వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్‌, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు.

Updated : 01 May 2024 06:52 IST

వేకువజామున 5.30 గంటలకే  ఘటన మీకెలా తెలిసింది?
ఆ రోజు అవినాష్‌రెడ్డి.. భారతితో  ఫోన్‌లో ఏం మాట్లాడారు?
దర్యాప్తుకు ఢోకా లేదని కోర్టును ఎందుకు నమ్మించారు?
మీ వరకు వచ్చేసరికి విచారణ ఎందుకు సాగట్లేదు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
సీఎం దంపతులకు సునీత డిమాండ్‌

ఈనాడు, కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. పులివెందులలో వివేకా హత్య జరిగిన ఇంట్లోనే మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఘటన రోజు పరిణామాలు, తర్వాత దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన వివరాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తాను చెబుతున్నవన్నీ దర్యాప్తు వివరాలకు దగ్గరగా ఉన్నవేనని వివరించారు.

‘‘మాజీ సీఎస్‌ అజేయ కల్లం సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఉదయం 5 నుంచి 5.30 మధ్యలోనే భారతికి, జగన్‌కు వివేకా చనిపోయారనే విషయం తెలుసు. ఘటనాస్థలంలో అవినాష్‌రెడ్డి ఉదయం 5 నుంచి 5.17 వరకు ఎవరికి ఫోన్లు చేశారు? హత్య విషయం తెలిసిన తర్వాత 6.32కు అవినాష్‌రెడ్డి.. ముఖ్యమంత్రి నివాసంలో సహాయకుడు నవీన్‌కు ఫోన్‌ చేసి భారతితో ఆరు నిమిషాలు మాట్లాడారు.. ఇవిగో కాల్‌ రికార్డులు. అప్పుడు భారతితో ఏం మాట్లాడారో చెప్పాలి. భారతితో మాట్లాడినట్లు.. సీబీఐ విచారణలో తేలింది. భారతిరెడ్డితో మాట్లాడిన తర్వాతే మృతదేహం వద్ద ఉన్న సాక్ష్యాధారాలను తుడిచేశారనే అనుమానాలు ఉన్నాయి. అజేయ కల్లంకు వివేకా చనిపోయిన విషయం తెలియజేసిన జగన్‌ను, ఇంకా భారతిని సీబీఐ ఎప్పుడు విచారిస్తుంది? ఇంకా దర్యాప్తు చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా ప్రశ్నలకు సమాధానాలు రావట్లేదు. నేరస్థులకు అండగా ఉంటున్న జగన్‌.. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వారసులు ఎలా అవుతారు?’’ అని సునీత నిలదీశారు.

శివశంకర్‌రెడ్డి అరెస్టుతో వణుకు ఎందుకు?

వివేకా హత్యకేసులో ఐదో నిందితుడు శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన తర్వాతే.. జగన్‌, అవినాష్‌రెడ్డిలో వణుకు మొదలైందని సునీత అన్నారు. శివశంకర్‌రెడ్డి తమ పేర్లు ఎక్కడ చెబుతారోననే భయంతో నిందితులను వెనకేసుకొచ్చేందుకు జగన్‌ ప్రయత్నించారని ఆరోపించారు. 2021 నవంబరు 18న శివశంకర్‌రెడ్డి అరెస్టయితే.. మర్నాడే అవినాష్‌రెడ్డికి క్లీన్‌చిట్‌ ఇచ్చేలా అసెంబ్లీలో జగన్‌ మాట్లాడారని సునీత ఆధారాలను చూపించారు.

ఆరోజు 5.30కే భారతికి ఎలా తెలిసింది?

మాజీ సీఎస్‌ అజేయ కల్లం సీబీఐకి వాంగ్మూలం ఇవ్వలేదని కేసు పెట్టారు గానీ, కోర్టులో సీబీఐ ఆడియో రికార్డింగ్‌ సమర్పించిందని తెలిపారు. ‘ఉదయం 5 గంటలకే జగన్‌ ఇంట్లో భేటీ జరిగింది. తర్వాత అరగంటకే.. అంటే 5.30 సమయంలో భారతి పిలుస్తున్నారని సహాయకుడు చెప్పడంతో జగన్‌ వెళ్లిపోయారు. భారతి వద్దకు వెళ్లి తిరిగి వచ్చాక చిన్నాన్న చనిపోయినట్లు జగన్‌ సమావేశంలో వివరించారు. అవినాష్‌రెడ్డికి అదేరోజు ఉదయం 6.26కు ఫోన్‌ వచ్చింది. 6.27కు అవినాష్‌రెడ్డి.. వివేకా ఇంటి బయటకు వెళ్లి ఫోన్‌లో మాట్లాడారు. ఉదయం 6.32కు భారతి సహాయకుడు నవీన్‌తో అవినాష్‌ మాట్లాడారు. ఆ ఆరు నిమిషాలు ఏం మాట్లాడుకున్నారో తెలియట్లేదు. ఓఎస్డీ కృష్ణమోహన్‌, శివప్రకాష్‌రెడ్డితోనూ మాట్లాడారు. ఉదయం 7-8 గంటల సమయంలో హత్యాస్థలాన్ని శుభ్రం చేశారు. హత్య జరిగిందని తెలిసీ, భారతితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత సాక్షి ఛానల్‌లో గుండెపోటు అని ఎలా వచ్చింది? మర్నాడు ఏ ఆధారాలతో నారాసుర రక్తచరిత్ర అని సాక్షిలో రాశారు? ఆరు నెలల పాటు జగన్‌ ప్రభుత్వం చేతిలోనే దర్యాప్తు నడిచింది. అప్పుడు బాధ్యులను గానీ, మమ్మల్ని గానీ ఎందుకు అరెస్టు చేయలేదు? మేము ఇద్దరం కాకుండా మరెవరో అయితే ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని సునీత ప్రశ్నించారు.

భారతీ.. సంబంధం లేదంటారా?

వివేకా హత్యతో తమకు సంబంధం లేదనే విధంగా భారతి రెండు రోజుల కింద మాట్లాడారని సునీత తెలిపారు. మీ మామగారు వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు స్పందించకపోతే ఎలా భారతీ? అంటూ ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఎలా సాగుతోందో ఎప్పుడైనా ఆరాతీశారా? అని నిలదీశారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా న్యాయం కోసం పోరాడుతున్న వారికి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీతోనూ కుమ్మక్కు కాలేదన్న సునీత.. న్యాయం కోసం అందరినీ.. అన్ని పార్టీలనూ కలుస్తానన్నారు. సీబీఐ దర్యాప్తు కోరిన జగన్‌.. తర్వాత దర్యాప్తు అక్కర్లేదని 2020 ఫిబ్రవరిలో హైకోర్టులో మెమో దాఖలు చేశారని, సమగ్రంగా దర్యాప్తు చేయించుకోవాల్సిన నైతిక బాధ్యత జగన్‌పై ఉందని న్యాయస్థానం పేర్కొన్నట్లు తెలిపారు. దర్యాప్తునకు ఢోకాలేదని న్యాయస్థానాన్ని నమ్మించే ప్రయత్నం జగన్‌ చేశారని తెలిపారు. జగన్‌తో నిందితులు, వారి కుటుంబసభ్యులు కలిసిన చిత్రాలను సునీత విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని