కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్‌ అంగీకారం

ఇజ్రాయెల్‌ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్‌.. రఫాపై దాడి ఖాయమని టెల్‌ అవీవ్‌ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది.

Updated : 07 May 2024 06:08 IST

రఫాపై దాడికి ఇజ్రాయెల్‌ సన్నద్ధమైన గంటల్లోనే బెట్టు సడలింపు
హమాస్‌ ప్రతిపాదన మా డిమాండ్లకుఅనుగుణంగా లేదు
రఫాపై సైనిక చర్య కొనసాగుతుంది
టెల్‌అవీవ్‌ ప్రకటన

జెరూసలెం: ఇజ్రాయెల్‌ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్‌.. రఫాపై దాడి ఖాయమని టెల్‌ అవీవ్‌ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. ఈజిప్టు, ఖతార్‌ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే హమాస్‌ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, రఫా ఆపరేషన్‌ కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ ఉద్ఘాటించింది. ‘‘హమాస్‌పై సైనిక ఒత్తిడి పెంచడానికి, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడానికి, ఇతరత్రా యుద్ధ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సైనిక చర్య తప్పదు. ఇజ్రాయెల్‌ డిమాండ్లకు అనుగుణంగా ఒప్పందం ఖరారుకోసం మా ప్రతినిధుల్ని చర్చలకు పంపుతాం’’ అని ప్రధాని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అంతకుముందు రఫా నగరాన్ని వీడి వెళ్లాల్సిందిగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన అల్‌-మవాసీ వైపునకు తరలివెళ్లడం కూడా ప్రారంభించారు. ఏ క్షణమైనా రఫాపై ఇజ్రాయెల్‌ దాడికి సిద్ధమవుతుందన్న సంకేతాలూ వెలువడ్డాయి. గాజాలో సైరన్లు మోగాయి. ఇక దాడే తరువాయి అన్న పరిస్థితుల్లో కాల్పుల విరమణకు హమాస్‌ అంగీకరించిందన్న ప్రకటనతో గాజాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి.

షరతులపై అయోమయం

ఏ ఒప్పందానికి హమాస్‌ అంగీకరించిందన్న విషయంపైనా స్పష్టత రాలేదు. 40 రోజుల కాల్పుల విరమణ.. 33 మంది బందీల విడుదల.. ప్రతిగా భారీస్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల ప్రతిపాదనకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది. అయితే ఇప్పుడు హమాస్‌ అంగీకరించిన విరమణకు ఇజ్రాయెల్‌ సమ్మతించడం లేదు. తాము తెలిపిన ప్రతిపాదన ఇది కాదని మాత్రం స్పష్టంచేస్తోంది.

కాల్పుల విరమణకు తమ నేత ఇస్మాయిల్‌ హనియా అంగీకరించినట్లు హమాస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఆయన ఖతార్‌ ప్రధానికి, ఈజిప్టు ఇంటెలిజెన్స్‌ మంత్రికి కూడా ఫోన్‌ చేసి చెప్పినట్లు పేర్కొంది. తొలి నుంచి హమాస్‌ శాశ్వత కాల్పుల విరమణను కోరుతోంది. అయితే తాత్కాలిక విరమణకు మాత్రమే అంగీకరిస్తామని ఇజ్రాయెల్‌ చెబుతోంది. మరిప్పుడు ఏ ప్రతిపాదనకు హమాస్‌ అంగీకరించిందన్న విషయంపై స్పష్టత రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని