
భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా
హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసాపట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి వివరాలు వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్‌షాకు మంత్రి వివరించారు.
మరోవైపు భైంసా అల్లర్ల ఘటనలో బాధితులకు న్యాయం జరగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోం మంత్రి, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. చట్ట వ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదని చెప్పారు. సమాజ పురోగతిలో శాంతి, సామరస్యాలు కీలకమన్నారు.
ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భైంసా పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎస్సై, కానిస్టేబుల్‌తో సహా పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వారుకూడా ఉన్నారు.