Tollywood: ‘తుపాకీ పట్టి..’ బాక్సాఫీస్‌కు గురిపెట్టి!

కథానాయకులిచ్చే ప్రేమ గులాబీలు అందుకుంటూ.. వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని మరో కోణాన్ని పరిచయం చేస్తున్నారు. తుపాకీ పట్టి యాక్షన్‌ తూటాలు పేలుస్తూ బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 01 May 2024 09:44 IST

కథానాయకులిచ్చే ప్రేమ గులాబీలు అందుకుంటూ.. వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని మరో కోణాన్ని పరిచయం చేస్తున్నారు. తుపాకీ పట్టి యాక్షన్‌ తూటాలు పేలుస్తూ బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇప్పుడిలా రివాల్వర్‌ రాణీల్లా తెరపై సందడి చేయనున్న ఆ నాయికలెవరు? వారి చిత్ర విశేషాలేంటి?

థానాయికల సుకుమారమైన చేతుల్లో అందమైన గులాబీలు దర్శనమివ్వడం పరిపాటే. కానీ, ఆ కోమలాంగులు తుపాకులు పట్టుకొని శత్రుమూకలపై శివంగుల్లా విరుచుకుపడటం అరుదుగా కనిపిస్తుంటుంది. ఇప్పుడీ తరహా యాక్షన్‌ కోణమున్న పాత్రలతోనే అలరించేందుకు పలువురు నాయికలు సిద్ధమవుతున్నారు. అగ్ర కథానాయిక సమంత ఈ మధ్య ఎక్కువగా యాక్షన్‌ పాత్రలతోనే ప్రయాణిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ‘యశోద’తో పాటు ‘ది ఫ్యామిలీమ్యాన్‌ 2’ కోసం తుపాకీ పట్టి స్టైలిష్‌ యాక్షన్‌తో తెరపై మెరిపించింది. అయితే ఇప్పుడామె ‘మా ఇంటి బంగారం’ కోసం డబుల్‌బ్యారెల్‌ గన్‌ను భుజానికెత్తుకుంది. ఇది సామ్‌ సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌పై నిర్మితమవుతున్న తొలి సినిమా. ఇటీవలే దీన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో గన్‌ పట్టుకున్న గృహిణిగా సామ్‌ కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమాతో మలయాళ చిత్రసీమకు చెందిన ఓ కొత్త యువకుణ్ని దర్శకుడిగా పరిచయం చేయనున్నట్లు తెలిసింది. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారని టాక్‌. ఇక సమంత త్వరలోనే ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీ వేదికపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లోనూ సమంత విభిన్న రకాలైన తుపాకుల్ని వినియోగించినట్లు తెలిసింది. మరి ఆ స్టైలిష్‌ యాక్షన్‌ హంగామా ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్య కథలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పిస్తోంది కీర్తి సురేశ్‌. ఆమె ఇటీవలే ‘సైరెన్‌’ కోసం పోలీసు అధికారిణిగా రివాల్వర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ‘రివాల్వర్‌ రీటా’ కోసం మరోసారి గన్స్‌తో హంగామా చేయనుంది. కె.చంద్రు దర్శకత్వంలో రూపొందనున్న ఈ యాక్షన్‌ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కీర్తి ఇందులో మునుపెన్నడూ పోషించని విభిన్నమైన పాత్రలో కనువిందు చేయనుందని తెలిసింది.

పోలీసు సత్యభామ.. శ్రుతి యాక్షన్‌ హంగామా

‘టిల్లు స్క్వేర్‌’లో ఇండియన్‌ స్పెషల్‌ ఫోర్స్‌కు చెందిన స్పైగా లిల్లీ పాత్రలో యాక్షన్‌ హంగామా రుచి చూపించింది అనుపమ పరమేశ్వరన్‌. అందులో విరామ సన్నివేశాల్లో గన్‌ ఫైర్‌ చేస్తూ.. విలన్‌ గ్యాంగ్‌పై అనుపమ శివాలెత్తిన తీరు అందర్నీ మెప్పించింది. ఇప్పుడిదే తరహాలో ‘సత్యభామ’ చిత్రంలో పోలీసుగా గన్‌పట్టి బాక్సాఫీస్‌ బరిలో దూకేందుకు సిద్ధమైంది కాజల్‌ అగర్వాల్‌. సుమన్‌ చిక్కాల తెరకెక్కించారు. విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో కాజల్‌ శక్తిమంతమైన పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా మే 17న థియేటర్లలోకి రానుంది. ‘క్రాక్‌’లో యాక్షన్‌ కోణమున్న పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మురిపించింది శ్రుతిహాసన్‌. ఇప్పుడామె అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్‌’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ ప్రాధాన్యమున్న విభిన్నమైన ప్రేమకథతో రూపొందనున్న చిత్రమిది. ఇందులో శ్రుతి పాత్రలో యాక్షన్‌ మోతాదు ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రంలో శేష్‌- శ్రుతి గన్స్‌ పట్టుకుని ఒకరిపై మరొకరు కాల్పులు జరుపుకోవడం ఆసక్తి రేకెత్తించింది. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని