సీమకు వైకాపా ఏం చేసింది?

అధికారంలో ఉన్న వైకాపా సీమగర్జన పేరిట ప్రజలను సమీకరించి ఆందోళనలు చేయించడం.. తన నెత్తిపై తానే రాయి వేసుకున్నట్లుగా ఉందని భాజపా నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ విమర్శించారు.

Updated : 05 Dec 2022 09:25 IST

అమరావతిలోనే హైకోర్టు అని సుప్రీంకోర్టుకు చెప్పి..  కర్నూలులో సభలేంటి?
భాజపా నేత టీజీ వెంకటేశ్‌

ఈనాడు, అమరావతి: అధికారంలో ఉన్న వైకాపా సీమగర్జన పేరిట ప్రజలను సమీకరించి ఆందోళనలు చేయించడం.. తన నెత్తిపై తానే రాయి వేసుకున్నట్లుగా ఉందని భాజపా నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ విమర్శించారు. మూడు రాజధానుల పేరిట ప్రభుత్వం త్రిశంకుస్వర్గంలో, గాలిమేడల్లో విహరిస్తోందని ఎద్దేవాచేశారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భాజపా ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌ను అమలు చేయాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పలుసార్లు ముఖ్యమంత్రికి లేఖలు రాసినా స్పందించలేదు. దీనిపై జగన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలి. చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తానంటే.. జగన్‌ ఏకంగా హైకోర్టు ఇస్తామన్నారు. దేనికీ దిక్కులేదు. పైగా, ప్రభుత్వం హైకోర్టు అమరావతిలో ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టులో తన న్యాయవాదితో చెప్పించింది. అందుకు విరుద్ధంగా ప్రజలతో ఉద్యమాలు చేయిస్తోంది. మంత్రి బుగ్గన దీనిపై స్పందించాలి. వికేంద్రీకరణతో ప్రయోజనం ఉండదు. హైకోర్టు రాజధానిలోనే ఉండాలి. బెంచి, మినీ సచివాలయం మరోచోట ఏర్పాటు చేయొచ్చు. జమ్మూ-కశ్మీర్‌, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ ఇలాగే ఉన్నాయి. ఏపీ రాజధాని అమరావతే అన్నది మా పార్టీ విధానం’ అని స్పష్టం చేశారు.

సీమకు జగన్‌ ద్రోహం

జగన్‌ ప్రభుత్వం రాయలసీమలో పరిశ్రమలకు భూములు కేటాయించిందా? సాగునీటి ప్రాజెక్టులు కట్టించిందా? అని టీజీ వెంకటేశ్‌ ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వ బిల్లులకు పార్లమెంటులో వైకాపా మద్దతు ఇస్తున్నందున.. భాజపా కూడా ఆ పార్టీని అదే దృష్టితో చూస్తోంది. అంతమాత్రాన పాలనలో లోపాలను చూస్తూ ఊరుకోదు. ప్రత్యేక హోదాపై వైకాపా, తెదేపా రెండూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అది ముగిసిన అధ్యాయం. సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇప్పటికీ దిక్కులేదు. కర్నూలులో హైకోర్టు విషయంలోనూ ఎవరిపైనో బాణాన్ని గురిపెట్టి మనపైనే వేసుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది. గుజరాత్‌ ఎన్నికలు ముగింపునకు వచ్చినందున ఇక ఆంధ్రాపై భాజపా దృష్టి సారిస్తుంద’ని టీజీ వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని