Maharashtra: ‘పవార్‌ సాహెబ్‌ మాటే వింటాం’.. అజిత్‌పై సంజయ్‌ రౌత్‌ విమర్శలు!

అజిత్‌ పవార్‌ (Ajit Pawar) తన అనుకూల వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భాజపా (BJP)లో చేరనున్నారనే వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. శరద్‌ పవార్‌ (Sharad Pawar) మాట మాత్రమే వింటామని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం (UBT) ప్రకటిస్తే.. అజిత్‌ భాజపాలో చేరితే, ప్రభుత్వంలో కొనసాగలేమని ఏక్‌నాథ్‌ శిందే వర్గం హెచ్చరించింది. 

Published : 20 Apr 2023 01:40 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎన్‌సీపీ (NCP) నేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar) భాజపా (BJP)లో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో శివసేన పార్టీకి చెందిన ఇరువర్గాల నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) మాట మాత్రమే వింటామని శివసేన (ఉద్ధవ్‌ బాల్‌సాహెబ్‌ ఠాక్రే -UBT ) నేత సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut)ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీకి చెందిన నేతలు ఎన్సీపీ అధికార ప్రతినిధుల్లా మాట్లాడుతున్నారంటూ అజిత్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. దీంతో అజిత్‌ పవార్‌ పార్టీ వీడుతారా? లేక ఎన్సీపీలోనే కొనసాగుతురా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

‘‘ఎన్సీపీ ఎప్పటికీ భాజపాతో కలవదు. పార్టీలో ఎవరైనా వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే.. దాంతో ఎన్సీపీకి ఎలాంటి సంబంధం ఉండదని ఉద్ధవ్‌ ఠాక్రేతో శరద్‌ పవార్‌ చెప్పారు. నా నిజాయితీ గురించి శరద్‌ పవార్‌ సాహెబ్‌ ప్రశ్నించవచ్చు. నేను ఆయన మాటే వింటాను. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరిగాయా? లేదా? అనేది అజిత్‌ దాదా చెప్పాలి. శివసేనను వాళ్లు విడతీయలేదా? ఎన్సీపీని రెండుగా చీల్చేందుకు ప్రయత్నాలు జరగలేదా? దీని గురించి చెప్పడంలో తప్పేముంది?’’ అని శివసేన (UBT) అధికారిక పత్రిక సామ్నాలో ‘‘నిజం ఎవరినైనా బాధిస్తుంది’’ అనే పేరుతో సంజయ్‌ రౌత్‌ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. 

పార్టీ మారుతున్నారనే వార్తలపై అజిత్‌ పవార్‌ సైతం స్పందించారు. ‘‘నేను జీవించి ఉన్నంత కాలం ఎన్సీపీ బలోపేతానికి కృషి చేస్తా. నాకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి భాజపాలో చేరుతున్నాననే వార్తల్లో నిజం లేదు. పార్టీ సమావేశం జరిగిన ప్రతిసారీ ఇతర పార్టీ ప్రతినిధులు ప్రశ్నలు లేవనెత్తుతారు. వారు ఎన్సీపీ అధికార ప్రతినిధుల్లా మాట్లాడుతున్నారు’’ అని సంజయ్‌ రౌత్‌ను ఉద్దేశించి అజిత్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. 

అజిత్‌ పవార్ భాజపాలో చేరితే.. తాము ఆ పార్టీతో కలిసి పనిచేయలేమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివనసేన ఏక్‌నాథ్‌ శిందే వర్గం ప్రకటించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ శిర్సత్‌ మాట్లాడుతూ ‘‘ కాంగ్రెస్‌-ఎన్సీపీతో కలిసి ఉండలేకే మహావికాశ్ అగాఢీ(MVA) కూటమి నుంచి బయటికి వచ్చాం. అజిత్‌ పవార్‌కు ఎన్సీపీలో స్వేచ్ఛ లేదు. ఆయన మాత్రమే పార్టీని వీడితే.. స్వాగతిస్తాం. కానీ, ఆయన ఎమ్మెల్యేలతో కలిసి భాజపాలో చేరితే.. మేం ప్రభుత్వంలో భాగస్వామ్యంగా కొనసాగలేం’’ అని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని