Mallikarjun Kharge: బాధ్యతతో ఉండాలి.. లేదంటే వైదొలగాలి.. నాయకులకు ఖర్గే హెచ్చరిక!

Mallikarjun Kharge: పార్టీలో అందరూ బాధ్యతగా ఉండాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. అలా ఉండలేని వారు ఇతరులకు అవకాశం కల్పించాలని కోరారు.

Updated : 04 Dec 2022 13:06 IST

దిల్లీ: పార్టీలో పై నుంచి కిందిస్థాయి వరకు సంస్థాగత జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తమ బాధ్యతలను నిర్వర్తించలేని వారు తమ సహచరులకు అవకాశం కల్పించాలని హితవు పలికారు. మరోవైపు రానున్న 30 నుంచి 90 రోజుల్లో ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి కావాల్సిన రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను కోరారు. తాను ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ స్టీరింగ్‌ కమిటీ తొలి సమావేశంలో ఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తూ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘పై నుంచి క్రింది స్థాయి వరకు సంస్థాగత జవాబుదారీతనం అనేది పార్టీ, దేశం పట్ల మన బాధ్యతలో అతి పెద్ద భాగం అని నేను నమ్ముతాను. కాంగ్రెస్ బలంగా, జవాబుదారీగా, ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటేనే ఎన్నికల్లో గెలిచి దేశ ప్రజలకు సేవ చేయగలం’’ అని ఖర్గే అన్నారు. కీలక పదవుల్లో ఉన్న కొంత మంది పార్టీలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలా లేని వారిని పార్టీ కచ్చితంగా విస్మరించాల్సి వస్తుందని ఖర్గే గట్టిగా హెచ్చరించారు.

భారత్‌ జోడో యాత్రను ఖర్గే ప్రశంసించారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సాగుతున్న ఈ యాత్ర చరిత్ర సృష్టిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమం ఇప్పుడు జాతీయ ఉద్యమంగా మారిందన్నారు. దేశంలో అధికార పక్షం రగిలిస్తున్న విద్వేషానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌, సీనియర్‌ నాయకులు పి.చిదంబరం, ఆనంద్‌ శర్మ, మీరా కుమార్‌, అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు. భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు ప్లీనరీ సమావేశాల షెడ్యూల్‌పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని