Telangana News: ఆ విషయంలో మోదీ ప్రభుత్వం చరిత్రలో నిలుస్తుంది: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన డొంక తిరుగుడు ప్రసంగం వారి వైఫల్యాలను

Published : 05 Aug 2022 01:29 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన డొంక తిరుగుడు ప్రసంగం వారి వైఫల్యాలను దాచలేవని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అసత్యాలు పలికారని ఆక్షేపించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు కేంద్ర మంత్రి ఎన్ని డొంక తిరుగుడు మాటలు మాట్లాడినప్పటికీ.. అసమర్ధ ఆర్థిక విధానాలతో దేశానికి కలుగుతున్న దారుణమైన ఫలితాలు, పరిణామాలను దాచలేరని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వంగా మోదీ ప్రభుత్వం చరిత్రలో నిలుస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపాయి బలహీనపడడం, 30 ఏళ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం, నైజీరియా లాంటి దేశాల కన్న తక్కువ స్థాయికి పేదరిక ప్రమాణాల్లో భారత్‌ వెనకబడి ఉండడం వంటి అనేక దుష్పరిణామాలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. సాధారణ ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు ధర భారీగా పెరిగిందని.. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అసమర్ధ ఆర్థిక విధానాల ఫలితమేనని వ్యాఖ్యానించారు.

మోదీ మాటలన్నీ అసత్యాలేనని తేలిపోయింది.. 

ప్రజాస్వామ్య సూచీ మొదలు ప్రతికా స్వేచ్ఛ వరకు, ఆర్థిక అసమానతల నుంచి అవినీతి వరకు ఏ విషయంలోనైనా గ్లోబల్‌ ర్యాంకుల్లో భారతదేశం నేడు తీవ్రంగా వెనకబడి ఉందంటే అది ముమ్మాటికీ మోదీ ప్రభుత్వం వల్లేనని కేటీఆర్‌ అన్నారు. అనాలోచిత డీమానిటైజేషన్‌, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ గత ఎనిమిదేళ్లుగా చతికిలపడిందన్న ఆయన.. నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్న మోదీ మాటలు అసత్యాలేనని తేలిపోయిందని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత సుమారు 68శాతం నగదు అధికంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని.. కేవలం నగదు ముద్రణకే రిజర్వ్‌ బ్యాంకు రూ.8వేల కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. జీఎస్టీ ద్వారా దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని.. అర్థంలేని పన్ను స్లాబ్‌లతో పాటు ప్రజలకు అత్యవసరమైన వస్తువులపై సైతం భారీ పన్నులు విధించి దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. పరిశ్రమను, పారిశ్రామిక వర్గాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. 

ఆ ఘనత మోదీకే దక్కుతుంది..

పాలు, పెరుగు, బియ్యం వంటి అత్యవసర వస్తువులపైనా భారీగా పన్ను మోపిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేనేత వస్త్రాలపైనా జీఎస్టీని మోపిన ఘనత మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పసిపిల్లలు వాడుకునే పెన్సిళ్లు మొదలు ఆసుపత్రుల్లో పడకలు, చివరికి అంత్యక్రియల వరకు అన్నింటిపైనా పన్ను వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెట్రో పన్నుల భారాన్ని కూడా మోపి కేంద్రం దోపిడీకి పాల్పడుతోందని.. పెట్రోల్‌పై రెట్టింపు, డీజిల్‌పై సుమారు నాలుగున్నర రెట్లు పన్ను పెంచిందని ఆరోపించారు. మోదీ ప్రధాని కాకముందు పెట్రో పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు సమానంగా ఆదాయం వస్తుంటే.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా కేంద్రం దాదాపు రెండున్నర రెట్ల ఆదాయాన్ని ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తోందన్నారు. 

గొప్పలు మాని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి..

దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దూరదృష్టి లేకపోవడం, రానున్న సవాళ్లను అంచనా వేయలేకపోవడం, అనాలోచిత నిర్ణయాలు, తమ మిత్రుల భారీ కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చే క్రోనీ క్యాపిటలిజం.. మోదీ ప్రభుత్వ అసలైన ఆర్థిక విధానాలని కేటీఆర్ విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వ్యక్తులు, పార్టీలపై ప్రభుత్వ యంత్రాంగాలను ఉసిగొల్పి విభజించు పాలించు అనే దుర్నీతితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని మంత్రి దుయ్యబట్టారు. ఇప్పటికైనా లేని గొప్పలు చెప్పుకోవడం మాని, దేశ ప్రజల హితం దృష్ట్యా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని