icon icon icon
icon icon icon

‘జీతంగా.. ప్రభుత్వ సొమ్ము’ విపక్షాలపై దుమ్ము

తన ఐదేళ్ల పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాలేదు.. ప్రైవేటులో ఉపాధి పెంచడానికీ మనసొప్పలేదు.. కానీ తనను పొగుడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే.. తన ‘సామాజిక’ సైనికులకు మాత్రం.. జీతాల రూపంలో సర్కారు సొమ్మును కుమ్మరించారు జగన్‌.

Updated : 07 May 2024 08:35 IST

వైకాపా సోషల్‌ మీడియా ప్రతినిధులుగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు
వీరిలో ఆర్టీజీఎస్‌, ఏపీఎండీసీ, ఈ-ప్రగతి.. తదితర సంస్థల వారే అధికం
ప్రజాధనం తీసుకుంటూ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ..
ఈనాడు, అమరావతి

తన ఐదేళ్ల పాలనలో..
ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతులు రాలేదు..
ప్రైవేటులో ఉపాధి పెంచడానికీ మనసొప్పలేదు..
కానీ తనను పొగుడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ
సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే..
తన ‘సామాజిక’ సైనికులకు మాత్రం..
జీతాల రూపంలో సర్కారు సొమ్మును కుమ్మరించారు జగన్‌.

ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పొరుగు సేవలు, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న వారు ఎవరైనా కూడా... రాజకీయ పార్టీలకు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష ప్రచారం చేయకూడదు. ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా, పార్టీలను తిడుతూ పోస్టింగ్‌లు వంటివి పెట్టకూడదు. ఈ నిబంధన అతిక్రమిస్తే శిక్షార్హులు అవుతారు. కానీ, వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల్లో... ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలామంది వైకాపా సోషల్‌ మీడియా విభాగాల ప్రతినిధులుగా, జిల్లా, రీజినల్‌ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు చూస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు   వ్యతిరేకంగా విచ్చలవిడిగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులతోనూ కలిసి ప్రచారం చేస్తున్నారు. వీరు తమ అసలు విధులేవీ సక్రమంగా నిర్వహించరు. డ్యూటీలకూ హాజరుకారు.  అయినాసరే ఠంచన్‌గా ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు మాత్రం అందుతాయి. ఇంత జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు కళ్లకు గంతలు   కట్టేసుకున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలాడిస్తూ వీరికి జీతాలిస్తూ జీ... హుజూర్‌! అంటున్నారు. దాదాపు అన్ని జిల్లాల వైకాపా సామాజిక మాధ్యమ కోఆర్డినేటర్లూ ఏదో ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులుగా జీతాలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సలహాదారుడి కుమారుడి నేతృత్వం

వైకాపా సామాజిక మాధ్యమ విభాగానికి ప్రభుత్వంలో ఓ కీలక సలహాదారు కుమారుడే నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఆధీనంలోనే వీరంతా పనిచేస్తుంటారు. ఆయనే వైకాపా మద్దతుదారులైన వీరికి ప్రభుత్వ జీతాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. సీఎం జగన్‌ బస్సుయాత్రలో భాగంగా   ఏప్రిల్‌లో విశాఖపట్నం జిల్లా ఆనందపురం వద్ద వైకాపా సామాజిక మాధ్యమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. దీనికి ఆ సలహాదారు కొడుకే సారథ్యం వహించాడు. అక్కడకు వందల సంఖ్యలో వైకాపా సామాజిక మాధ్యమ ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద, పొరుగుసేవల విభాగంలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం.

వారి జోలికి వెళ్లడానికి భయం

వైకాపా కార్యకర్తలను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌), డిజిటల్‌ కార్పొరేషన్‌, ఏపీఎండీసీ, ఈ-ప్రగతి... ఇలా అనేక విభాగాల్లో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు, పొరుగు సేవల  ఉద్యోగులుగా చూపిస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉండే ఆర్టీజీఎస్‌లో నిత్యం విధులకు హాజరయ్యే  ఉద్యోగుల సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. కానీ, రికార్డుల్లో మాత్రం పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. వారంతా బయట వైకాపాకి పనిచేస్తుంటారు. ఏళ్ల తరబడి అసలు కార్యాలయాలకే రారు. సీఎంవోలో పనిచేసే ఓ ఉద్యోగి భార్య... ఆర్టీజీఎస్‌లో ఉద్యోగిగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ఆమె ఎప్పుడూ విధులకు హాజరుకాలేదు. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. ఆర్టీజీఎస్‌లో జీతం తీసుకుంటూ, వేరే ఇతర పనులు చేసుకునేవారి సంఖ్య కూడా ఎక్కువే. ఏపీఎండీసీలోనూ ఇదే జరుగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సిఫార్సులతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన వాళ్లకు పెద్ద సంఖ్యలో  ఏపీఎండీసీలో ఉద్యోగాలు ఇచ్చారు. వీరిలో చాలామంది చిత్తూరు జిల్లాలో వైకాపాకి పని చేస్తుంటారు. కొందరు సీఎంవోలో లాబీయింగులు  చేస్తుంటారు.

విచారణ జరిగితే జైలుకే...

ప్రభుత్వ జీతాలను తీసుకుంటూ.. వైకాపా సామాజిక మాధ్యమ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై విచారణ జరిపితే... వారంతా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కొందరు తమ  సామాజిక మాధ్యమ పోస్టుల్లో  దూషణలతో రెచ్చిపోతున్నా సరే.. ఆయా శాఖల అధికారులు  చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వం మారాక దీనిపై విచారణ జరిగితే.. ఇలా సహకరించిన అధికారులు కూడా శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు తీసుకుంటూ, ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో  పోస్టింగ్‌లు పెడుతుంటే.. ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు  తీసుకోవడంలేదనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.


కూటమిపై అక్కసు... రోజుకు 50 పోస్ట్‌లు

ఈయన పేరు వర్రా రవీంద్రారెడ్డి. పులివెందుల సమీపంలోని కొండ్రెడ్డిపల్లె స్వగ్రామం. 2019 వరకు భారతీ సిమెంట్స్‌ పరిశ్రమలో అతి తక్కువ జీతానికి పనిచేసేవాడు. గతంలో ఓ ఛానల్‌ న్యూస్‌ రీడర్‌పై వివాదాస్పద పోస్టులు పెడితే పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో వైకాపా పెద్దల దృష్టిలో పడ్డాడు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక అతనికి ఆర్టీజీఎస్‌లో ఉద్యోగం ఇచ్చారు. పేరుకే ఉద్యోగం... పూర్తిగా వై.ఎస్‌.ఆర్‌. జిల్లాలోనే ఉంటూ సామాజిక మాధ్యమాల్లో వైకాపాకి అనుకూలంగా పెద్దఎత్తున పోస్టులు పెడుతుంటాడు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, ఆ పార్టీల మహిళా నేతలపై అసభ్య పదజాలంతో, ఇష్టానుసారం బూతులతో రోజుకు 50-60 వరకు పోస్టులు పెట్టి ఆనందం పొందుతుంటాడు. వాటిలో మార్ఫింగ్‌ ఫొటోలూ ఉంటాయి. అందుకు అతనికి నెలకు రూ.70 వేల చొప్పున ఆర్టీజీఎస్‌  నుంచి జీతం ఇప్పిస్తున్నారు.


ఆర్టీజీఎస్‌లో డైరెక్టర్‌... కడప వైకాపాలో డైరెక్షన్‌

వైకాపా అధినేత జగన్‌ ఫొటోతో ‘మేము సిద్ధం... మా బూత్‌ సిద్ధం’ అనే పోస్టర్‌లో ఉన్న ఈయన పేరు పోతుల శివారెడ్డి. కడప నగర శివారు రూకవారిపల్లె స్వగ్రామం. ఆయనో వైకాపా నాయకుడని అనుకుంటే పొరపడినట్లే. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆర్టీజీఎస్‌లో డైరెక్టర్‌ పోస్టులో ఉన్నాడు. ఆయన నెల జీతం లక్ష రూపాయలపైనే. చాలాకాలంగా వైకాపాకి ప్రచారం చేస్తూ.. ఆ జిల్లాలో వైకాపా సామాజిక మాధ్యమ బాధ్యతలను చూస్తున్నాడు. ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో వైకాపాకి అనుకూలంగా... తెదేపా, జనసేన, భాజపాలకు వ్యతిరేకమైన పోస్టులే ఉంటాయి. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా... ఎలాంటి భయం లేకుండా వైకాపా అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నాడు.


విధులు మరచి... జగనన్న సేవలో తరించి!

ఈయన పేరు పులివెందుల వివేక్‌రెడ్డి. వైకాపా సామాజిక మాధ్యమ విభాగం వై.ఎస్‌.ఆర్‌. జిల్లా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతన్ని ఆర్టీజీఎస్‌ ఉద్యోగిగా చూపించి ప్రభుత్వ ఖజానా నుంచి జీతం ఇస్తున్నారు. ఇతని ఫేస్‌బుక్‌ ఖాతాలోనూ వైకాపా అనుకూల పోస్టులే. ఇటీవల పులివెందుల నియోజకవర్గ పరిధిలో జగన్‌ సతీమణి భారతి ఎన్నికల ప్రచారం చేస్తే దర్జాగా పాల్గొన్నాడు. తరచూ వైకాపాకి అనుకూలంగా ఫేస్‌బుక్‌లో లైవ్‌ చర్చలు నిర్వహిస్తుంటాడు.


‘కోడ్‌’ ఉన్నా... ఆగని కూతలు!

ఇతని పేరు నిరంజన్‌రెడ్డి. వై.ఎస్‌.ఆర్‌. జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేలంపల్లి స్వస్థలం. ఈయన కూడా ఆర్టీజీఎస్‌ ఉద్యోగే. ఆ విషయాన్ని మరచి సామాజిక మాధ్యమాల ద్వారా వైకాపాకి దర్జాగా ప్రచారం చేస్తుంటాడు. ఇతడి ఫేస్‌బుక్‌ ఖాతా నిండా జగన్‌ అనుకూల పోస్టులే. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా సరే రోజుకు పదుల సంఖ్యలో పోస్టులు పెడుతున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img