Munugode Bypoll: 47 మంది అభ్యర్థులు.. 3 ఈవీఎంలు

మునుగోడు ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్‌ పత్రాలు ఆమోదం పొందిన 83 మంది అభ్యర్థుల్లో 36 మంది.. చివరి రోజైన సోమవారం తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు.

Updated : 18 Oct 2022 07:36 IST

మునుగోడులో నామినేషన్లు ఉపసంహరించుకున్న 36 మంది
స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు
‘కారు’ను పోలినవి వద్దంటూ హైకోర్టుకు తెరాస
నేడు విచారణ జరుపుతామన్న ధర్మాసనం

ఈనాడు, నల్గొండ- చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: మునుగోడు ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్‌ పత్రాలు ఆమోదం పొందిన 83 మంది అభ్యర్థుల్లో 36 మంది.. చివరి రోజైన సోమవారం తమ పత్రాలను ఉపసంహరించుకున్నారు. మొత్తం 130 మంది అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయగా.. అందులో 47 తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఒక్కో ఈవీఎం (బ్యాలెట్‌ యూనిట్‌- బీయూ)లో 16 మంది అభ్యర్థుల పేర్లకే అవకాశం ఉంది. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య 47 ఉండడంతో ప్రతి బూత్‌లో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు. అభ్యర్థుల పేర్లు, గుర్తుతో పాటు, వారి ఫొటోలు కూడా ఈవీఎంలలో ఉంటాయని తెలిపారు. మూడు ఈవీఎంలకు కలిపి ఒక ‘నోటా’ గుర్తు ఉంటుంది.  

యుగతులసి పార్టీకి రోడ్‌రోలర్‌

బరిలో ఉన్న 47 మంది అభ్యర్థుల్లో తెరాస, భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీలు గుర్తింపు పొందిన పార్టీలు కాగా.. మిగతా వారిలో ఇతర పార్టీలకు చెందిన వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు సోమవారం రాత్రి రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) జగన్నాథ్‌రావు, ఎన్నికల పరిశీలకులు గుర్తులు కేటాయించారు. తెరాస తమ గుర్తయిన కారును పోలిన ట్రక్కు, ట్రాక్టర్‌, రోడ్‌రోలర్‌ సహా పలు గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని ఇప్పటికే ఈసీని కోరిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికలో ట్రక్కు, ట్రాక్టర్‌ గుర్తులను ఎవరికీ కేటాయించలేదు. రోడ్‌రోలర్‌ గుర్తును ముగ్గురు స్వతంత్రులు కోరగా.. లాటరీ విధానంలో యుగతులసి పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన శివకుమార్‌ కొలిశెట్టికి కేటాయించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న కేఏపాల్‌కు ఉంగరం గుర్తు లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని