ విభాగం తెలంగాణ ఇన్‌ఛార్జి రమణి కోరారు. ఈ నెల 24న భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ విభాగం, అధికార ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరగనున్న జోడో యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం రమణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. దేశ సంపదను తన అనుచర వ్యాపారవేత్తలకు దోచిపెడుతోందని ఆరోపించారు.ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి సమైక్యంగా ఉంచేందుకు రాహుల్‌గాంధీ ఒక భారీ పాదయాత్ర చేపట్టారన్నారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి నదీమ్‌ జావెద్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధులు అతుల్‌ లుండే, అంశుమన్‌, మాజీ విప్‌ అనిల్‌, చామల కిరణ్‌రెడ్డి, సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీష్‌, మాజీ ఎంపీలు మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


సర్పంచులపై దౌర్జన్యం దారుణం: సీపీఎం

ఈనాడు, అమరావతి: ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీలకు బదిలీ చేయాలని కోరేందుకు పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల వద్దకు వెళ్లిన సర్పంచులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వెల్లడించారు. ‘‘పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.7,500కోట్లు సర్పంచులు, పాలకవర్గ సభ్యుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఫలితంగా నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. నిధుల అంశంపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో చర్చించడానికి విజయవాడకు వచ్చిన సర్పంచులను బెదిరించి, పోలీసులతో నెట్టివేయించారు. వారికి కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా సుమారు 100మంది సర్పంచులను అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికైన సర్పంచులపై దౌర్జన్యం చేయడం దారుణం’’ అని మండిపడ్డారు.


నీచ రాజకీయాల కోసం అధికారుల సమయాన్ని వృథా చేస్తారా!

దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా తప్పులను వెతికి, ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించేందుకు... సీబీఐ, ఈడీలకు చెందిన మూడు వందలకుపైగా అధికారులు 3 నెలల నుంచి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 500కు పైగా సోదాలు చేపట్టినా ఒక్క ఆధారం కూడా చిక్కలేదు. అసలు ఆయన తప్పు చేస్తే కదా. నీచ రాజకీయాల కోసం అధికారుల విలువైన సమయాన్ని వృథా చేయడం సబబేనా? ఇలాగైతే దేశం ఎలా పురోగమిస్తుంది?

  - కేజ్రీవాల్‌


యువతకు ఏం చేస్తున్నారో భాజపా నేతలు చెప్పాలి

ఉత్తర్‌ప్రదేశ్‌లో సరైన విద్యా విధానం లేదు. విద్యార్థులందరికీ పుస్తకాలు లేవు. ఫీజులను ఇబ్బడి ముబ్బడిగా పెంచేశారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఊసే లేదు. భాజపా సర్కారు యువతకు ఏం ప్రయోజనం చేకూర్చుతోందో ఆ పార్టీ నేతలే చెప్పాలి.   

-అఖిలేశ్‌ యాదవ్‌


జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలంటే మోదీకి భయమా?

ఐరాస మానవ హక్కుల మండలిలో చైనాకు భారత్‌ ఎందుకు సాయం చేయాలనుకుందో ప్రధాని మోదీ చెబుతారా? తమ దేశంలోని వీగర్లపై డ్రాగన్‌  మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న తీర్మానంపై ఓటింగ్‌కు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? జిన్‌పింగ్‌ను 18 సార్లు కలిసిన మోదీకి... ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయమా?

- అసదుద్దీన్‌ ఒవైసీ


ఉత్తరాంధ్ర జిల్లాల తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నికుమారి లక్ష్మి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెదేపా అభ్యర్థినిగా చిన్నికుమారి లక్ష్మిని నిలబెడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం పేర్కొన్నారు. ఎంతో పోటీ నెలకొన్నా చివరికి లక్ష్మికి అవకాశం దక్కిందన్నారు.


మోదీని ఢీకొట్టాలంటే సెక్యులర్‌ పార్టీలన్నీ ఏకం కావాలి: వీహెచ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా సర్కారును ఢీ కొట్టాలంటే సెక్యులర్‌ పార్టీలన్నీ ఏకం కావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రచారం కోసమే సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు చేశారని విమర్శించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. భారాస భాజపాకు బీ టీం అని ఆయన ఆరోపించారు. ఆరోగ్యం సహకరించకున్నా, రాహుల్‌ వద్దని వారించినా సోనియాగాంధీ జోడో యాత్రలో పాల్గొన్నారన్నారు. ఆమెకు షూ లేస్‌ కూడా ఆయనే కట్టారన్నారు. అంతకు ముందు సోనియాగాంధీకి షూ లేస్‌ కడుతున్న రాహుల్‌గాంధీ ఫొటో ఫ్లెక్సీకి బషీర్‌బాగ్‌లో వీహెచ్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు క్షీరాభిషేకం చేశారు.


నిస్వార్థ సేవకుడు మోదీ
ప్రధానిపై భాజపా నేతల ప్రశంసలు

దిల్లీ: ప్రజా పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయనపై భాజపా నేతలు శుక్రవారం ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయన నాయకత్వాన్ని శ్లాఘించారు. దేశానికి ఆయన చేస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు. 2001, అక్టోబరు 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రజాసేవ ప్రస్థానం ప్రారంభించిన మోదీ పాలన వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకువస్తూ శక్తిమంతమైన, మరింత ఆత్మ విశ్వాసం కలిగిన భారతదేశ నిర్మాణం కావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీకి అభినందన సందేశాలు తెలిపిన వారిలో కేంద్రమంత్రులు భూపేంద్ర యాదవ్‌, హర్దీప్‌సింగ్‌ పురి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని