పెట్రోల్‌, డీజిల్‌లపై అధిక పన్నులు నిజమే!

పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం అధిక పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Published : 10 Mar 2021 01:29 IST

కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్‌ గాంధీ

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం అధిక పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌లపై సామాన్య ప్రజలనుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ.. వారి మిత్రులకు పన్నులు, రుణాలను రద్దు చేస్తోంది. కేంద్ర మంత్రి ప్రకటనతో ఇదే విషయం స్పష్టంగా తెలిసింది’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో విమర్శించారు. గడిచిన ఏడేళ్లలో ఇంధన ధరలు రెట్టింపు అయ్యాయని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పార్లమెంటులో చేసిన ప్రకటను ప్రస్తావిస్తూ ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ స్పందించారు.

వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర గత ఏడేళ్లలో రెట్టింపై ప్రస్తుతం రూ.819కి చేరుకుందని పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో సోమవారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పెట్రోలు, డీజిల్‌పై పన్నులు రూపేణా 2013లో రూ.52,537 కోట్లు లభిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలల్లో రూ.2.94 లక్షల కోట్లు వచ్చిందని తెలిపారు. గత ఏడేళ్ల కాలంలో పెట్రోల్‌, డీజిల్‌లపై పన్నుల శాతం దాదాపు 459శాతం పెరిగినట్లు వెల్లడైంది.

భాజపా ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోన్న కాంగ్రెస్‌, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ విమర్శనాస్త్రాలకు మరింత పదునుపెడుతోంది. 2014 ఎన్డీయే అధికారంకి వచ్చిన అనంతరం ఇప్పటివరకు పెట్రోలియం ఉత్పత్తులపై దాదాపు రూ.21లక్షల కోట్లను వసూలు చేసిందంటూ విమర్శిస్తోంది. ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టిందో కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని పట్టుబడుతోంది. ఇదే విషయంపై చర్చ జరగాలని పార్లమెంట్‌ రెండో రోజు సమావేశాల్లోనూ పట్టుబట్టిన కాంగ్రెస్‌ సభను స్తంభింపజేసింది.

 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts