ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా కొందరు ఉన్నతాధికారులు వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి మేలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 01 May 2024 09:55 IST

ఒకటో తరగతి ప్రవేశాల జాబితా వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా 25,125 మంది తల్లిదండ్రులకు సందేశాలు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా కొందరు ఉన్నతాధికారులు వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి మేలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూతన విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలి. ఒకటో తరగతిలో ప్రవేశాలకు గతంలో ప్రకటన జారీచేసి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు... మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 25,125 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో 827 మంది అర్హత సాధించారని, వారంతా మే10 లోపు ఆయా పాఠశాలల యాజమాన్యాలను కలిసి వివరాలు, ధ్రువపత్రాలు అందజేయాలని తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపారు. ఎంపికైన విద్యార్థి, పాఠశాల పేరు, కేటగిరీ, ఆధార్‌ వివరాల జాబితాను డీఈఓలకు పంపించారు.

ఇది కోడ్‌ ఉల్లంఘనే

విద్యార్థులకు ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. పాఠశాలలు తిరిగి జూన్‌ 12న ప్రారంభం కానున్నాయి. అయితే మే 10లోగా విద్యార్థులు యాజమాన్యాలను కలవాలని చెప్పడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనేనని పలువురు చెబుతున్నారు. మే 13న ఎన్నికలు ఉండగా ఆ లోగా వెళ్లాల్సిన అవసరం ఏముందని, విద్యార్థులకు 25% ఉచిత సీట్లు కేటాయించినట్లు చూపించి ఓట్లు పొందాలనే ఎత్తుగడ వేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇది ఎన్నికల స్టంటేనని పలువురు తల్లిదండ్రులు విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని