Kichha Sudeep: కిచ్చా సుదీప్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?

కన్నడ పాపులర్‌ హీరో కిచ్చా సుదీప్‌(Kichha Sudeep)  రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌ ముఖ్యనేత డీకే శివకుమార్‌(DK Shivakumar)తో కలిసి ఆయన ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడమే అందుకు కారణం..!

Published : 04 Feb 2023 01:44 IST

బెంగళూరు: ప్రముఖ కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్‌ (Kichha Sudeep) రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఆయన కాంగ్రెస్‌తో కలిసి నడుస్తారా? కాంగ్రెస్‌ సీనియర్‌ నేతతో సుదీప్‌ కలిసి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఇప్పుడు ఇదే కర్ణాటక సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌, ఆ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్‌ (DK Shivakumar) సుదీప్‌తో సమావేశమైన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సుదీప్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఈ ఏడాదిలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka elections 2023) జరగనున్న వేళ డీకే శివకుమార్ బెంగళూరులోని సుదీప్‌ నివాసానికి వెళ్లి సమావేశం కావడంతో ఈ చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌-కాంగ్రెస్‌ల సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైనా.. కొందరు ఎమ్మెల్యేలు భాజపా (BJP)లోకి ఫిరాయించడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి 2019లో కాషాయ పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. దీంతో ఈసారి అధికారంలోకి రావాలన్న కసితో కాంగ్రెస్‌ (Congress) తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే వివిధ రూపాల్లో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడ ప్రముఖ సినీ నటుడు సుదీప్‌తో భేటీ అయిన డీకే శివకుమార్‌.. ఆయన్ను స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, సుదీప్‌తో భేటీలో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయా? అతడి రాజకీయ అరంగేట్రంపై ఏమైనా చర్చ జరిగిందా? లేదా? అనే విషయాలను మాత్రం డీకే శివకుమార్‌ ధ్రువీకరించలేదు. ఈ ఊహాగానాలపై కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇది మర్యాదపూర్వక భేటీయే అయి ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నట్టు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

సీరియల్‌ నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన సుదీప్‌ ‘తాయవ్వ’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన సహాయ నటుడిగా పనిచేశారు. ‘స్పర్శ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ ఆయన నటించారు. ‘ఈగ’తో తెలుగువారికీ సుపరిచితులయ్యారు. ఇటీవల ఆయన నటించిన ‘విక్రాంత్‌ రోణ’తో విజయాన్ని అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని