BRS: భారాస నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్‌

భారాస నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు.

Updated : 10 Apr 2023 12:47 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని భారాస సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది. భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

కొల్లాపూర్‌కు చెందిన జూపల్లి కృష్ణారావు గతకొంతకాలంగా భారాసపై అసంతృప్తితో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో ఆయనకు విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో బహిరంగంగానే ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వంపై జూపల్లి విమర్శలు చేశారు. కొల్లాపూర్‌ భారాసలో జూపల్లి వర్గం అసమ్మతి కారణంగా నష్టం జరుగుతోందని ఆ పార్టీ భావించింది. దీంతో గతంలో మంత్రి కేటీఆర్‌ సైతం ఆయనతో మాట్లాడినా ఫలితం లేకపోయింది.

మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గతకొంతకాలంగా కేసీఆర్‌, భారాసపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారతారని ఇటీవల ప్రచారం జరుగుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. కొద్దిరోజులుగా ఆత్మీయ సమావేశాల పేరుతో జిల్లాలోని తన వర్గం నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. ఆయా సమావేశాల్లో కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూపల్లి, పొంగులేటిని భారాస సస్పెండ్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని