ఆర్జీయూకేటీ మూసివేతకు కేసీఆర్‌ కుట్ర

పేద పిల్లలు చదువుకునే బాసర ఆర్జీయూకేటీ మూసివేతకు సీఎం కేసీఆర్‌ కుట్రకు తెరతీశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు.

Published : 03 Dec 2022 05:08 IST

బండి సంజయ్‌ ఆరోపణ

నిర్మల్‌, న్యూస్‌టుడే: పేద పిల్లలు చదువుకునే బాసర ఆర్జీయూకేటీ మూసివేతకు సీఎం కేసీఆర్‌ కుట్రకు తెరతీశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. అందులో భాగంగానే విద్యార్థులకు సరైన తిండి, సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం నిర్మల్‌ జిల్లా నందన్‌ గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో, నర్సాపూర్‌(జి) వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లిక్కర్‌, డ్రగ్స్‌, జూదం, అవినీతి కేసుల్లో సీఎం కేసీఆర్‌ కుటుంబం మునిగిపోయిందన్నారు. మద్యం కుంభకోణంలో కేసీఆర్‌ కుమార్తెకు ఈడీ నోటీసులిస్తే తెలంగాణ సెంటిమెంటు రగిలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ లోపాల పుట్ట అని.. ప్రభుత్వ పొరపాట్లతో లక్షలాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. భాజపా అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారనే ఆరోపణలను సంజయ్‌ తిప్పికొట్టారు. వాటన్నింటినీ మరింత మెరుగ్గా అమలు చేసి తీరుతామన్నారు. దళితబంధు అడిగిన పాపానికి మహిళలపైనా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. బాధ్యులను వదిలిపెట్టేది లేదన్నారు. నిర్మల్‌ జిల్లాలో మంత్రి, తెరాస నేతల భూకబ్జాల చిట్టా తమ వద్ద ఉందని, భాజపా అధికారంలోకి రాగానే ఆ భూములను పేదలకు పంచుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, యాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని