పవన్‌కు నాడు అడ్డంకులు... నేడు రక్షణ

ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరుకున్న పవన్‌కు పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది రక్షణగా ఉన్నారు.

Updated : 12 Nov 2022 10:05 IST

మోదీని కలిసేందుకు వచ్చిన జనసేన అధినేతకు ప్రత్యేక భద్రత

ఈనాడు, విశాఖపట్నం: ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరుకున్న పవన్‌కు పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది రక్షణగా ఉన్నారు. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి హోటల్‌కు ఆయన చేరుకునేటంత వరకు ప్రత్యేక భద్రత కల్పించారు. హోటల్‌ వద్ద కూడా ఎక్కడా ఆటంకం లేకుండా చూశారు. గత నెల 15న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటనలో పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. దాంతో నాటికీ నేటికీ ఎంత మార్పు అన్న అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. నాడు విమానాశ్రయంలో ర్యాలీగా బయలుదేరినప్పటి నుంచి... మార్గమధ్యంలో పవన్‌ను నిలిపేసే వరకూ తీవ్ర ఇబ్బందులు పెట్టారు. భద్రతా కారణాలను సాకుగా చూపించి జనసేన శ్రేణులను హడలుగొట్టారు. పవన్‌ బస చేసిన హోటల్‌లో అర్ధరాత్రి తనిఖీలు చేసి, పార్టీ నాయకులను అరెస్టు చేశారు. ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించకుండా పలు నిబంధనలు పేర్కొన్నారు. నాడు అలా వ్యవహరించిన పోలీసు యంత్రాంగం శుక్రవారం మాత్రం జాగ్రత్తపడడం గమనార్హం.


13న విజయనగరం జిల్లాలో పవన్‌ పర్యటన

ఈనాడు,అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  13న విజయనగరం జిల్లా గుంకలాం గ్రామంలో పేదలందరికీ ఇళ్ల పథకం అమలు తీరును పరిశీలించనున్నారు. ఆ గ్రామంలో 397 ఎకరాల్లో పేదలందరికీ పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్‌ ఆ ఇళ్లకు కూడా శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. గుంకలాంను నగర పంచాయతీ చేస్తామని, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పుడు గుంకలాంలో పేదల ఇళ్ల నిర్మాణ పరిస్థితి ఎలా ఉందో, ఇళ్లు ఏ స్థాయికి వచ్చాయో జనసేన అధినేత పవన్‌ స్వయంగా పరిశీలించనున్నారు. పథకం అమలు తీరుపై లబ్ధిదారులతో మాట్లాడి స్వయంగా వివరాలు తెలుసుకోనున్నారు.


జగనన్న ఇళ్ల కాలనీలపై సోషల్‌ ఆడిట్‌

జనసేన పార్టీ జగనన్న ఇళ్ల కాలనీలపై సోషల్‌ ఆడిట్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆ పార్టీ విమర్శించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు జగనన్న ఇళ్ల నిర్మాణం ఎలా ఉందో పరిశీలించడంతో పాటు సంబంధిత వివరాలను, వారి పరిశీలన ఫలితాలను సామాజిక మాధ్యమాల్లో 14న జగనన్న మోసం హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు చేయనున్నారు. ఈ సందర్భంగానే విజయనగరం జిల్లాలో పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని