icon icon icon
icon icon icon

డిప్యూటీ సీఎంపై.. ‘సీఎం’దే పైచేయి

ఉత్తరాంధ్ర ముఖద్వారం అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం. ఓ పక్క నిండైన గ్రామీణ వాతావరణం.. మరోవైపు విశాఖ నగరాన్ని ఆనుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కలగలిసి ఉన్న ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు వేదికగా మారింది.

Published : 01 May 2024 06:13 IST

ఆసక్తికరంగా అనకాపల్లి రాజకీయం
కూటమి లోక్‌సభ అభ్యర్థిగా పట్టుబిగిస్తున్న సీఎం రమేష్‌
అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ముందడుగు
ప్రభుత్వ వ్యతిరేకతతో వైకాపా అభ్యర్థుల ఎదురీత

ఉత్తరాంధ్ర ముఖద్వారం అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం. ఓ పక్క నిండైన గ్రామీణ వాతావరణం.. మరోవైపు విశాఖ నగరాన్ని ఆనుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కలగలిసి ఉన్న ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు వేదికగా మారింది. కూటమి తరఫున లోక్‌సభ అభ్యర్థిగా నిలిచిన రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్‌ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో అనుభవం ఉన్న నాయకుడు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు వైకాపా నుంచి పోటీ పడుతున్నారు. గట్టి పోటీగా మారుతుందని భావించినా తాజా రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలు, ప్రయత్నాలు, పోటీ తీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో సీఎం రమేష్‌ పట్టు బిగించినట్లు కనిపిస్తోంది. పోటీకి దిగిన కొద్ది రోజుల్లోనే ఆయన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరుచుకుని, పావులు కదుపుతున్నారు. ఒకానొక దశలో వైకాపా తన అభ్యర్థి ముత్యాలనాయుణ్ని మార్చే ఆస్కారమూ ఉందన్న ప్రచారం జరిగింది. రమేష్‌ పట్టు బిగించారనడానికి ఇదొక దృష్టాంతం. ఆయన ముందు నుంచి వ్యూహాత్మకంగానే ఈ స్థానాన్ని ఎన్నుకుని, ఇక్కడ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపులోనూ రమేష్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకరికి ఒకరు బలమవుతున్నారు.

బూడి నెగ్గుకురాగలరా?

మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపొంది, వైకాపా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బూడి ముత్యాలనాయుణ్ని ఆ పార్టీ అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన విద్యార్హతలు, గ్రామీణ నేపథ్యంతో.. దిల్లీలో లోక్‌సభలో ఎంత వరకు నెగ్గుకురాగలరనే చర్చ ప్రజల్లో ఉంది. ఎప్పటి నుంచో రాజ్యసభ సభ్యుడిగా ఉండి, దిల్లీలో లాబీయింగ్‌ చేసే సత్తా ఉన్న నాయకుడు సీఎం రమేష్‌ నియోజకవర్గానికి రావడాన్ని అనకాపల్లి ప్రజలు ఆహ్వానిస్తున్నారు. భాజపా అభ్యర్థి కావడంతో కేంద్రంతో సంప్రదించి, నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తారనే విశ్వాసం ఆయనకు సానుకూలంగా మారింది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల్లోనే రమేష్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఆయన కుటుంబసభ్యులంతా అనకాపల్లిలో ఇల్లు తీసుకుని, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. భాజపా స్థానిక నాయకుల సహకారం తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో శాసనసభ స్థానం బాధ్యతలు తీసుకుని అక్కడ అన్ని పార్టీల నేతలను సమన్వయం చేస్తున్నారు. మూడు, నాలుగు సంస్థలతో సర్వేలు చేయిస్తూ, ప్రజాభిప్రాయం, రాజకీయ సమీకరణాలపై సమాచారం సేకరిస్తూ తదనుగుణంగా శాసనసభ నియోజకవర్గ అభ్యర్థుల పరంగానూ సమన్వయం చేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఇబ్బంది ఉందో గుర్తిస్తూ అక్కడ రమేష్‌ బృందం వాలిపోతోంది. ఇక్కడ కమలం గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లడం కొంత సవాల్‌గా ఉండటంతో భాజపా అనుబంధ సంస్థలతో కలిసి ఈ విషయంలో ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. వైకాపా అభ్యర్థి ముత్యాలనాయుడికి జగన్‌ ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన ప్రతికూలాంశం. శాసనసభ నియోజకవర్గాల అన్నింటిలోనూ అధికార వైకాపా నాయకుల అరాచకాలు ఆయనకు ప్రతికూలంగానూ, కూటమికి అనుకూలంగానూ మారుతున్నాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో తెదేపా, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలిచాయి.


ధర్మశ్రీకి కష్టకాలం
నియోజకవర్గం: చోడవరం

ప్రస్తుత ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఈ ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నారు. మాటకారితనంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా నియోజకవర్గంలో ఏ సమస్యలూ పరిష్కరించకపోవడం ఆయనకు ప్రతికూలంగా మారింది. భీమిలి- నర్సీపట్నం రోడ్డు సింహభాగం చోడవరం నియోజకవర్గం మీదుగా వెళ్తుంది. నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో చేపట్టిన ఈ పనులు ముందుకు సాగలేదు. ఈ రోడ్డు అధ్వానంగా ఉండటం, నియోజకవర్గంలో వైకాపా పెద్దల అక్రమాలు ధర్మశ్రీకి వ్యతిరేకత పెంచుతున్నాయి. నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య  విభేదాలను సర్దిపుచ్చడానికే ఈయన సమయం సరిపోతోంది. తెలుగుదేశం నుంచి ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు  మళ్లీ బరిలో నిలిచారు. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు కలిసొచ్చేలా ఉంది. అంతర్గతంగా ఉన్న ఇబ్బందులను సర్దుబాటు చేసుకుని సమష్టిగా ఎన్నికల బరిలో పోరాడుతుండటం విజయావకాశాలను మెరుగుపరుస్తోంది.


దూసుకుపోతున్న అనిత
నియోజకవర్గం: పాయకరావుపేట

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూటమి అభ్యర్థిగా తన వాక్చాతుర్యంతో నియోజకవర్గంలో దూసుకువెళ్తున్నారు. క్యాడర్‌ అంతా కలిసి వచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు కలిసొచ్చే అంశంగా ఉన్నాయి. అదే సమయంలో వైకాపా అభ్యర్థి కంబాల జోగులు నియోజకవర్గానికి కొత్త కావడంతో ఇంకా సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు. పార్టీ క్యాడర్‌ మధ్య సమన్వయం లేదు. అవన్నీ సరిదిద్దే నాయకుడు లేకపోవడం వైకాపాకు ప్రతికూలాంశం. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. కోటవురట్ల మండలంలో వంతెనల నిర్మాణం పూర్తవలేదు. వరాహ నదిపై తెదేపా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించినా వైకాపా ప్రభుత్వం రూ.50 లక్షలతో అప్రోచ్‌ రోడ్డు వేయకపోవడం విమర్శలపాలవుతోంది. తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలు మూతపడి కార్మికులు రోడ్డునపడగా.. బకాయిలు అందక చెరకు రైతులు నష్టపోయారు. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వైకాపాకు ప్రతికూలతను, కూటమికి విజయావకాశాలను పెంచుతున్నాయి.


కూటమి, సామాజిక బలంతో పంచకర్ల
నియోజకవర్గం: పెందుర్తి

కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌ ఎన్నికల బరిలో దూసుకువెళ్తున్నారు. మూడు లక్షలకు పైగా ఓట్లున్న ఈ నియోజకవర్గంలో అందులో సగం ఓట్లున్న పెందుర్తి మండలంలో తెదేపాకు పట్టు ఎక్కువ. ఈ అర్బన్‌ ప్రాంతంలో మొత్తం 15 మంది కార్పొరేటర్లు తెదేపాకు చెందినవారే. ఇక్కడ 15 పంచాయతీలు తెదేపాకు అనుకూలం. ఇక్కడ తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండి బాబ్జి, పీలా శ్రీనివాస్‌ తదితరులు కూడా కలిసి పని చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు కూడా పంచకర్ల రమేష్‌కు కలిసొచ్చేలా ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి అదీప్‌రాజ్‌కు పార్టీ క్యాడర్‌ పరంగానూ సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తలను, క్యాడర్‌ను సరిగా పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో మండలానికో నాయకుడు అధికార పార్టీ తరఫున ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశారు. ఇక్కడి పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కాలేదు. పరవాడ ఫార్మా కాలుష్యం వల్ల తాడి గ్రామం తరలింపు వ్యవహారమూ మూలనపడింది. ఇవన్నీ వైకాపా అభ్యర్థికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.


జగన్‌ కక్ష సాధింపులే... తెదేపాకు అదనపు బలం
నియోజకవర్గం: నర్సీపట్నం

కూటమి నుంచి తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ పడుతున్నారు. చివరిసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వైకాపా ప్రభుత్వం ఆయనపై పెట్టిన కేసులు, ఇబ్బంది పెట్టిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి. జగన్‌ను నేరుగా విమర్శించడంతో ఆయనపై ప్రభుత్వం ఇలా కక్ష సాధించిందని మెజారిటీ ప్రజానీకం భావిస్తోంది. ఇది అయ్యన్నపాత్రుడికి ఎన్నికల్లో కలిసిరానుంది. వైకాపా నుంచి మళ్లీ బరిలో నిలిచిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌కు పరిస్థితి ఆశాజనకంగా లేదు. పార్టీ వ్యతిరేకత, చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయకపోవడం, పాత తరం నాయకులను ఆకట్టుకోలేకపోవడం, సీనియర్‌ నేతలు పూర్తిగా వెంట నిలవకపోవడం ఈయనకు ప్రతిబంధకాలు. ఎమ్మెల్యే వెంట నడిచేవారిలో ప్రజాబలం లేని వారే ఎక్కువ. రెండు జిల్లాల్లో 77 గ్రామాలకు లబ్ధి కలిగించే తాండవ, ఏలేరు అనుసంధానం ప్రాజెక్టుకు పాలనామోదం వచ్చినా పనులు ప్రారంభం కాలేదు. నర్సీపట్నం పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తి కాలేదు. నర్సీపట్నం మంచినీటి పథకం నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేయడమూ ప్రజలకు నచ్చలేదు. అయ్యన్నపాత్రుడు తెదేపా ద్వితీయశ్రేణి నాయకులను మరింత సమన్వయం చేసుకోవాల్సి ఉంది. కొన్ని మండలాల్లో వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు పెరిగాయి. అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి పనులూ కలిసిరావచ్చు.


కొణతాల వ్యక్తిత్వం అదనపు బలం
నియోజకవర్గం: అనకాపల్లి అసెంబ్లీ

జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న కొణతాల రామకృష్ణ మంత్రిగా, ఎంపీగా పని చేశారు. ఉత్తరాంధ్ర సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు, విద్యావంతుడిగా, అభివృద్ధి పట్ల అంకితభావం ఉన్న నాయకుడిగా ఉన్న పేరు ఆయనకు ప్రధాన బలం. జనసేన పార్టీపై అభిమానం, తెలుగుదేశం, భాజపా బలం కలిసి నియోజకవర్గంలో పోటీని ఒక వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ‘నేను వైకాపా అభిమానినే. కానీ కొణతాల రామకృష్ణకు ఓటేస్తా’ అని చెప్పిన వారూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిత్వం ఆశించిన పీలా గోవింద్‌ ఈ స్థానాన్ని గెలిపించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. వైకాపా అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌కు రాజకీయ నేపథ్యం ఉన్నా తొలిసారి ఎన్నికల బరిలో నిలవడంతో ఆటుపోట్లు తప్పడం లేదు. పార్టీ క్యాడర్‌, కార్యకర్తల మద్దతుతో పాటు సొంత సామాజికవర్గం నుంచి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా ఆ విషయంలో అనుమానాలున్నాయి. ఇక్కడ వైకాపా నుంచి గెలిచి మంత్రిగా ఉన్న గుడివాడ అమర్‌నాథ్‌పై నెలకొన్న వ్యతిరేకత, ఆయన సామాజికవర్గంలో ఉన్న అసంతృప్తి భరత్‌ను ఇబ్బంది పెడుతున్నాయి.


అంది పుచ్చుకుంటే ‘విజయ’కుమారే!
నియోజకవర్గం: ఎలమంచిలి

తెదేపా, భాజపా మద్దతుతో జనసేన నుంచి సుందరపు విజయ్‌కుమార్‌ ఎన్నికల బరిలో నిలిచారు. పాత ఓట్ల చరిత్ర పరిశీలిస్తే ఈ కలయిక విజయంలో కీలకపాత్ర పోషించేలా ఉంది. వైకాపా నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తిరాజు (కన్నబాబు) తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీలోని లుకలుకలతో కొందరు నాయకులు సహకరించడం లేదు.  నియోజకవర్గంలో భూదందాలు, ఆక్రమణలు, ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు, సమస్యలు పరిష్కరించకపోవడమే కాదు తన మాట తీరు కూడా కన్నబాబుకు ప్రధాన ప్రతిబంధకాలు. తెదేపా క్యాడర్‌, నాయకులను సుందరపు విజయకుమార్‌ మరింత అక్కున చేర్చుకుని ముందుకు కదిలితే ఆయన గెలుపు నల్లేరుపై నడకే. తెదేపా నుంచి అభ్యర్థిత్వం ఆశించిన ప్రగడ నాగేశ్వరరావు  క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఎక్కువ. వరాహ నది నుంచి రూ.100 కోట్లతో మంచినీటి పథకం నిర్మించేందుకు ఏర్పాట్లు చేసినా పనులు పూర్తి కాలేదు. వైకాపా అభ్యర్థి రమణమూర్తిరాజు పోల్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యమూ ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేస్తుంది.


హోరాహోరీ నుంచి.. తెదేపాకు బలం దిశగా!
నియోజకవర్గం: మాడుగుల

ఉప ముఖ్యమంత్రి, సిటింగ్‌ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు లోక్‌సభ బరిలో నిలవడంతో ఆయన కుమార్తె అనురాధ ఇక్కడ వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. ముత్యాలనాయుణ్ని ఎంపీ అభ్యర్థిగా పంపడంతో మాడుగుల అసెంబ్లీ సీటును పలువురు నేతలు ఆశించారు. ఆయన కుమార్తెకే అవకాశం ఇవ్వడంపై ఆశావహుల్లో అసంతృప్తి ఉంది. అనురాధకు రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీ క్యాడర్‌ పూర్తిగా కలిసి రాకపోవడం, ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం వైకాపాకు ప్రతిబంధకాలుగా మారాయి. కూటమి నుంచి తెదేపా అభ్యర్థిగా చివర్లో బండారు సత్యనారాయణమూర్తి బరిలోకి వచ్చారు. తొలుత పైలా ప్రసాదరావుకు అభ్యర్థిత్వం దక్కింది. తెదేపా అభ్యర్థిత్వం ఆశించిన రామానాయుడు సైతం నామినేషన్‌ వేశారు. వారిద్దరినీ ఒప్పించి పోటీ నుంచి తప్పించారు. ఇక్కడ నాయకులందరినీ సమన్వయం చేసే బాధ్యత లోక్‌సభ భాజపా అభ్యర్థి సీఎం రమేష్‌ తీసుకున్నారు. నియోజకవర్గంలో భూఆక్రమణలు, అవినీతి అక్రమాలు అధికార పార్టీకి  ప్రతిబంధకం కానున్నాయి. దేవస్థానం భూముల ఆక్రమణలూ కీలకాంశమయ్యాయి. నియోజకవర్గంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగులోనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. క్రమేణా కూటమి బలం పుంజుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img