icon icon icon
icon icon icon

అభివృద్ధి, సంక్షేమం.. సమతూకం

తెదేపా, జనసేన మ్యానిఫెస్టో సూపర్‌ హిట్‌..! అది కేవలం ఎన్నికల మ్యానిఫెస్టో మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు దర్పణం!

Updated : 01 May 2024 10:38 IST

తెదేపా-జనసేన మ్యానిఫెస్టోలో బీసీలు, మహిళలు, యువతకు సముచిత ప్రాధాన్యం
ఉద్యోగ, వ్యాపార వర్గాలకు భరోసా
బ్రాహ్మణులకు ఎనలేని ప్రాధాన్యం
వివిధ వర్గాల అభ్యున్నతికి విప్లవాత్మక నిర్ణయాలు
రాష్ట్ర భవిష్యత్తుకు, అభివృద్ధికి అదో దార్శనిక పత్రం
జగన్‌ విధ్వంస పాలనలో దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు విస్తృత కసరత్తు

ఈనాడు, అమరావతి: తెదేపా, జనసేన మ్యానిఫెస్టో సూపర్‌ హిట్‌..! అది కేవలం ఎన్నికల మ్యానిఫెస్టో మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు దర్పణం! అభివృద్ధినీ, సంక్షేమాన్నీ సమతుల్యం చేస్తూ.. రాష్ట్ర భవిష్యత్తుకు మేలు బాటలు వేసేందుకు రూపొందించిన దార్శనిక పత్రం! అణగారిన వర్గాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, వారి సామాజిక అభ్యున్నతికి భరోసానిచ్చేందుకు ఎంతో శ్రద్ధతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల వారికి నెలకు రూ.4 వేల చొప్పున 50 సంవత్సరాలకే పింఛను, ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఉచిత ఇసుక, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, పేదలకు గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు దానిలో ఉన్నాయి. వైకాపా ఐదేళ్ల అరాచక పాలనలో విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు, దెబ్బతిన్న వర్గాలకు భరోసానిచ్చేందుకు మ్యానిఫెస్టోలో విస్తృత కసరత్తు చేశారు. మిత్రపక్షం భాజపా సూచనలు, సలహాలకు ప్రాధాన్యమిస్తూ, తెెదేపా, జనసేనలు మంగళవారం విడుదల చేసిన సంయుక్త మ్యానిఫెస్టోతో ఎన్‌డీయేలోని మూడు పార్టీల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఆ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళితే చాలు... ఎన్‌డీయే ఘన విజయం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీలకు మ్యానిఫెస్టోలో పెద్దపీట వేశారు. మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు, యువత ఉపాధికి, అభ్యున్నతికి విశేష ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ, భవిష్యత్తుకు భరోసానిస్తూ, సముచిత అవకాశాలు కల్పిస్తామన్న నమ్మకం కలిగిస్తూ..విస్తృత కసరత్తు చేసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. జనసేన ‘షణ్ముఖ వ్యూహాన్ని’ మేళవించి తెదేపా సూపర్‌ సిక్స్‌ పేరుతో విడుదల చేసిన మినీ మ్యానిఫెస్టో ఇప్పటికే విశేషంగా ప్రజల ఆదరణ చూరగొనగా, ఇప్పుడు విడుదల చేసిన పూర్తిస్థాయి మ్యానిఫెస్టో మరింత సమగ్రంగా, సంపూర్ణంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

50 ఏళ్లకే పింఛనుతో కొత్తగా లక్షల మందికి లబ్ధి

సామాజిక పింఛన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచడం, దివ్యాంగులకు రూ.6 వేలు చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాలకు 50 ఏళ్లకే పింఛను..వంటివి చరిత్రాత్మక నిర్ణయాలు. సామాజిక పింఛన్లకు సంబంధించి మొదటి నుంచి అనేక విప్లవాత్మక విధానాలు ప్రవేశపెట్టిన తెదేపా.. మరోసారి తనదైన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రంలో మొదట ఎన్టీఆర్‌ హయాంలోనే సామాజిక పింఛన్లను విస్తృత స్థాయిలో ప్రవేశపెట్టగా.. రూ.200గా ఉన్న పింఛన్‌ మొత్తాన్ని 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెండు దఫాల్లో పదిరెట్లు పెంచి ఏకంగా రూ.2 వేలు చేశారు. దివ్యాంగులకు రూ.3 వేలకు పెంచారు. ఇప్పుడు పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచడం వల్ల ఇప్పటి వరకు ఉన్న 66 లక్షల మంది పింఛనుదారులకు మేలు జరగడంతోపాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్లకు, మిగతా అందరికీ 60 ఏళ్లకు పింఛను వర్తింపజేస్తారు. దీనివల్ల కొత్తగా మరికొన్ని లక్షల మందికి పింఛను అందుతుంది.

రూ.25 లక్షల ఆరోగ్య బీమా చారిత్రక నిర్ణయం!

ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేయడం ప్రజారోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది. ప్రస్తుతం సాధారణ, మధ్యతరగతి వర్గాల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే కుటుంబం మొత్తం ఆర్థికంగా కుంగిపోతోంది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పూర్తిస్థాయిలో వైద్య అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక ప్రైవేటు ఆసుపత్రులు ఉచిత వైద్యానికి నిరాకరిస్తున్నాయి. ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమాతో.. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మెరుగైన ఆసుపత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని సామాన్య ప్రజలకు కల్పించడం కంటే వారికిచ్చే భరోసా ఇంకేముంటుంది..! ఇది అమలైతే ప్రతి కుటుంబం భవిష్యత్‌పై బెంగలేకుండా గుండెలపై చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు.

బీసీలకు భరోసా

వెనుకబడినవర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి, భద్రతకు మ్యానిఫెస్టోలో అనేక కీలక నిర్ణయాలు ప్రకటించారు. బీసీలకు రక్షణ చట్టం, బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల ఖర్చు, స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్‌, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, బీసీల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల వ్యయం, రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం, చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల వేతనం వంటి అనేక విశేష నిర్ణయాలను మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

ఉచిత ఇసుకతో లక్షల మందికి లబ్ధి!

రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది నిర్మాణ రంగమే. కొన్ని లక్షల మంది కార్మికులు, వ్యాపారులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయగా.. జగన్‌ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వ అస్తవ్యస్త ఇసుక విధానం, దోపిడీ వల్ల నిర్మాణరంగం కుదేలైపోయింది. లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారు. వైకాపా నాయకులు మొత్తం ఇసుక రీచ్‌లన్నీ గుప్పిట్లో పెట్టుకుని భారీ దందా నడిపారు. రీచ్‌లలో టన్ను ఇసుక అధికారికంగానే రూ.475 చెల్లించి కొనుక్కోవలసి వచ్చింది. స్టాక్‌ పాయింట్లలో వాళ్లు చెప్పిన ధరకు కొనాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంతాల్లో సొంతంగా ఇల్లు కట్టుకునే పేదవాడూ, సమీపంలోని వాగులోంచి బండెడు ఇసుక తీసుకెళ్లాలన్నా... వైకాపా నాయకులకు కప్పం కట్టాల్సిందే. తెదేపా-జనసేన ప్రకటించిన ఉచిత ఇసుక విధానం వల్ల నిర్మాణరంగం ఊపిరిపీల్చుకుంటుంది. ఇసుక తవ్వి తీసేందుకయ్యే ఖర్చు, రవాణా ఛార్జీలు పెట్టుకుంటే చాలు... ఎంత కావాలంటే అంత ఇసుక ఉచితంగా తెచ్చుకోవచ్చు.

బ్రాహ్మణులకు సముచిత ప్రాధాన్యం

కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న బ్రాహ్మణులకు తెదేపా-జనసేన మ్యానిఫెస్టోలో విస్తృత ప్రాధాన్యమిచ్చారు. బ్రాహ్మణుల్లో కటిక పేదలు ఉండటంతో వారిని ఆదుకునేందుకు అనేక నిర్ణయాలు ప్రకటించారు. తెదేపా 2014లో అధికారంలోకి వచ్చాక వారి కోసం మొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా పైకితెచ్చేందుకు కొన్ని కార్యక్రమాల్ని చేపట్టింది. ఈ మ్యానిఫెస్టోలో దాన్ని మరింత విస్తృతపరిచింది. వార్షిక ఆదాయం రూ.50 వేలకు పైన ఉన్న ఆలయాల్లోని అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలకు, రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచడం వారికి ఎంతో ఊరటనిస్తుంది. తితిదే సహా అన్ని దేవాలాయాల ట్రస్ట్‌ బోర్డుల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడం, వేద విద్య చదువుకున్న నిరుద్యోగులకు రూ.3 వేల భృతి వంటి నిర్ణయాలు వారికెంతో మేలు చేస్తాయి.


మహిళలే మహరాణులు

తెదేపా ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్వావలంబనకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఈ మ్యానిఫెస్టోలో మహిళా సాధికారతకు అనేక పథకాలను ప్రకటించింది. కట్టెలపొయ్యిపై వంట చేసే క్రమంలో పొగ మొత్తం ఊపిరితిత్తుల్లోకి చేరి మహిళలు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండటంతో...1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేంద్రంలోని వాజపేయీ ప్రభుత్వాన్ని ఒప్పించి దీపం పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు ఉచితంగా స్టౌలు, రాయితీలపై సిలిండర్లు అందజేశారు. ప్రస్తుతం కొన్ని లక్షల దీపం కనెక్షన్లు ఉన్నాయంటే అది చంద్రబాబు చొరవే. ప్రస్తుతం సిలిండర్‌ ధర దాదాపు రూ.825కు చేరడంతో పేదల కుటుంబాలు మళ్లీ కట్టెలపొయ్యిలనే ఆశ్రయిస్తున్నాయి. ఇప్పుడు ఎన్‌డీయే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం వల్ల దీపం కనెక్షన్లతోపాటు, తెల్లరేషన్‌కార్డు కలిగిన మరికొన్ని లక్షల కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుంది. కట్టెల పొయ్యిలకు మంగళం పాడవచ్చు.


మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

  • మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరో కీలక నిర్ణయం. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణల్లో ఈ పథకం సూపర్‌ హిట్టయింది. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం మోపింది. ముఖ్యంగా పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించేవారిపైనే అధిక భారం పడింది. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులు, వ్యాపారాలు, ఇతర అవసరాల నిమిత్తం మహిళలు షేర్‌ ఆటోల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వీరందరికీ పెద్ద ఊరట.
  • గతంలో తెదేపా ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం ఇచ్చేది. జగన్‌ అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.3 లక్షలకు కుదించారు. దాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని తెదేపా-జనసేన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. దీని వల్ల 1.10 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది.

యువతపై వరాల జల్లు

జగన్‌ 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా యువతకు అనేక హామీలిచ్చి వారిని మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక వారికి తీరని ద్రోహం చేశారు. మెగా డీఎస్సీ వేస్తానని చెప్పి..ఐదేళ్లపాటు ఊరించి... ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి నెల రోజుల ముందు కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ వల్ల ఆ ప్రక్రియా నిలిచిపోయింది. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని చెప్పి, ఒకే ఒక్కసారి ప్రకటించి, ఆ పోస్టులను కూడా భర్తీ చేయలేదు. గతంలో తెదేపా ప్రభుత్వం అమలు చేసిన నిరుద్యోగ భృతినీ నిలిపివేశారు. అటు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు లేక, ఇటు ఉపాధినిచ్చే పరిశ్రమలనూ తీసుకురాకపోవడంతో..చదువుకున్న లక్షల మంది యువత తీవ్ర నిరాశానిస్పృహల్లో ఉన్నారు. వారి ఆవేదనను తీర్చేందుకు, అండగా నిలిచేందుకు తెదేపా-జనసేన మ్యానిఫెస్టోలో అనేక వరాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ వంటి..యువతలో ఆనందోత్సాహాలను నింపే అనేక నిర్ణయాలను ప్రకటించారు. తెదేపా అధికారంలోకి వస్తే గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందంటూ వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. వాలంటీర్లకు ఇప్పుడిస్తున్న రూ.5 వేల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని తెదేపా-జనసేన ప్రకటించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img